‘మాఫీ’ మోసగాడా.. కట్టిస్తావా ‘ఇసుకమేడ’! | chandrababu naidu government neglects to pay on loan waiver scheme for dwcra womens | Sakshi
Sakshi News home page

‘మాఫీ’ మోసగాడా.. కట్టిస్తావా ‘ఇసుకమేడ’!

Aug 2 2014 4:31 AM | Updated on Aug 14 2018 3:48 PM

‘మాఫీ’ మోసగాడా.. కట్టిస్తావా ‘ఇసుకమేడ’! - Sakshi

‘మాఫీ’ మోసగాడా.. కట్టిస్తావా ‘ఇసుకమేడ’!

రైతులైనా, తామైనా..అడగకుండానే రుణాలు మాఫీ చేస్తానన్న చంద్రబాబునాయుడు

- బాబుపై నిప్పులు కక్కిన రావులపాలెం డ్వాక్రా మహిళలు
- మొన్న రుణాలరద్దు నాటకం.. ఇప్పుడు ర్యాంపుల డ్రామా
- బేషరతుగా మాఫీ చేయకుంటే ఉద్యమిస్తామని హెచ్చరిక

 రావులపాలెం : రైతులైనా, తామైనా..అడగకుండానే రుణాలు మాఫీ చేస్తానన్న చంద్రబాబునాయుడు అధికారంలోకి వచ్చాక రోజుకో మాట మాట్లాడుతూ మోసగిస్తున్నారని డ్వాక్రా మహిళలు దుయ్యబట్టారు. బేషరతుగా రుణాలు మాఫీ చేయకుంటే ఉద్యమిస్తామని హెచ్చరించారు. అసలే చంద్రబాబు మాట నమ్మి దగా పడ్డామన్న నిస్పృహతో ఉన్న మహిళలు నిప్పులు కక్కడానికి రావులపాలెం ఇందిరా కాలనీ కమ్యూనిటీ భవనం వేదికైంది. వివరాలిలా ఉన్నాయి.
 
శుక్రవారం స్థానిక కమ్యూనిటీ భవనం వద్ద సమావేశం ఉందని మండలంలోని మహిళా శక్తి సంఘాల సభ్యులను అధికారులు ఆహ్వానించారు. దాదాపు 40 మంది మహిళలు వచ్చి, మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకూ ఎదురు చూసినా సమావేశానికి రావలసిన ఉన్నతాధికారులు రాలేదు. దీంతో అసలు సమావేశం దేనికి, తమను ఎందుకు పిలిచారు అంటూ మహిళలు డ్వాక్రా ఏపీఎం విశ్వనాథాన్ని నిలదీశారు.

ఇసుక ర్యాంపుల నిర్వహణను డ్వాక్రా సంఘాలకు అప్పగించాలని ప్రభుత్వం నిర్ణయించిందని, దీనిపై మహిళల అభిప్రాయ సేకరణకు హైదరాబాద్‌లోని గ్రామీణ పేదరిక నిర్మూలనా సంస్థ నుంచి నలుగురు డెరైక్టర్లు రావలసి ఉందని ఏపీఎం చెప్పారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే తాము మహిళలను శుక్రవారం మధ్యాహ్నం 12 గంటలకల్లా రమ్మని కోరామన్నారు. అయితే ఇసుక ర్యాంపులున్న ఇతర ప్రాంతాల్లో సమావేశాలకు హాజరైన డెరైక్టర్లు రావులపాలెం రాలేకపోయారని చెప్పారు. శుక్రవారం ఇక సమావేశం జరగదని చెప్పడంతో మహిళలు ఆగ్రహోదగ్రులయ్యారు. ఇప్పటికే చంద్రబాబు రుణమాఫీపై మాటలు మార్చి మోసం చేస్తున్నారని, ఇప్పుడు ఇసుక ర్యాంపుల నిర్వహణ అని కొత్తనాటకానికి తెర తీశారని తీవ్రంగా నిరసించారు.

చంద్రబాబు మాటలు వినడం వల్ల ఐదు నెలల నుంచి రుణాలు కట్టకుండా నిండా మునిగిపోయామని ఆక్రోశించారు. బకాయి పడ్డ మొత్తం సొమ్మును ఒకేసారి కట్టమని ఒత్తిడి చేస్తున్నారని, అయితే చాలా మంది మహిళలు కట్టలేని స్థితిలో ఉన్నారని వాపోయారు. మొత్తం బాకీ కడితేనే వడ్డీ లేని రుణాలు ఇస్తామని చెప్పడం ఎంత వరకూ సమంజసమని ప్రశ్నించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీనే నిలబెట్టుకోని చంద్రబాబు ఇప్పడు ఇసుక ర్యాంపుల నిర్వహణ అంటూ మభ్యపెడుతున్నారని ధ్వజమెత్తారు. రుణమాఫీ చేయకుండా ఇసుక ర్యాంపులపై మీటింగులంటూ తమ సహనాన్ని పరిక్షించొద్దన్నారు. 15 రోజుల్లోగా చంద్రబాబు డ్వాక్రా, రైతు రుణమాఫీలపై స్పష్టమైన విధివిధానాలు ప్రకటించి, షరతులు లేని రుణమాఫీ చేయాలని, లేని పక్షంలో మహిళా సంఘాలు సంఘటితమై ఉద్యమిస్తాయని హెచ్చరించి, వెనుదిరిగారు.
 
డ్వాక్రా సంఘాలకు బ్యాంక్ నోటీసులు
గండేపల్లి : డ్వాక్రా సంఘాలకు రుణమాఫీ హామీలతో అధికారం చేపట్టిన తెలుగుదేశం ప్రభుత్వం ఆ హామీని అమలు చేస్తుందో లేదో తెలియక ఆయా సంఘాల సభ్యులు ఆందోళనలకు గురవుతున్నారు. రూ.లక్ష లోపు ఉన్న రుణాలను కూడా తీర్చాలని బ్యాంకుల నుంచి వారికి నోటీసులు అందాయి. మండలంలోని మురారి, గండేపల్లి గ్రామాలకు చెందిన సుమారు 25 డ్వాక్రా సంఘాల  వారికి తక్షణమే తీసుకున్న రుణం, వడ్డీ చెల్లించాలని బ్యాంకు నుంచి నోటీసులు వచ్చాయి.

రూ.లక్ష లోపు రుణాలను  మాఫీ చేస్తామని ప్రభుత్వం ప్రకటించగా నోటీసులు ఎందుకు అందాయా అని దుర్గాలక్ష్మి, ఈశ్వరి, శ్రీనివాస, సత్యసాయి, సాయిబాబా, దుర్గ, భవాని, సుగుణ, సత్యసాయి, భారతి, ఇందిర, మల్లేశ్వరి తదితర శక్తి సంఘాల మహిళలు మల్లగుల్లాలు పడుతున్నారు. తాము కట్టాల్సిన బాకీ రూ. లక్ష లోపే ఉందని, రుణమాఫీ ప్రకారం తాము కట్టాల్సిన అవసరం లేకపోయినప్పటికీ నోటీసులు అందాయని బి. అప్పలనర్స, ఆర్. జ్యోతి, బి. అప్పయ్యమ్మ, ఎన్. సత్యవతి, సత్య తదితరులు చెబుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement