గ్యాస్ కనెక్షన్ వచ్చిందంటూ మోసం | cheating as gas connection came | Sakshi
Sakshi News home page

గ్యాస్ కనెక్షన్ వచ్చిందంటూ మోసం

Jan 8 2014 6:24 AM | Updated on Sep 2 2017 2:24 AM

కొత్తపల్లి మండలం వాకతిప్పలో మంగళవారం సాయంత్రం ఓ కారులో వచ్చిన ముగ్గురు అగంతకులు గ్యాస్ కనెక్షన్లు వచ్చాయంటూ స్థానికులను నమ్మించి డబ్బు, బంగారంతో ఉడాయించారు.

పిఠాపురం, న్యూస్‌లైన్ : కొత్తపల్లి మండలం వాకతిప్పలో మంగళవారం సాయంత్రం ఓ కారులో వచ్చిన ముగ్గురు అగంతకులు గ్యాస్ కనెక్షన్లు వచ్చాయంటూ స్థానికులను నమ్మించి డబ్బు, బంగారంతో ఉడాయించారు. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం వాకతిప్పకు చెందిన పి.దుర్గ సెల్‌కు ఫోన్ చేసి ‘మీకు గ్యాస్ కనెక్షన్ వచ్చింది.. వెంటనే డబ్బుకట్టి తీసుకుంటే బహుమతులు కూడా ఉన్నాయ’ని నమ్మబలికి కారులో ఆమె ఇంటికి వెళ్లారు. రూ.8 వేలు చెల్లిస్తే కనెక్షన్‌తో పాటు మిక్సర్ కమ్ గ్రైండర్ ఉచితంగా ఇస్తామని చెప్పడంతో ఆమె రూ.8వేలు తెచ్చి వారికిచ్చింది.

 ఇంకా ఎవరికైనా కనెక్షన్ కావాలంటే ఇస్తామని వారు చెప్పారు. తన అత్తగారికి గ్యాస్ కనెక్షన్ కావాలని, తన పుస్తెలతాడు తాకట్టు పెట్టి డబ్బు తెస్తానని చెప్పి బయటకు వెళ్లింది. ఎవరూ డబ్బు ఇవ్వకపోవడంతో వచ్చేసింది. ‘ఆ పుస్తెలతాడు ఇచ్చి మీ భర్తను మాతో పంపితే పిఠాపురంలో తాకట్టు పెట్టి డబ్బులు తీసుకుంటాం. గ్యాస్ కనెక్షన్, బహుమతులు ఇచ్చి పంపిస్తామ’ని నమ్మించారు. బంగారు తాడును భర్త సత్తిబాబుకు ఇచ్చి వారి కూడా పంపించింది. కొంత దూరం వెళ్లాక కారులో చోటు సరిపోవడం లేదని, ఆటోలో రావాలంటూ సత్తిబాబుకు రూ.100 ఇచ్చి దింపేశారు.

తాము ముందువెళ్లి పుస్తెలతాడు తాకట్టు పెడతామని నమ్మి ంచారు. పిఠాపురం వెళ్లిన సత్తిబాబుకు అక్కడ ఎవ్వరూ కనిపించకపోవడంతో మోసపోయామని గుర్తించిన సత్తిబాబు లబోదిబోమంటూ కొత్తపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇలాగే నెల కిందట మూలపేటలో 10 మంది వద్ద నుంచి కొందరు రూ.60 వేలు దండుకుని ఉడాయించారని చెబుతున్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement