బాబు హామీకి దిక్కులేదు | Sakshi
Sakshi News home page

బాబు హామీకి దిక్కులేదు

Published Fri, Jun 12 2015 7:03 PM

బాబు హామీకి దిక్కులేదు - Sakshi

సాక్షి, హైదరాబాద్: గృహ నిర్మాణ శాఖకు బడ్జెట్‌లో కేటాయించిన నిధులు కాగితాలకే పరిమితం అయ్యాయి. పేరుకు వందలకోట్ల రూపాయల నిధులు కేటాయించినా ఇప్పటి వరకూ పేదల కోసం ఒక్క ఇళ్లు కూడా మంజూరు చేయలేదు. ఈ ఏడాది బడ్జెట్‌లో ఈ శాఖకు రూ. 897 కోట్లు కేటాయించినప్పటికీ ఆ మేరకు నిధులు విడుదల కాలేదు. ఇళ్ల మంజూరు కోసం ఏడాదిగా లబ్ధిదారులు ఎదురు చూడటమే తప్ప ప్రయోజనం మాత్రం దక్కడం లేదు. నిధుల కొరత కారణంగా కొత్త ఇళ్లు మంజూరు చేసే పరిస్థితి లేకపోవడంతో ఇక కేంద్ర ప్రభుత్వంపై మాత్రమే ఆశలున్నాయి.

గత ఏడాది గృహ నిర్మాణ శాఖకు బడ్జెట్‌లో రూ. 808 కోట్లు కేటాయించినా ఉద్యోగుల జీతాలు, ఇతర ఖర్చులకే ఆ నిధులు సరిపోయాయి. కనీసం ఒక్క రూపాయి కూడా పెండింగ్ బిల్లులు మంజూరు చేయలేకపోయారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే కొత్త ఇళ్లను కేటాయిస్తామని, షెడ్యూల్డ్ కులాలు, తెగలకు యూనిట్ ధరను రూ. 1.50 లక్షలకు, ఇతర కులాలకు చెందిన లబ్ధిదారులకు లక్ష రూపాయలకు పెంచుతానని ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. ప్రస్తుతం ఆ ప్రతిపాదన పరిశీలనలో ఉన్నందున కొత్త ఇళ్ల మంజూరు ఆలస్యం అవుతోందని అధికారులు చెబుతున్నారు. గత ప్రభుత్వ హయాంలో మంజూరై కొంత వరకూ నిర్మాణాలు పూర్తిఅయ్యి ఆగిపోయిన ఇళ్లకు బిల్లులు చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించినప్పటికీ ఇప్పటికీ అమలు కాలేదు.

ఇలాంటి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అమలు చేసే రాజీవ్ ఆవాస్ యోజన (ఆర్‌ఏవై), ఇందిరా అవాస్ యోజన (ఐఏవై) పథకాల మంజూరు పైనే రాష్ట్రం ఆశలున్నాయి. ఆర్‌ఏవై పథకం కింద ఈ ఏడాది పట్టణ ప్రాంతాల్లో 25 వేల గృహాలకు నిధులు వచ్చే అవకాశం ఉందని సమాచారం. ఐఏవై పథకం కింద వీటికి మూడింతల సంఖ్య ఇళ్ల నిర్మాణానికి నిధులు కేటాయించాలని కేంద్రానికి రాష్ట్ర అధికారులు ఇటీవల ప్రతిపాదనలు పంపారు. ఆ మేరకు ఇళ్లు ఇస్తే తప్ప గ్రామీణ ప్రాంతాల్లో పేదలకు ఇళ్లు నిర్మించే పరిస్థితి కనిపించడం లేదు.

Advertisement
Advertisement