కరువును సమర్థంగా ఎదుర్కొన్నాం

Chandrababu says about River connectivity in the debate of assembly - Sakshi

     కరువు–నదుల అనుసంధానంపై అసెంబ్లీలో చర్చలో సీఎం వెల్లడి

     ఇప్పటికే 296 కరువు మండలాలు ప్రకటించాం

     నాలుగు జిల్లాల్లో 50% కన్నా తక్కువ వర్షపాతం

     వచ్చే జూన్‌కి 45 సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేస్తాం

     త్వరలో మహా సంగమానికి శ్రీకారం చుడతాం

     ఈ నెలలో 12 ప్రాజెక్టులు జాతికి అంకితం

     12న పోలవరం గ్యాలరీవాక్‌కు ఎమ్మెల్యేలు హాజరు

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఆరు జిల్లాల్లో కరువొచ్చిందని, దానిని సమర్థంగా ఎదుర్కొని వ్యవసాయంలో సుస్థిర అభివృద్ధి సాధిస్తున్నామని సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. గత నాలుగేళ్లుగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలు, నదుల అనుసంధానం, రెయి న్‌గన్స్‌ వాడకం, పంట సంజీవని ద్వారా తవ్విన పది లక్షల నీటి కుంటలు, రెండు మీటర్ల మేర పెరిగిన భూగర్భ జలాలతో రాష్ట్రాన్ని కరువు రహితంగా మార్చామన్నారు. శుక్రవారం శాసనసభలో కరువు–నదుల అనుసంధానంపై నిర్వహించిన సుదీర్ఘ చర్చలో సీఎం చంద్రబాబు సమాధానమిచ్చారు. ఇప్పటికే 296 కరవు మండలాలు ప్రకటించామని, రాయలసీమలోని నాలుగు జిల్లాలతో పాటు ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో 50 శాతం కంటే తక్కువగా వర్షపాతం నమోదైందని, అయినా పైర్లను కాపాడామన్నారు. రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు గణనీయంగా తగ్గాయని సీఎం చంద్రబాబు తెలిపారు. పంటసంజీవని అమలులో దేశంలోనే అగ్రస్థానంలో ఉన్నామన్నారు. జలవనరుల ప్రాజెక్టులకు నిధుల మంజూరు విషయంలో గ్రీన్‌ చానల్‌ విధానాన్ని అవలంబిస్తున్నామని చెప్పారు. 

ప్రాధాన్యతా క్రమంలో ప్రాజెక్టులకు నీళ్లు..
నాలుగేళ్లలో ఇరిగేషన్‌పై రూ. 58,024 కోట్లు ఖర్చు చేశామని, ప్రాధాన్యతా క్రమంలో 54 ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు నిధుల విడుదలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. నాలుగేళ్లలో 26 లక్షల ఎకరాల ఆయుకట్టు స్థిరీకరణ జరిగిందని, 4.50 లక్షల ఎకరాలు కొత్తగా ఆయుకట్టులోకి తీసుకువచ్చామన్నారు. వచ్చే ఏడాది జూన్‌ నాటికల్లా రాష్ట్రంలో 45 సాగునీటి ప్రాజెక్టుల్ని పూర్తి చేస్తామని చెప్పారు. రాష్ట్రంలోని అన్ని ప్రాజెక్టుల్లోనూ దాదాపు 650 టీఎంసీల నీటిని నిల్వ చేసుకోగలిగామని తెలిపారు. త్వరలో మహా సంగమానికి శ్రీకారం చుడతామని, గోదావరి–పెన్నా అనుసంధానాన్ని బొల్లాపల్లి రిజర్వాయర్‌ ద్వారా చేయనున్నట్లు చంద్రబాబు తెలిపారు.

ఈ ఏడాది ఇప్పటివరకూ సముద్రంలోకి 2 వేల టీఎంసీల నీటిని వదిలామన్నారు. రాష్ట్రంలో రెండు కోట్ల ఎకరాల సాగుభూమిలో ప్రస్తుతం 1.04 కోట్ల ఎకరాలకు మాత్రమే నీరు ఇవ్వగలుగుతున్నామని చెప్పారు. ఈనెలలో 12 సాగునీటి ప్రాజెక్టులు జాతికి అంకితం చేస్తామన్నారు. వైకుంఠపురం వద్ద బ్యారేజీ నిర్మించి 10 టీఎంసీలు, ఏలేరు రిజర్వాయర్‌లో 24 టీఎంసీల నీటిని నిల్వ చేయనున్నట్లు తెలిపారు. అనంతపురం జిల్లాలో జీడిపల్లి వద్ద 50 వేల ఎకరాల్లో ప్రయోగాత్మకంగా రూ. 890 కోట్లతో కమ్యూనిటీ డ్రిప్‌ ఇరిగేషన్‌ను ప్రారంభించామని, సత్ఫలితాలు వస్తే రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తామన్నారు. 

11 లక్షల ఎకరాల్లో పంటలు కాపాడాం..
పట్టిసీమ ద్వారా కృష్ణా, గుంటూరు, ప్రకాశం, పశ్చిమగోదావరి జిల్లాలతో పాటు రాయలసీమకు నీటిని తరలించి 11 లక్షల ఎకరాల్లో పంటల్ని కాపాడామన్నారు. పోలవరం పనులు 57.9 శాతం పూర్తయ్యాయని, రూ.2,700 కోట్లు కేంద్రం నిధులు ఇవ్వాల్సి ఉందన్నారు. పోలవరం పనులు నాసిరకంగా జరుగుతున్నాయని ప్రజల్లో అపోహలు కలిగిస్తున్నారని చంద్రబాబు పేర్కొన్నారు. పనగరియా సిఫారసు చేయడంతోనే కేంద్రం పోలవరం ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతలు రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించిందన్నారు. ఈ సందర్భంగా అసెంబ్లీలో పోలవరం డయా ఫ్రం వాల్, గ్యాలరీ వాక్‌ ప్రదేశాన్ని వీడియో ద్వారా ప్రదర్శించారు. ఈ నెల 12న ఎమ్మెల్యేలంతా వారి కుటుంబ సభ్యులతో పోలవరం గ్యాలరీ వాక్‌కు రావాలని జలవనరుల శాఖ ఆహ్వానించిందన్నారు.

ఈ నెల 14, 15, 16వ తేదీల్లో ఎమ్మెల్యేలంతా వారి వారి నియోజకవర్గాల్లో జలసిరికి హారతి కార్యక్రమాల్లో పాల్గొనాలని, ప్రజలను చైతన్యపరిచేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. కరవుపై ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప, నదుల అనుసంధానంపై జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమ చర్చలో పాల్గొన్నారు. కాగా, అసెంబ్లీలో కరవు–నదుల అనుసంధానంపై చర్చ సమయంలో అధిక శాతం మంది ఎమ్మెల్యేలు డుమ్మా కొట్టారు. చర్చ ప్రారంభమైన సమయంలో కనీసం 30 మంది ఎమ్మెల్యేలు కూడా లేరు. మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభమైన చర్చ సాయంత్రం 4 గంటల వరకు కొనసాగింది.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top