
కృష్ణా జిల్లా గుడివాడలో నేడు నిర్వహించనున్న సంక్రాంతి వేడుకల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పాల్గొననున్నారు.
సాక్షి, అమరావతి : ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ట్విటర్ వేదికగా రాష్ట్ర ప్రజలకు భోగి, సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ‘రైతు సంక్షేమానికి ప్రభుత్వం తీసుకున్న చర్యలకు తోడుగా ఈ ఏడాది ప్రకృతి కూడా ఆశీర్వదించింది. రైతుల పండుగగా విశిష్టంగా జరుపుకునే ఈ సంక్రాంతి ప్రతి ఇంటా కొత్త ఆనందాలను తీసుకురావాలని, పైరుపచ్చని కళకళలతో రాష్ట్రం ఎల్లప్పుడూ సుభిక్షంగా ఉండాలని మనసారా ఆకాంక్షిస్తున్నాను’అని పేర్కొన్నారు.
గుడివాడకు వెళ్లనున్న సీఎం జగన్
పౌరసరఫరాలశాఖ మంత్రి కొడాలి వెంకటేశ్వరరావు (నాని) ఆధ్వర్యంలో కృష్ణా జిల్లా గుడివాడలో నేడు నిర్వహించనున్న సంక్రాంతి వేడుకల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పాల్గొననున్నారు. మధ్యాహ్నం మూడు గంటలకు సీఎం జగన్ తాడేపల్లి నుంచి బయలుదేరుతారు. 3.45 గంటల నుంచి 4.45 వరకు గుడివాడలోని లింగవరం రోడ్ కే కన్వెన్షన్‌లో నిర్వహిస్తున్న సంక్రాంతి సంబరాల్లో ఆయన పాల్గొంటారు. తిరిగి 5.35 గంటలకు తాడేపల్లిలోని నివాసానికి చేరుకుంటారు.