సరదాగా కామాక్షమ్మ అంటుంటా.. జిల్లా ఎస్పీ రాజశేఖర్‌బాబు

Chittor SP Special Interview on Mothers Day - Sakshi

నేడు అంతర్జాతీయ మాతృ దినోత్సవం

సాక్షి, చిత్తూరు : అంతర్జాతీయ మాతృదినోత్సవం సందర్భంగా జిల్లా ఎస్పీ రాజశేఖర్‌బాబును     ‘సాక్షి’ పలకరించింది. అమ్మతో తనకు ఉన్న     అనుబంధాన్ని ఆయన పంచుకున్నారిలా.. మాది నెల్లూరు జిల్లా పెద్దిరెడ్డిపల్లి. నాన్న రాధాకృష్ణమూర్తి, అమ్మ కామాక్షమ్మ. ఇద్దరూ ప్రభుత్వ స్కూళ్లలో టీచర్లు. నేను నాన్న కంటే కొంచెం అమ్మ దగ్గరే చనువుగా ఉంటా. అమ్మను సరదాగా కామాక్షమ్మ అంటుంటా. అమ్మ కూడా పెద్దగా నవ్వుతుంటుంది ఆ పిలుపు కోసమేఎదురు చూస్తున్నట్టుగా.

అమ్మతో నేను గడిపిన ప్రతి క్షణం గుర్తే ఇప్పటికీ. అప్పుడు నాలుగో తరగతి పూర్తయింది. కొడిగెనహళ్లి ఏపీఆర్‌జేసీ స్కూల్‌లో  అయిదో తరగతి చదవాలనేది నా కోరిక. మా నాన్న అప్లికేషన్‌ పూర్తి చేసి ఎంఈవోకి ఇచ్చారు. ఆయన దాన్ని పంపకుండా మరచిపోయారు. నేనేమో హాల్‌టికెట్‌ కోసం రోజూ ఎదురుచూపే. పరీక్ష ముందు రోజు వరకు ఎదురు చూశా. ఎంతకీ రాకపోయే సరికి చాలా బాధపడ్డా. అప్పుడు అమ్మ దగ్గరకు తీసుకొని ఓదార్చింది. కన్నీరు తుడిచింది.. ఒళ్లో కూర్చోబెట్టుకొని. అమ్మ ఇచ్చిన ప్రోత్సాహంతో ఏడో తరగతిలో జిల్లాలోనే మొదటి ర్యాంకు సంపాదించా.

ఒక్కసారి కొట్టింది..
ఎన్నో తరగతిలోనో సరిగా గుర్తు లేదు కానీ.. అమ్మ ఒక్కసారి నన్ను కొట్టింది. మా ఇంట్లో అప్పట్లో కోళ్లు ఉండేవి. నేను సరదాగా డ్యాన్స్‌ చేస్తున్నా. ఒక్కసారిగా కోడిపిల్ల వచ్చి నా కాలికింద పyì  చనిపోయింది. అమ్మకు కోపం వచ్చి కొట్టింది.

విలువలు నూరి పోసింది..
అమ్మ నాతో ఎక్కువగా విలువలు, నిజాయితీ గురించే మాట్లాడేది. మాట ఇస్తే తప్ప కూడదంటుంది అమ్మ. అత్యంత కఠిన పరిస్థితుల్లో కూడా విలువలు తప్పకుండా పని చేస్తున్నానంటే కారణం అమ్మ నన్ను పెంచిన విధానమే. నా ఎమ్‌టెక్‌ పూర్తయిన తరువాత విదేశాల్లో చాలా ఉద్యోగావకాశాలు వచ్చాయి. మా స్నేహితులంతా అక్కడికే వెళ్లారు. నాకు గ్రూప్‌1లో ఉద్యోగం రావడంతో ఇక్కడే స్థిరపడ్డా. ప్రజాసేవ చేసేందుకు భగవంతుడు గొప్ప అవకాశమిచ్చాడు.. నువ్వు చాలా అదృష్టవంతుడివి అని కర్తవ్యం గుర్తు చేసింది. అమ్మ మాట కర్తవ్యం.

‘అమ్మలో ఉన్న వైభవం.. దివ్యత్వం, ఎవరిలోనూ చూడలేదు. ప్రపంచంలో చాలా దేశాల్ని చుట్టి.. లక్షలాది మందిని కలిసినా అమ్మవంటి అపురూప వ్యక్తి తారసపడలేదు. నేను సంపాదించిందంతా అమ్మ పాదాల వద్ద పోసినా ఇంకా బాకీ పడతా’    – ఎస్పీ రాజశేఖర్‌ బాబు

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top