ఉత్తుత్తి వాగ్దానాల బాబు !

Chandrababu Has Gave False Promises To Avanigadda  - Sakshi

గుర్తుందా సారు !

సాక్షి,అవనిగడ్డ : సాగర సంగమ ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతాం.. ‘ఏటిమొగ – ఎదురుమొండి మధ్య కృష్ణా నదిలో రూ.74 కోట్లుతో వారధి నిర్మిస్తాం.. చుక్కల భూములు, కండిషన్‌ పట్టాల భూముల సమస్య పరిష్కరిస్తాం.. ఇలా దివిసీమ వాసులకు ఇచ్చిన మరెన్నో హామీలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నీటిపై రాతలుగా మార్చేశారు. ప్రతి సారీ మాట తప్పి నిన్ను నమ్మం బాబు అనే పరిస్థితి తెచ్చుకున్నారు. 

ఎదురుమొండి వారధి ఏమైంది? 
గత ఏడాది నవంబర్‌ 21వ తేదీ ఉల్లిపాలెం, చల్ల పల్లిలో పర్యటించిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఏటిమొగ – ఎదురుమొండి వారధి నిర్మాణానికి  రూ.74 కోట్లు కేటాయించామని, టెండర్లు పూర్తికాగానే పనులు ప్రారంభిస్తామని చెప్పారు. అప్పటి నుంచి ఎన్నికల నోటిఫికేషన్‌ రావడానికి మూడు నెలల సమయం ఉన్నా ఈ విషయంలో.. ఎలాంటి చర్యలు చేపట్టక పోవడం పట్ల దీవుల వాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

2008లో రూ.45 కోట్లతో వారధి నిర్మాణానికి  ప్రపంచబ్యాంకు నిధుల కోసం దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి ప్రతిపాదనలు పంపారు. ఆయన మరణం అనంతరం వీటిని ఎవరూ పట్టించుకోలేదు. ఈ నెల 19వ తేదీ అవనిగడ్డలో నిర్వహించిన బహిరంగ సభలో తాము అధికారంలోకి వచ్చిన వెంటనే ఎదురుమొండి వారధి నిర్మిస్తామని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హామీ ఇచ్చారు.

పర్యాటక అభివృద్ధి శూన్యం 
పవిత్ర కృష్ణా నది సముద్రంలో కలిసే సాగర సంగమం ప్రాంతం చారిత్రక ప్రదేశంగా గుర్తింపు పొందింది. 2017లో నిర్వహించిన కృష్ణా పుష్కరాలు సందర్భంగా సాగర సంగమానికి వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ ప్రాంతంలో నెలకొన్న అడ్డంకులను తొలగించి సాగర సంగమాన్ని ప్రత్యేక సందర్శన ప్రాంతంగా తీర్చిదిద్దుతామని, కూచిపూడి, శ్రీకాకుళం, ఘంటసాల, మోపిదేవి, అవనిగడ్డ, హంసలదీవిలను కలుపుతూ పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. ఆ దిశగా ఇంతవరకూ ఎలాంటి చర్యలు లేవు.

చుక్కలు చూపిస్తున్నారు 
దివిసీమలోని పలు మండలాల్లో కండిషన్‌ పట్టా భూములు రైతులకు చుక్కలు చూపిస్తున్నా పాలకులు స్పందించకపోవడంపై దివి రైతాంగం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. కోడూరు, నాగాయలంక, అవనిగడ్డ మండలాల్లో కండిషన్‌ పట్టా (సీపీ పట్టా), చుక్కల భూములు 34 వేల ఎకరాలు ఉన్నాయి. ఈ భూములన్నీ ఐదారు తరాల నుంచి రిజిస్ట్రేషన్‌ అవుతున్న భూములే అయినప్పటికీ కండిషన్‌ పట్టా లిస్టులో చేర్చడంతో రిజిస్ట్రేషన్లు నిలిచిపోయాయి. అత్యవసర పరిస్థితిలో పొలాలను అమ్ముకునేందుకు వీలు పడక, అప్పుల పాలవుతున్నారు.  

రక్షణ కేంద్రం ఏర్పాటయ్యేనా?  
దివిసీమలోని గుల్లలమోదలో క్షిపణి పరీక్షా కేంద్రం ఏర్పాటు నాలుగేళ్ల క్రితమే కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది. 381.61 ఎకరాలు అటవీ భూములను కేటాయించారు. అప్పటి నుంచి పలు అవరోధాలు వల్ల ప్రాజెక్టు జాప్యం అవుతూ వస్తోంది. కేంద్రంలో బీజేపీతో టీడీపీ అంటకాగిన నాలుగేళ్లలో ఈ ప్రాజెక్టులో ఎలాంటి పురోగతి లేకపోగా, టీడీపీ కేంద్రంతో తెగతెంపులు చేసుకున్నాక పలు అనుమతులు రావడం కొసమెరుపు

సీఎం దివిసీమకు ఇచ్చిన హామీలు    

  • కోడూరు పీహెచ్‌సీని 24 గంటల వైద్యశాలగా మార్చేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. మరచిపోయారు.  
  • కోడూరు, నాగాయలంక మండలాల్లో లింగన్నకోడు, ఇరాలి, రత్నకోడుపై చెక్‌డ్యాంలు (రబ్బర్‌ డ్యాంలు) నిర్మిస్తామని చెప్పారు. ఉత్తుత్తి హామీ చేశారు.   
  • విజయవాడ – మచిలీపట్నం నాలుగులైన్లకు ఉల్లిపాలెం వారధిని అనుసంధానం చేస్తామన్నారు. ఆ ఊసే మరిచారు.   
  • కేరళను తలదన్నే ప్రకృతి సుందర ప్రదేశమున్న దివిసీమను రాజధానిలో గొప్ప పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దుతామన్నారు. 
  • అవనిగడ్డ నియోజకవర్గాన్ని జిల్లాలో ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతామన్నారు. ఆ తర్వాత పట్టించుకున్న            పాపానపోలేదు.

రూపాయి బోనస్‌ ఇవ్వలేదు 
గత ఏడాది కురిసిన భారీ వర్షాలకు ఆరు ఎకరాల్లో సాగు చేసిన మొక్కజొన్న పంట నీట మునిగి దెబ్బతింది. మొక్కజొన్న తడిసిందని క్వింటాల్‌కు రూ.150 తగ్గించి కొన్నారు. దీనివల్ల ఎకరాకు రూ.6 వేలు నష్టపోయాం. క్వింటాల్‌కు రూ.200 బోనస్‌ ఇస్తామని చంద్రబాబు చెప్పారు. ఏడాది అయినా ఇంతవరకూ ఒక్క రైతుకు రూపాయి బోనస్‌ ఇవ్వలేదు.
– గాజుల రాంబాబు, రైతు, బందలాయిచెరువు 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top