డ్వాక్రా మహిళలను మోసగించిన బాబు | Sakshi
Sakshi News home page

డ్వాక్రా మహిళలను మోసగించిన బాబు

Published Tue, Jul 15 2014 3:18 AM

డ్వాక్రా మహిళలను మోసగించిన బాబు - Sakshi

ఒంగోలు టౌన్ : తాను అధికారంలోకి వచ్చిన వెంటనే డ్వాక్రా రుణాలు రద్దు చేస్తూ సంతకం చేస్తానని ప్రకటించిన చంద్రబాబు ఆ తరువాత దాని ఊసే ఎత్తకుండా మోసగించారని రాయలసీమ ఎమ్మెల్సీ గేయానంద్ విమర్శించారు. ఐద్వా జిల్లా శాఖ ఆధ్వర్యంలో స్థానిక ఎల్‌బీజీ భవన్‌లో సోమవారం మోసగించిన బాబు నిర్వహించిన సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా  ప్రసంగించారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చి నెలరోజులు దాటినప్పటికీ డ్వాక్రా రుణాల రద్దు గురించి ఎక్కడా ప్రస్తావించడం లేదన్నారు.
 
అవి ఎప్పుడు రద్దు చేస్తారా అని మహిళలు ఎదురు చూస్తుంటే, వారిని తప్పించుకునే ప్రయత్నం బాబు చేస్తున్నారని విమర్శించారు. డ్వాక్రా మహిళలకు ఇచ్చిన రుణాలు తక్కువ మొత్తంలోనే ఉన్నాయన్నారు. త్వరలో జరగనున్న మండలి సమావేశాల్లో డ్వాక్రా రుణాల రద్దు గురించి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తామని స్పష్టం చేశారు. ఐద్వా రాష్ట్ర అధ్యక్షురాలు కారుసాల సుబ్బరావమ్మ మాట్లాడుతూ టీడీపీ ఎన్నికల మేనిఫెస్టోలో డ్వాక్రా రుణాలు రద్దు చేస్తామని ప్రకటించడంతో ఎక్కువ మంది మహిళలు నమ్మి చంద్రబాబును గెలిపిస్తే చివరకు మోసగించారని విమర్శించారు.
 
ప్రభుత్వం వెంటనే స్పందించి డ్వాక్రా రుణాలు రద్దుచేసి కొత్తగా రుణాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఐద్వా జిల్లా కార్యదర్శి ఎస్‌కే మున్వర్ సుల్తానా మాట్లాడుతూ పొదుపు డబ్బులను సభ్యులకు తెలియకుండా రుణాలకు జమ చేయరాదని డిమాండ్ చేశారు. ఐద్వా జిల్లా అధ్యక్షురాలు యూ ఆదిలక్ష్మి అధ్యక్షతన నిర్వహించిన సదస్సులో నాయకురాళ్లు జే అన్నపూర్ణ, కే రమాదేవి, కే సృజన, కే రాజేశ్వరి పాల్గొన్నారు. సదస్సు అనంతరం ఐద్వా నాయకురాళ్లు, కార్యకర్తలు ప్రదర్శనగా బయలుదేరి కలెక్టర్ విజయకుమార్‌కు వినతిపత్రం సమర్పించారు.

Advertisement
 
Advertisement
 
Advertisement