‘నారా’జకీయంపై నారీభేరి | Chandrababu don't talk about loan waiver | Sakshi
Sakshi News home page

‘నారా’జకీయంపై నారీభేరి

Published Sat, Jan 31 2015 3:00 AM | Last Updated on Sat, Jul 28 2018 3:23 PM

‘నారా’జకీయంపై  నారీభేరి - Sakshi

రుణ మాఫీ మాటెత్తని చంద్రబాబు  మండిపడుతన్న మహిళా సంఘాలు
 

‘మహిళలంటే నాకెంతో అభిమానం. వారు వేసిన ఓట్లే నా గెలుపునకు కారణం. వారిని జీవితంలో మరిచిపోను. మహిళల కోసం ఏమైనా చేస్తాను’.. ఎన్నికల ప్రచారం చేస్తున్నప్పుడు, అధికార దండం అందుకున్నప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు పదేపదే చెప్పుకొన్న గొప్పలివి. ఆయన ప్రముఖంగా ప్రచారం చేసుకున్న డ్వాక్రా మహిళల రుణ మాఫీపై ఇప్పటికీ స్పష్టత ఇవ్వలేదు. అధికారం చేపట్టి ఆరు నెలలైనా హామీని అమలు చేయలేదు. చంద్రబాబు కప్పదాటు వైఖరిపై జిల్లాకు చెందిన 6 లక్షల 20 వేల మంది డ్వాక్రా మహిళలు మండిపడుతున్నారు.
 
ఏలూరు (టూటౌన్) : డ్వాక్రా మహిళలు తీసుకున్న మొత్తం రుణాన్ని మాఫీ చేస్తానని ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు వాగ్దానం చేశారు. అధికారంలోకి రాగానే గ్రూపునకు రూ.లక్ష చొప్పున మాఫీ చేస్తానని మాట మార్చారు. కనీసం ఆ హామీనైనా నిలబెట్టుకోలేదు. డ్వాక్రా రుణాలు మాఫీ చేసే వరకూ ఎవరూ రుణాలు కట్టొద్దన్న బాబు బ్యాంకుల వల్ల డ్వాక్రా మహిళలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను కూడా కనీసం పరిష్కరించలేకపోయారు. దీంతో డ్వాక్రా మహిళలు బ్యాంకుల్లో దాచుకున్న పొదుపు సొమ్మును బ్యాంకు అధికారులు రుణం కింద జమ చేసుకున్నారు. జిల్లా వ్యాప్తంగా 48 మండలాలు కలిపి 62 వేల డ్వాక్రా గ్రూపులున్నాయి. దీనిలో 6 లక్షల 20 వేల మంది మహిళలున్నారు. వీరందరూ వివిధ బ్యాంకుల ద్వారా రూ.1163 కోట్ల రుణం తీసుకున్నారు. ప్రభుత్వం ఇచ్చిన హామీ నిలబె ట్టుకోవాలంటే జిల్లాలోని డ్వాక్రా గ్రూపులకు రూ.620 కోట్లు అవసరం. ఇప్పటికే ప్రభుత్వ ఖజానా ఖాళీ అయిన నేపధ్యంలో మరో 6 నెలలు గడిచినా డ్వాక్రా మహిళల రుణాల మాఫీ అయ్యే అవకాశాల్లేవు.  ఈ సందర్భంగా జిల్లాలోని కొందరు డ్వాక్రా మహిళలు వ్యక్తం చేసిన అభిప్రాయాలివి.
 
 అన్నీ అబద్దాలే


ఎన్నికల సందర్భంగా చంద్రబాబు అబద్దాలు చెప్పి డ్వాక్రా మహిళలను మోసగించారు. మేం పొదుపు చేసుకున్న సొమ్మును బ్యాంకు అధికారులు జమ చేసుకుంటున్నారు. అదేమని అడిగితే మాకు సంబంధం లేదంటున్నారు. తీసుకున్న రుణాలు కట్టొద్దా? అని ప్రశ్నిస్తున్నారు.
 - అంబటి ధనలక్ష్మి, డ్వాక్రా మహిళ, ద్వారకాతిరుమల

మాట తప్పిన బాబు

 డ్వాక్రా రుణాలు మాఫీ అవుతాయన్న నమ్మకం లేకుండా పోయింది. రుణాలు మాఫీ చేస్తామని చెప్పగానే నమ్మకంతో ఓట్లేశాం. ఆరు నెలలవుతున్నా మాఫీ కాలేదు. రుణాలు కట్టి తీరాలంటూ బ్యాంకు అధికారులు ఆదేశించటంతో కడుతున్నాం. చంద్రబాబు మాట తప్పారు.
 - పెద్దపులి సుధ, డ్వాక్రా మహిళ, చింతలపూడి
 
పస్తులుండి చెల్లిస్తున్నాం చంద్రబాబు


 హామీని న మ్మి డ్వాక్రా రుణాన్ని సకాలంలో చెల్లించలేదు. వాయిదాలు మీరడంతో బ్యాంక్ అధికారులు ము క్కుపిండి వసూలు చేస్తున్నారు. పేద కుటుంబం కావడంతో చెల్లించలేకపోతున్నాను. చంద్రబాబు చేసిన మోసంతో పస్తులుండి చెల్లించాల్సి వస్తోంది.
 - గంటా రమణ, ఆర్జావారిగూడెం,
 భీమడోలు, డ్వాక్రా సంఘం నాయకురాలు
 
వడ్డీలు పెరిగిపోతున్నాయి
 
ఏడాదిగా 500కు పైగా సంఘాలకు డ్వాక్రా రుణాలు చెల్లించకపోవడంతో బ్యాంకుల్లో వడ్డీలు పెరిగిపోతున్నాయి. బ్యాంకులకు వెళ్తే డ్వాక్రాసంఘాల మహిళలకు రుణం లభించకపోగా, అవమానాలు ఎదుర్కొంటున్నారు. మరో ఏడాది రుణం చెల్లించకపోతే వడ్డీలు అసలును మించిపోతాయి.
 - వనమా భాగ్యలక్ష్మి,
 మండల మహిళా సమాఖ్య సభ్యురాలు, కుక్కునూరు
 
అప్పుల్లో మహిళా సంఘాలు
 
డ్వాక్రా రుణాలు తీసుకున్న మహిళా సంఘాలు అప్పుల్లో కూరుకుపోతున్నాయి. రూ.లక్షలోపు రుణాలు తీసుకున్న సంఘాలు చెల్లించాల్సిన వడ్డీ అసలు మించిపోయింది. రూ.3 లక్షలు తీసుకున్న సంఘాలకు రూ.లక్షకుపైగా బకాయిలున్నాయి.
 - బెజ్జంకి లక్ష్మి, వీఓ, రామసింగారం, కుక్కునూరు
 
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement