విజయవాడ నగరంలో సరికొత్త ట్రాఫిక్ ప్లాన్‌ను అమలు చేయాలని నిర్ణయించారు.
బెంగళూరు తరహలో నగరంలో అమలు
పుష్కరాల కోసం ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్న ట్రాఫిక్ పోలీసులు
అన్ని ప్రధాన మార్గాల్లో వన్‌వే అమలు చేయాలని నిర్ణయం
పుష్కర ఘాట్లకు దగ్గరగా ప్రధాన రహదారుల మళ్లింపు
మరో నాలుగు రోజుల్లో ఖరారు కానున్న సర్క్యూట్ డిజైన్
విజయవాడ : విజయవాడ నగరంలో సరికొత్త ట్రాఫిక్ ప్లాన్‌ను అమలు చేయాలని నిర్ణయించారు. బెంగళూరు తరహలో నగరం అంతా సర్క్యూట్ లైన్(వన్‌వే)లతో ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించాలని నిర్ణయించారు. సర్క్యూట్ లైన్ల డిజైన్లు సిద్ధం చేసి కృష్ణా పుష్కరాల్లో అమలు చేయాలని నగర పోలీస్ కమిషనరేట్ ట్రాఫిక్ విభాగం నిర్ణయించింది. ట్రాఫిక్ పోలీసులు ఇప్పటికే నగరమంతా పర్యటించి ప్లాన్ సిద్ధంచేశారు. నైనవరం ఫ్లై ఓవర్ సమీపంలోని వైవీరావు ఎస్టేట్ నుంచి రామవరప్పాడు రింగ్ వరకు అన్ని ప్రధాన మార్గాల్లో వన్‌వేలు ఏర్పాటు చేస్తున్నారు. బెంగళూరు తరహాలో వన్‌వేలు ఉంటే విజయవాడలోనూ ట్రాఫిక్ సమస్య తలెత్తదని ట్రాఫిక్ పోలీస్ అధికారులు భావిస్తున్నారు. ఆగస్టు 12 నుంచి కృష్ణా పుష్కరాలు ప్రారంభం కానున్నాయి. గత పుష్కరాలకు 1.30 కోట్ల మంది యాత్రికులు నగరానికి వచ్చారని అధికారిక లెక్కలు పేర్కొంటున్నాయి.
విజయవాడ రాష్ట్ర రాజధాని కావడం, దేశంలోని పలు ప్రాంతాల నుంచి విమాన సర్వీసులు, రైలు సర్వీసులు నిత్యం అందుబాటులో ఉండటంతో ఈ సారి పుష్కరాలకు రెండు కోట్ల మందిపైగా వస్తారని అంచనా. ఈ క్రమంలో విజయవాడలో రహదారులు అన్నీ ఇరుకుగా ఉండటం, కొన్ని రోడ్లలో అభివృద్ధి పనులు జరుగుతుండటం, అడుగడుగునా ట్రాఫిక్ డైవర్టర్లు ఉండటంతో ట్రాఫిక్ స్తంభిస్తోంది.
పుష్కరాల నేపథ్యంలో నగరంలోని 55 రహదారుల విస్తరణకు రూ.99 కోట్లు కేటాయించారు. కనకదుర్గ ఫ్లైఓవర్ పనులు జరుగుతున్నాయి. దీనిలో భాగంగా కృష్ణలంక రోడ్డును నాలుగులైన్ల రహదారిగా విస్తరిస్తున్నారు. ఈ పనులన్నీ పుష్కరాలకు ముందే పూర్తవుతాయని అధికారులు చెబుతున్నారు. అయినప్పటికీ పరిస్థితుల్లో ఏవైనా మార్పులు సంభవిస్తే, ఇబ్బందులు తలెత్తకుండా ఉండటం కోసం ముందస్తుగా యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసి, అమలుచేయనున్నారు. విస్తరణ పనులతో నిమిత్తం లేకుండా వన్‌వే అమలు చేయాలని కమిషనరేట్ పోలీసులు నిర్ణయించారు. ఇప్పటికే జాతీయ రహదారి ట్రాఫిక్ డైవర్షన్లు, నగరంలో ట్రాఫిక్ డైవర్షన్లు అన్నింటిని విజయవాడ పోలీస్ కమిషనర్ గౌతమ్ సవాంగ్ ఖరారు చేశారు. ఈ క్రమంలో నగరంలో సర్క్యూట్ డిజైన్ అమలు కోసం అధికారుల బృందం నగరంలో పర్యటించి ప్రధాన రహదారులకు అనుసంధానంగా ఉండే రహదారుల ఎంట్రన్స్, ఎగ్జిట్స్ నమోదు చేస్తున్నారు. మరో వారం రోజుల్లో రవాణా శాఖ అధికారులు, ఆర్టీసీ అధికారులు, నగర కమిషనరేట్ పోలీసులు, ఆర్‌అండ్‌బీ అధికారులు సంయుక్తంగా ఖరారు చేసిన వన్‌వేలో పర్యటిస్తారు. ఆ తరువాత బస్సులు రాకపోకలకు వీలు, ఇతర అంశాలను చూసుకొని మార్పులు చేర్పులు చేసే అవకాశం ఉంది. ముఖ్యంగా కనకదుర్గ ఫ్లైఓవర్ నిర్మాణం వల్ల ట్రాఫిక్ డైవర్షన్‌తో ఎర్రకట్టపై నిత్యం ట్రాఫిక్ స్తంభిస్తోంది. దీనిని వన్‌వే నుంచి పూర్తిగా మినహాయించి నేరుగా నగర శివారు నుంచి బీఆర్‌టీఎస్‌కు వచ్చేలా డిజైన్ చేశారు. పుష్కరాల అనంతరం కూడా పరిస్థితి, పెరగిన ట్రాఫిక్ రద్దీని దృష్టిలో ఉంచుకొని కొన్ని ప్రాంతాల్లో వన్‌వేలు కొనసాగించనున్నారు.