ముస్తాబైన ఆంధ్ర రోమ్‌

Christmas 2019 Guntur District Churches Special Story - Sakshi

గుంటూరు ఈస్ట్‌: మానవాళి ప్రేమ, శాంతి మార్గంలో పయనించాలని క్రీస్తు బోధిస్తే.. వాటిని ఆచరిస్తూ, ఆచరింపజేస్తూ గుంటూరు నగరంలోని అనేక క్రైస్తవ మందిరాలు సేవలందిస్తున్నాయి. ఏఈఎల్సీ ఆధ్వర్యంలో పలు చర్చిలు, విద్యాలయాలు, వైద్యశాలలు మానవ సేవలో వెలుగొందుతున్నాయి. గుంటూరు, నల్లగొండ, ప్రకాశం, కృష్ణా జిల్లాల పరిధిలోని చర్చిలన్నీ సెంట్రల్‌ సినడు పరిధిలోకి వస్తాయి. సీహెచ్‌ ఏలియా సెంట్రల్‌ సినడు బిషప్‌గా వ్యవహరిస్తున్నారు. 

150 ఏళ్లకు పైగా చరిత్ర.. 
రెవరెండ్‌ డాక్టర్‌ జాన్‌క్రిస్టియన్‌ ఫెడరిక్‌ హయ్యర్‌ ఏఈఎల్సీ సంఘాన్ని స్థాపించి క్రీస్తు బోధనల ప్రచార వ్యాప్తికి కృషి చేశారు. గుంటూరు పాత బస్టాండ్‌ సెంటర్‌లో 1842వ సంవత్సరం జులై 31వ తేదీ సెయింట్‌ మ్యాథ్యూస్‌ ఈస్ట్‌ ప్యారిస్‌ చర్చిని నిర్మించారు. 150 ఏళ్లకు పైగా చరిత్ర ఉన్న  ఈ చర్చి జిల్లాలోనే అతి పురాతనమైన చర్చిల్లో ఒకటి.   

  • వెస్ట్‌ప్యారిస్‌ చర్చికు దాదాపు వందేళ్ల చరిత్ర ఉంది. 1905లో స్థాపించిన ఈ చర్చికు రాక్‌ మెమోరియల్‌ చర్చి అనే మరో పేరు ఉంది.   
  • నార్త్‌ ప్యారిష్‌ చర్చి ఆధ్వర్యంలో 60 ఏళ్లుగా దైవ సందేశాన్ని అందించడంతో పాటు, సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.    

గుంటూరు మేత్రాసనం  
1940లో గుంటూరు మేత్రాసనం స్థాపించారు. గుంటూరు రింగ్‌రోడ్డులోని బిషప్‌బంగ్లా కేంద్రంగా ప్రస్తుతం బిషప్‌ చిన్నాబత్తుని భాగ్యయ్య పరిరక్షణలో ప్రొక్రెటర్‌ ఫాదర్‌ ఏరువ బాలశౌరెడ్డి నిర్వహణలో పలు దేవాలయాలు, పాఠశాలలు, కళాశాలలు, వైద్యశాలలు నిర్వహిస్తున్నారు. జిల్లాలో 90 విచారణలు, వాటికింద మిషన్స్‌ స్టేషన్లు ఉన్నాయి.

ముస్తాబైన ఆంధ్ర రోమ్‌ 
పేరేచర్ల(ఫిరంగిపురం): తెలుగు రాష్ట్రాల్లోనే అద్భుత కట్టడంగా, లక్షలాది మంది భక్తులు వచ్చే ప్రాంతంగా పిలవబడే ఫిరంగిపురం బాలయేసు కథెడ్రల్‌ దేవాలయం క్రిస్మస్‌ మహోత్సవానికి ముస్తాబయ్యింది. వేడుకల్లో భాగంగా ఆలయాన్ని కనులు మిరుమిట్లు గొలిపేలా విద్యుత్‌ దీపాలతో ఆలంకరించారు. గతంలో కంటే భక్తుల రద్దీ ఎక్కువగా ఉన్న దృష్ట్యా వారికి ఆలయంలో విశ్రాంతి భవనాలు, దర్శనం ప్రశాంతంగా సాగేలా ఏర్పాట్లు చేశారు. రాష్ట్రం నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి దేశ విదేశాల నుంచి రెండు లక్షల మందికిపైగా భక్తులు వస్తారని అంచనా. మహిళా భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. క్రీస్తువిశ్వాసులు ఎక్కువగా తరలివచ్చే మహిమాన్విత ఆలయంగా, ఆంధ్రా రోమ్‌గా కీర్తి పొందిన ఈ ఆలయానికి 128 సంవత్సరాల చరిత్ర ఉంది.

లండన్‌లోని మిల్‌హిల్‌ సభకు చెందిన మతగురువు థియోడర్‌ డిక్మన్‌ స్వామి 1875లో బాలయేసు కథెడ్రల్‌ ఆలయానికి విచారణ గురువుగా వచ్చారు. ఆలయం శిథిలావస్థలో ఉండటం చూసిన ఆయన నిర్మాణానికి పూనుకున్నారు. 1888 డిసెంబర్‌ 15వ తేదీ బాలయేసు ఆలయం పునాది నిర్మాణం చేపట్టారు. పునాదులకు రెండేళ్ల కాలం పట్టింది. బుధవారం జరిగే క్రిస్మస్‌ వేడుకలకు శాంతి భద్రతలకు ఎటువంటి విఘాతం కలగకుండా 170 మందితో పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇందులో డీఎస్పీ, సీఐ, ఏడుగురు ఎస్‌ఐలు పర్యవేక్షించనున్నారు.

సర్వ మతాల సంగమం
విజయపురిసౌత్‌: సర్వ మతాల సంగమంగా ఆధ్యాత్మిక భావనకు ప్రతీకగా వెలుగొందుతున్న సాగర్‌మాత దేవాలయంలో క్రిస్మస్‌ వేడుకలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. రాష్ట్రంలోనే విశిష్టత కలిగిన ఆలయంగా, ప్రముఖ పుణ్యక్షేత్రంగా దీనికి పేరుంది. భక్తుల కోర్కెలు తీర్చే తల్లి సాగర్‌మాత ఆలయానికి నిత్యం రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వేలాది మంది భక్తులు వస్తుంటారు. భారతీయ సంప్రదాయాలకు అనుగుణంగా మందిర నిర్మాణం, గోపురంపై విగ్రహ సంపద రూపుదిద్దుకున్నాయి. భారతీయ చిత్ర కళానైపుణ్యం వీటిలో కనిపిస్తోంది. సాగర్‌ ఒడ్డున వెలిసిన మేరీమాత సాగర్‌మాత పేరుతో క్రైస్తవులతో పాటు హిందువులు, ముస్లింలు ఇలా అన్ని మతాల ప్రజల నీరాజనాలను అందుకుంటోంది.

శతాబ్దాల చరిత్ర
రెంటచింతల: రాష్ట్రంలో రెంటచింతల అనగానే అందరికీ రోళ్లుసైతం పగిలే ఎండలు గుర్తొస్తాయి. కానీ, ప్రేమను వర్షించే ఆధ్యాత్మిక కేంద్రం కూడా ఇక్కడే ఉంది. శతాబ్దంన్నరకు పైగా చరిత్ర కాలిగిన కానుకమాత దేవాలయం ప్రముఖ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతోంది. ఈ ఆలయంలోకి అడుగుపెట్టగానే చలువురాతి చల్లదనమే కాదు.. కానుకమాత కృపా కటాక్షాలు కూడా దక్కుతాయి. రెవరెండ్‌ ఫాదర్‌ జోసఫ్‌ గ్రాండ్, కెనడీల ఆధ్వర్యంలో 1850లో అద్భుతమైన ఆర్కిటెక్‌ పరిజ్ఞానంతో కానుకమాత దేవాలయాన్ని నిర్మించారు. ఈ ఆలయం క్రిస్మస్‌ వేడుకలకు ముస్తాబైంది. ఈ చర్చిలో ప్రతి ఏడాది క్రీస్తు జన్మదినోత్సవాన్ని వేడుకగా నిర్వహిస్తున్నారు. మంగళవారం అర్ధరాత్రి 11 గంటలకు చర్చి ఆవరణలో  విచారణ గురువులు రెవరెండ్‌ ఫాదర్‌ గోపు రాయపరెడ్డి నేతృత్వంలో ప్రత్యేక సమష్టి దివ్యపూజాబలిని సమర్పించనున్నారు. మండలంలోని సుమారు మూడు వేల మందికి పైగా క్రైస్తవులు పాల్గొంటారు. రాత్రి 12 గంటలకు బాలయేసు జననాన్ని పురష్కరించుకుని ఆనందంతో భారీగా బాణసంచా కాలుస్తారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top