అందని ‘చంద్రన్న పెళ్లి కానుక’

Chandranna Kanuka Scheme Not Implemented Visakhapatnam - Sakshi

గోపాలపట్నం(విశాఖ పశ్చిమ): నిరుపేద కుటుంబాల్లో పెళ్లి చేసుకున్న జంటలకు అండగా నిలుస్తాం. చంద్రన్న పెళ్లి కానుక అందించి ఆర్థికంగా ఆసర కల్పిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పిన మాటలింకా కార్యరూపం దాల్చలేదు. ఆర్భాటంగా ‘చంద్రన్న పెళ్లికానుక’ పథకం ప్రకటించి.. కానుకలివ్వకుండా సర్టిఫికెట్‌ మాత్రమే ఇచ్చేసి వధూవరులకు చుక్కలు చూపిస్తున్నారు. ఈ పథకంలో రాష్ట్రంలో తొలిసారిగా నమోదైన పెళ్లికే కానుక అందని పరిస్థితి విమర్శలకు తావిస్తోంది. ఈ ఏడాది ఏప్రిల్‌ 18న చంద్రన్నపెళ్లి కానుక జీవో విడుదలైంది. నగరంలో ఏవీఎన్‌ కళాశాల సున్నపు వీధికి చెందిన రావులపూడి నందిని(ఎస్సీ)కి హరీష్‌(కాపు)నకు సింహాచలం పుష్కరిణి కల్యాణ మండపంలో అదే నెల 21న కులాంతర వివాహం జరిగింది.

ప్రభుత్వ సూచనల మేరకు నందిని తల్లిదండ్రులు 1100కి ఫోన్‌ చేసి ముందస్తు సమాచారం ఇచ్చారు. దీంతో రాష్ట్రంలో తొలిసారి చంద్రన్న పెళ్లి కానుకకు అర్హులయ్యారని ప్రభుత్వం భారీగానే ప్రచారం చేసుకుంది. వీరిని లబ్ధిదారులుగా ప్రకటించింది. రాష్ట్ర మంత్రి గంటా శ్రీనివాసరావు, దక్షిణ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్‌కుమార్‌ అధికార యంత్రాంగంతో పెళ్లికి హాజరయ్యారు. కులాంతర వివాహం.. అందులోనూ వధువు నుంచి గానీ, వరుడు నుంచి గానీ పిలుపు లేకుండానే అతిరథమహాశయులు వచ్చారని అంతా ఆశ్చర్యపోయారు. తాము చంద్రన్న పెళ్లి కానుక నేపథ్యంలో వచ్చామని చెప్పి వివాహ శుభాకాంక్షల పత్రాన్ని రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఇచ్చి ఆశీర్వదించారు. అయితే చంద్రబాబు ప్రకటించిన ప్రకారం ఈ దంపతులకు రూ. 75 వేల నగదు కానుక అందాల్సి ఉంది.

వివాహ తంతు పూర్తయి మూడు నెలలు కావస్తున్నా.. ప్రభుత్వం నుంచి దంపతుల ఖాతాలో రూపాయి కూడా పడలేదు. దీంతో వధువు తల్లిదండ్రులు రవి, లలిత ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. 1100 కి ఫోన్‌ చేస్తే వెలుగు ప్రాజెక్టు కార్యాలయానికి వెళ్లాలని సూచిస్తున్నారు. అక్కడికి వెళ్తే జీవీఎంసీ కార్యాలయానికి వెళ్లాలని పంపేస్తున్నారు. అక్కడికి వెళితే సర్వర్‌ సమస్య చెబుతున్నారు. ఇలా అధికారులు తమను బంతాట ఆడుకుంటున్నారని రవి, లలిత ఆవేదన చెందుతున్నారు. ఆటో డ్రైవర్‌గా పనిచేసి కుటుంబాన్ని పోషించే రవి భార్యతో కలిసి చంద్రన్న పెళ్లికానుక పత్రంతో ప్రదక్షిణలు చేస్తుండడం అందరికీ జాలి గొలుపుతోంది.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top