
చంద్రబాబు నన్ను మందలించారు: నాని
తెలుగుదేశం పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తనను మందలించినట్లు విజయవాడ ఎంపీ కేశినేని నాని తెలిపారు.
తెలుగుదేశం పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తనను మందలించినట్లు విజయవాడ ఎంపీ కేశినేని నాని తెలిపారు. మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుపై కృష్ణాజిల్లాలో ఆయన బహిరంగ వేదికమీద తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించడంతో సీరియస్ అయిన చంద్రబాబు.. నానిని హైదరాబాద్ పిలిపించారు. విడిగా మాట్లాడి ఒకింత కఠినంగానే చురకలు అంటించినట్లు తెలిసింది. చంద్రబాబుతో భేటీ అయిన తర్వాత నాని మీడియాతో మాట్లాడారు.
మంత్రి విషయంలోను, అధికారుల విషయంలోను తాను మాట్లాడిన మాటల గురించి చంద్రబాబు తనను మందలించినట్లు ఆయన వెల్లడించారు. ఏదైనా ఉన్నా బహిరంగ వేదికమీద మాట్లాడకూడదని, నేరుగా వచ్చి తనకు చెబితే సమస్యను పరిష్కరిస్తానని చంద్రబాబు అన్నట్లు తెలిపారు. రాష్ట్ర అభ్యున్నతి కోసం రకరకాల పథకాలు అమలుచేస్తున్నా, ప్రజా ప్రతినిధులకు.. అధికారులకు మధ్య సమన్వయ లోపం వల్ల అవి ప్రజలకు సరిగా చేరడంలేదని తాను సీఎంకు చెప్పానన్నారు. జిల్లాలో నాయకులంతా సమన్వయంతో పనిచేయాలని ఆయన తెలిపారని నాని అన్నారు.