
కలలకు ఆకాశమే హద్దు అనడానికి ఉదాహరణ డిజైనర్ సౌరభ్ పాండే. ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఒక చిన్న గ్రామంలో పుట్టిన అతని పేరు ఈరోజు ప్రపంచ ఫ్యాషన్ వేదికలపై వినిపిస్తోంది. సాధారణ మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన ఈ యువకుడు, తన కలలకోసం కష్టపడుతూ, పట్టుదలతో ఫ్యాషన్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఓ ప్రత్యేకతను చూపుతున్నాడు.
స్కూల్ కెళ్లే సమయంలోనే సౌరభ్‌కి డ్రాయింగ్, డిజైన్స్ పై ప్రత్యేక ఆసక్తి. పాత బట్టలను కొత్తగా కట్ చేసి, రంగులు కలిపి, తన గ్రామంలోనే చిన్న చిన్న డిజైన్స్ చేస్తూ, ‘ఫ్యాషనః అంటే ఏంటి?’ అనే ప్రశ్నకు తన స్టైల్లో సమాధానం చెప్పేవాడు.
సవాళ్లే అవకాశాలకు మార్గం
ఉన్న ఆ చిన్న ఊళ్లో అవకాశాలు లేవు. ఫ్యాషన్ కోర్సులు, స్టడీ మెటీరియల్, ఫ్యాబ్రిక్ అందనంత దూరంలో ఉన్నాయి. అయినా అతని కృషి ఆగలేదు. నీరసపడలేదు. పేపర్‌పైన స్కెచ్‌లు వేసి, సోషల్ మీడియాలో తన టాలెంట్‌ను ప్రదర్శించాడు. అదే అతనికి పెద్ద అవకాశాలు తెచ్పిపెట్టింది.
అంతర్జాతీయ బ్రాండ్ల దృష్టి
సౌరభ్ పనిని గమనించిన ప్రతిభావంతులు అతన్ని మొదట స్థానిక ఈవెంట్లలో ΄ాల్గొనమని ఆహ్వానించారు. అటు నుంచి 17 ఏళ్ళ వయసులో అతన్ని ముంబై వైపుగా నడిపించింది. ఆ మహా నగరంలో మనుగడ కష్టమే. ఒక చిన్న ఇల్లు లాంటి గదిలో తల్లిదండ్రులు, తోబుట్టువులతో కలిసి ఉండేవాడు. ఇల్లు గడవడం కోసం ఒక మాల్‌లో 12 గంటలు షిఫ్టులో పనిచేస్తూ, రాత్రిళ్లు ఫ్యాషన్ డిజైన్లు గీస్తూ వాటిని సోషల్‌మీడియాలో పోస్ట్ చేస్తూ ఉన్నాడు. అతను తన పరిస్థితుల కంటే పెద్ద లక్ష్యాన్ని చాలా ఏకాగ్రతతో నడిపించాడు.
ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ మనీష్ మల్హోత్రా సౌరభ్ పనిని గమనించినప్పుడు అతని జీవితం గొప్ప మలుపు తిప్పింది. ఒక అవకాశం మరికొన్ని మార్గాలను చూపించింది. అక్కడి నుంచి అతని డిజైన్లు గూచీ, డియోర్, ప్రాడా వంటి ప్రపంచ లగ్జరీ బ్రాండ్ల దృష్టికి వచ్చాయి. ఇప్పుడు అతను ఈ ఫ్యాషన్ హౌస్‌లతో కలసి ప్రత్యేక కలెక్షన్‌లు రూపొందిస్తున్నాడు.
స్టైల్ ప్రత్యేకత
భారతీయ సంప్రదాయ బట్టల టెక్స్చర్స్‌కి ఆధునిక డిజైన్‌ల కలయిక, నేచురల్ కలర్స్, ఎకో–ఫ్రెండ్లీ ఫాబ్రిక్‌ల వాడకం, సింపుల్ కట్‌లు, గ్లోబల్ లుక్ .. ఈ ప్రత్యేకతలు అతన్ని అందరిలో ముందుంచుతున్నాయి. ఫ్యాషన్ వేదికల మీద అతని డిజైన్స్ ప్రదర్శించేంతగా వెళ్లింది. సోషల్ మీడియాలో అతని విచిత్రమైన వీడియోలకు ఎగతాళి చేసిన జనమే, ఆ తర్వాత అవే వీడియోలకు కనెక్ట్ అవ్వడం ప్రారంభించారు.
తిరస్కరణ, ఎగతాళి నుండి ఇప్పుడు అతను కోట్లు సంపాదించేంతగా ఎదిగాడు. తన కథను తానే తిరగ రాసుకున్నాడు. అతన్ని సక్సెస్ గురించి అడిగితే ‘ఎవ్వరు ఏమనుకున్నా నేను నాలా ఉండటమే నాకు ఇష్టం. అదే నా నిజమైన ఫ్యాషన్ స్టేట్‌మెంట్’ అంటాడు. మారుమూల గ్రామాల యువతకు సౌరభ్ ఒక స్ఫూర్తి. ‘కల అంటే పెద్దది కావాలి. మన దగ్గర వనరులు లేకపోయినా, కష్టపడితే ప్రపంచమే మన దారికి రావచ్చు’ అని అతను చెప్పే సందేశం ప్రతి యువకుడిలో కొత్త ఆశను నింపుతోంది.
(చదవండి: 'కంగ్రాట్యులేటరీ మనీ ఆన్ డెలివరీ' గురించి విన్నారా..?)