ప్రతిష్టాత్మకం.. వైఎస్సార్‌ నవశకం

CM YS Jagan Comments About YSR Navasakam in Video Conference with Collectors and SPs - Sakshi

20 నాటికి లబ్ధిదారుల తుది జాబితా శాశ్వతంగా ప్రదర్శన 

కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్‌లో సీఎం వైఎస్‌ జగన్‌  

డిసెంబర్‌ 15 నుంచి 18 వరకు లబ్ధిదారుల జాబితాపై సచివాలయాల్లో సోషల్‌ ఆడిట్‌ 

జనవరి 1 నుంచి కొత్త కార్డుల ముద్రణ, వలంటీర్లద్వారా పంపిణీ  

బియ్యం, వైఎస్సార్‌ ఆరోగ్య శ్రీ, వైఎస్సార్‌ పెన్షన్‌ కానుక, జగనన్న విద్యా దీవెన, వసతి కార్డుల జారీ

డిసెంబర్‌ 1 నుంచి ఆరోగ్యశ్రీ కింద శస్త్రచికిత్సలు చేయించుకున్న వారికి ఆర్థిక సాయం

విశ్రాంతిలో రోజుకు రూ.225 లేదా గరిష్టంగా నెలకు రూ.5 వేలు

అర్హులైన లబ్ధిదారులకు జనవరి 1 నుంచి కొత్త కార్డులను ముద్రించి, పంపిణీ చేయాలి. వైఎస్సార్‌ నవశకం మార్గదర్శకాలు చేరని జిల్లాలకు వెంటనే పంపించండి. అర్హులైన ప్రతి వారూ లబ్ధి పొందాలి. ఏ ఒక్కరికీ అన్యాయం జరగకుండా అధికారులు సీరియస్‌గా పని చేయాలి. సంక్షేమ పథకాల వర్తింపులో కులం, మతం, ప్రాంతం, పార్టీలు చూడొద్దు. కేవలం అర్హతే ప్రామాణికం అనే విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి.

చరిత్రలో నిలిచిపోయేలా ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం ఉండాలి. అధికారులందరూ దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలి. ఫలానా కలెక్టర్‌ హయాంలో ఇళ్ల పట్టా ఇచ్చారన్న పేరు చరిత్ర ఉన్నంత వరకు నిలిచిపోయేలా పని చేయాలి. ఇలాంటి గొప్ప కార్యక్రమం చేస్తే దేవుడికి సేవ చేసినట్లే.

డిసెంబర్‌ 1 నుంచి ఆరోగ్యశ్రీ కింద శస్త్రచికిత్సలు చేయించుకున్న వారికి వైద్యులు సూచించిన మేరకు విశ్రాంతి సమయంలో రోజుకు రూ.225 లేదా గరిష్టంగా రూ.5 వేలు ఇస్తాం. ఆ మేరకు ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్‌ అయిన 48 గంటల్లో రోగుల అకౌంట్లలో నేరుగా నగదు జమ అవుతుంది. 26 ప్రత్యేక విభాగాల్లో 836 రకాల శస్త్ర చికిత్సలు చేయించుకున్న వారికి ఇది వర్తిస్తుంది. ఇందుకు ఏడాదికి దాదాపు రూ.268.13 కోట్లు ఖర్చవుతుందని అంచనా. 

స్పందన కార్యక్రమంలో అర్జీ ఇవ్వడానికి వచ్చే వారిని చిరునవ్వుతో స్వాగతించాలి. ఇచ్చిన ప్రతి అర్జీని సీరియస్‌గా తీసుకోవాలి. మనసా, వాచా, కర్మణా పని చేసినప్పుడే బాధితులకు న్యాయం చేయగలుగుతాం. మనకేదైనా సమస్య వస్తే ఎలాంటి పరిష్కారం కోరుకుంటామో అలాంటి పరిష్కారమే మన దగ్గరకొచ్చేవారికి లభించేలా చర్యలుండాలి.

సాక్షి, అమరావతి : ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల తుది జాబితాను డిసెంబర్‌ 20 నాటికి గ్రామ, వార్డు సచివాలయాల్లో శాశ్వతంగా ప్రదర్శించాలని   ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. సామాజిక తనిఖీల కోసం డిసెంబర్‌ 15 నుంచి 18వ తేదీ వరకు ఆయా పథకాల అర్హుల జాబితాను అక్కడే ప్రదర్శించాలన్నారు. లబ్ధిదారుల ఎంపిక కోసం చేపట్టిన వైఎస్సార్‌ నవశకం కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలన్నారు. ‘స్పందన’ కార్యక్రమంపై మంగళవారం ఆయన సచివాలయం నుంచి కలెక్టర్లు, ఎస్పీలు, ఇతర ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా వైఎస్సార్‌ నవశకం పేరుతో ఈ నెల 20 నుంచి గ్రామ, వార్డు వలంటీర్ల ద్వారా ప్రారంభమైన ప్రభుత్వ సంక్షేమ పథకాలకు అర్హులైన లబ్ధిదారుల ఎంపిక కార్యక్రమం సాగుతున్న తీరుపై ఆయన ఆరా తీశారు. ఈ సందర్భంగా పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమం కింద కొత్తగా బియ్యం కార్డు, వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ కార్డు, వైఎస్సార్‌ పెన్షన్‌ కానుక కార్డు, జగనన్న విద్యా దీవెన – జగనన్న వసతి దీవెన కార్డులను జారీ చేస్తామని చెప్పారు. జగనన్న అమ్మఒడి, వైఎస్సార్‌ కాపు నేస్తం, రజకులు, నాయీ బ్రాహ్మణులు, దర్జీలకు ఆర్థిక సాయం, అర్చకులు, ఇమామ్‌లు, మౌజమ్‌లకు ఆర్థిక సాయం, వైఎస్సార్‌ సున్నా వడ్డీ, నేతన్న నేస్తం, లా నేస్తం లబ్ధిదారుల ఎంపిక కోసం సాగుతున్న ప్రక్రియ తీరు గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు.

డిసెంబర్‌ 1 నుంచి రోగులకు ఆర్థిక సాయం
వైఎస్సార్‌ ఆరోగ్య శ్రీ కింద నిర్ధారించిన వ్యాధులకు శస్త్రచికిత్స చేయించుకున్న వారు ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్‌ అయ్యి కోలుకునే సమయంలో దేశంలో తొలిసారిగా ఆర్థిక సాయం చేస్తున్నామని ముఖ్యమంత్రి తెలిపారు. ఈ పథకం అమల్లో ఎలాంటి గందరగోళానికి తావులేకుండా చూడాల్సిందిగా ఆదేశించారు. ఈ పథకం అమలు కోసం ఆరోగ్య మిత్రలకు అవసరమైన ఓరియెంటేషన్‌ ఇవ్వాలని సూచించారు. దేశం మొత్తం రాష్ట్రం వైపు చూసేలా మన పని తీరు ఉండాలని, ప్రజా ప్రతినిధులను ఈ కార్యక్రమంలో భాగస్వాములను చేయాలన్నారు. సికిల్‌సెల్‌ ఎనీమియా, తలసేమియా, హీమోఫీలియా బాధితులకు నెలకు రూ.10 వేలు, ఎలిఫెంటియాసిస్, పెరాలసిస్, మస్క్యులర్‌ డిస్ట్రోపీ, క్రానిక్‌ కిడ్నీ డిసీజ్‌ వ్యాధిగ్రస్తులకు నెలకు రూ.5 వేలు చొప్పున ఇచ్చే వైఎస్సార్‌ పెన్షన్‌ కానుక లబ్ధిదారుల జాబితాను రూపొందించడంలో కలెక్టర్లు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సీఎం సూచించారు.
మంగళవారం స్పందనపై సమీక్షలో రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడతామని ఉన్నతాధికారులతో ప్రమాణం చేయిస్తున్న సీఎం వైఎస్‌ జగన్‌  

45.82 లక్షల మంది రైతులకు వైఎస్సార్‌ రైతు భరోసా
వైఎస్సార్‌ రైతు భరోసా కింద వ్యవసాయ పెట్టుబడి కోసం రాష్ట్ర వ్యాప్తంగా 45.82 లక్షల మంది రైతులకు చెల్లింపులు పూర్తి చేసినట్లు ముఖ్యమంత్రి పేర్కొన్నారు. మరో 2.14 లక్షల మంది రైతులకు వారం రోజుల్లోగా చెల్లించాలని ఆదేశించారు. ఈ చెల్లింపుల విషయంలో కలెక్టర్లు ప్రత్యేకంగా దృష్టి పెట్టాలన్నారు. బ్యాంకర్లతో సమావేశమై మిగిలిన రైతులకు భరోసా అందేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. ఈ డబ్బును బ్యాంకర్లు పాత అప్పుల కింద జమ చేసుకోవడానికి వీలు లేకుండా స్పష్టమైన ఆదేశాలు జారీ చేస్తున్నామన్నారు. అన్‌ ఇంకంబర్డ్‌ అకౌంట్‌ కింద మాత్రమే భరోసా మొత్తాన్ని రైతులకు చెందేలా జమ చేయాలని మరోసారి స్పష్టం చేశారు. 

‘ఉపాధి’తో వర్క్‌షాపుల అనుసంధానం 
గ్రామ సచివాలయాలకు అనుబంధంగా ఏర్పాటు చేస్తున్న వర్క్‌షాపులపై కలెక్టర్లు సీరియస్‌గా దృష్టి సారించాలని సీఎం సూచించారు. గ్రామ సచివాలయాల్లో వర్క్‌షాపులను కచ్చితంగా తెరవాలని.. విత్తనాలు, ఎరువుల నాణ్యతను పరీక్షించిన తర్వాత మాత్రమే వాటిని రైతులకు విక్రయించాలని చెప్పారు. ఈ వర్క్‌షాపుల ఏర్పాటుకు ఉపాధి హామీ పథకాన్ని అనుసంధానం చేయాలని, జనవరి 1 నాటికి వీటిని పూర్తి చేయాలని ఆదేశించారు. ధాన్యం సేకరణలో రైతులకు చెల్లింపుల విషయంలో ఎలాంటి ఆటంకాలు లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ఉగాది నాటికి ఎట్టి పరిస్థితుల్లోనూ అర్హులైన పేదలందరికీ ఇళ్ల పట్టాల పంపిణీ పూర్తి చేయాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. మార్చి 1 నాటికి కటాఫ్‌ తేదీగా లబ్ధిదారుల జాబితా సిద్ధం చేయాలని కలెక్టర్లను ఆదేశించారు. ఇప్పటి వరకు 22.7 లక్షల మంది లబ్ధిదారులను గుర్తించామని అధికారులు వివరించారు. 

15 నాటికి ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగాల జాబితా 
ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులకు జనవరి 1 నుంచి ఔట్‌ సోర్సింగ్‌ కార్పొరేషన్‌ ద్వారానే వేతనాలు చెల్లించాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. డిసెంబర్‌ 15 నాటికి ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగాల జాబితా సిద్ధం చేయాలని కలెక్టర్లను ఆదేశించారు. అవినీతిని తగ్గించడం, ఉద్యోగులకు పూర్తిగా జీతాలు వచ్చేట్టు చేయడమే ఈ కార్పొరేషన్‌ లక్ష్యమని చెప్పారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు 50 శాతం రిజర్వేషన్లు, మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించడమే ప్రభుత్వ ప్రధాన ఉద్దేశం అని స్పష్టీకరించారు. ఇది సక్రమంగా అమలవుతోందా లేదా అనేది జిల్లా ఇన్‌చార్జి మంత్రులు పర్యవేక్షిస్తారన్నారు. కలెక్టర్లు జిల్లా స్థాయిలో, సెక్రెటరీలు సచివాలయ స్థాయిలో పర్యవేక్షిస్తారని సీఎం పేర్కొన్నారు. 

21న వైఎస్సార్‌ నేతన్న నేస్తం 
మగ్గం ఉన్న ప్రతి చేనేత కుటుంబానికి వైఎస్సార్‌ నేతన్న నేస్తం కింద రూ.24 వేల సాయం అందించనున్నట్లు సీఎం తెలిపారు. డిసెంబర్‌ 21న ఈ పథకాన్ని ప్రారంభిస్తామన్నారు. ఇప్పటి వరకు 73,594 మంది లబ్ధిదారులను గుర్తించారని, మగ్గమున్న ప్రతి ఇంటికీ ఈ పథకం వర్తించాలని చెప్పారు. అర్హత ఉండీ పథకం వర్తించని వారు ఉండకూడదన్నారు. వైఎస్సార్‌ మత్స్యకార భరోసా కింద ఇప్పటి వరకు దరఖాస్తు చేసుకోని వారికి డిసెంబర్‌ 15 వరకు అవకాశం ఇవ్వాలని సీఎం సూచించారు. అర్హులైన ఏ ఒక్క లబ్ధిదారుడిని ఈ పథకానికి దూరం చేయరాదని స్పష్టం చేశారు. వైఎస్సార్‌ వాహన మిత్రకు నేటితో గడువు ముగిసిందని, అర్హులైన లబ్ధిదారులందరకీ చెల్లింపులు పూర్తి చేశామని తెలిపారు. అగ్రిగోల్డ్‌ బాధితులకు ఇప్పటి వరకు 92 శాతం చెక్కులు పంపిణీ జరిగిందన్నారు. వచ్చే సమావేశం నాటికి నూరు శాతం చెక్కులు పంపిణీ పూర్తయ్యేలా చర్యలు తీసుకొవాలని సీఎం సూచించారు.

మద్యం అక్రమ రవాణాను అరికట్టాలి
రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే మద్యం షాపులను తగ్గించడంతో పాటు బెల్టు షాపులను పూర్తిగా నిర్మూలించామని సీఎం అన్నారు. సరిహద్దు రాష్ట్రాల నుంచి మద్యం అక్రమ రవాణాను అరికట్టాలని, ఎస్పీలు దీనిపై ప్రత్యేక దృష్టి సారించాలని స్పష్టం చేశారు. మద్యం, ఇసుక.. రెండింటిలోనూ అక్రమాలకు అడ్డుకట్టు వేయాల్సిందేనని, ఈ విషయంలో రాజీపడేది లేదన్నారు. ప్రతి వారం ఇసుక ధరలు, లభ్యతపై జిల్లా స్థాయిలో పత్రికల ద్వారా సమాచారం ఇవ్వాలని సీఎం ఆదేశించారు. ఇసుక రవాణాకు ఉపయోగిస్తున్న ప్రతి వాహనానికి డిసెంబర్‌ 10 నాటికి జీపీఎస్‌ తప్పనిసరి చేయాలని చెప్పారు.

ఇసుక అక్రమ రవాణా అరికట్టడానికి ఏర్పాటు చేసిన 439 చెక్‌ పోస్టుల్లో నైట్‌ విజన్‌ సీసీ కెమెరాలను కూడా అదే రోజుకు సిద్ధం చేయాలని సీఎం ఆదేశించారు. ప్రస్తుతం రోజుకు 2 లక్షల టన్నుల ఇసుక అందుబాటులోకి వస్తోందని, రోజుకు 80 వేల టన్నుల ఇసుక అవసరాలు ఉన్నాయని అధికారులు వివరించారు. ప్రస్తుతం 3 లక్షల 95 వేల మెట్రిక్‌ టన్నుల ఇసుకను ఆన్‌లైన్‌లో ఇవాల్టికి (మంగళవారం) అందుబాటులో ఉంచామని మైనింగ్‌ శాఖ అధికారులు తెలిపారు. అక్రమాలకు పాల్పడితే రూ.2 లక్షల జరిమానా, రెండేళ్ల జైలు శిక్ష విధించేలా చట్టంలో మార్పులు తీసుకొచ్చిన విషయాన్ని విస్తృతంగా తెలియజేయాలని సీఎం సూచించారు. ‘స్పందన’ కింద వస్తున్న వినతుల పరిష్కారంలో నాణ్యత కోసం ఏర్పాటు చేసిన శిక్షణ తరగతులపై వివరాలను ముఖ్యమంత్రి అడిగి తెలుసుకున్నారు. డిసెంబర్‌ 4న అనంతపురం, కర్నూలులో ఆఖరి విడతగా ఓరియెంటేషన్‌ తరగతులు ఉన్నాయని అధికారులు తెలిపారు.  

అవినీతిపరుల భరతం పట్టాలి
- 14400 కాల్‌ సెంటర్‌కు ఫోన్‌ చేసిన 15 నుంచి 30 రోజుల్లోగా దర్యాప్తు పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలి.
ఒక్క ఫోన్‌ కాల్‌తో మీ వెంట మేమున్నామనేలా ప్రజలకు భరోసా కల్పించాలి.
ఎవరూ లంచాలు తీసుకోకూడదనేలా చర్యలుండాలి.
ప్రతి దశలోనూ అట్టడుగు స్థాయి వరకూ ఇది ప్రజల్లోకి వెళ్లాలి. 
నా (సీఎం) స్థాయిలోనో, అధికారులగా మీ స్థాయిలోనో అవినీతికి నో చెబితే 50 శాతం వరకూ పోతుంది. మిగిలిన 50 శాతం అవినీతి పోయినప్పుడే వ్యవస్థ ప్రక్షాళన అవుతుంది. ఇందుకోసం ఐఐఎం, ఏసీబీ రెండూ కలిసి పని చేస్తాయి.
ఇన్ని సంక్షేమ పథకాలు ప్రవేశ పెడుతున్నప్పుడు వాటిని అవినీతికి తావులేకుండా ప్రజలకు అందించాల్సిన బాధ్యత మనపై ఉంది. మనం ఉన్నది ప్రజలకు సేవ చేయడానికే. 

సదరం సర్టిఫికెట్ల జారీపై మార్గదర్శకాలు 
నిబంధనలను సరళతరం చేయాలి. 
52 సెంటర్ల ద్వారా ఇకపై వారానికి రెండు దఫాలుగా సర్టిఫికెట్లు జారీ చేయాలి.
డిసెంబర్‌ 3న వరల్డ్‌ డిజేబుల్డ్‌ డే నాటి నుంచి ఈ కార్యక్రమం ప్రారంభించాలి.
డిసెంబర్‌ 15 నుంచి కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్లలో కూడా వారానికి ఒక రోజు సదరం క్యాంపు నిర్వహించాలి.
అర్హులైన వారందరికీ వీలైనంత వేగంగా సర్టిఫికెట్లు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలి.
కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారికి 3, 4 రోజుల్లో సర్టిఫికెట్‌ అందించడమే లక్ష్యంగా పని చేయాలి.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top