ఊరూవాడా సంబురం


సంగారెడ్డి డివిజన్, న్యూస్‌లైన్: ఊరువాడా ‘తెలంగాణ’ సంబురాలు శుక్రవారం రెండో రోజూ మిన్నంటాయి. కేంద్ర కేబినెట్ తెలంగాణ ఏర్పాటుకు ఆమోదం తెలపటంతో జిల్లా వ్యాప్తంగా రాజకీయపార్టీలు, ఉద్యోగ, ఉపాధ్యాయ, విద్యార్థి సంఘాలు వేడుకలు జరుపుకున్నాయి. విజయోత్సవ ర్యాలీలు నిర్వహించటంతోపాటు బాణసంచా కాల్చి నృత్యాలు చేసి సందడి చేశారు. మిఠాయిలు పంచిపెట్టి తమ సంతోషాన్ని పంచుకున్నారు. పెత్రమాసను పురస్కరించుకుని సిద్దిపేటలో టీఆర్‌ఎస్, జేఏసీ ఆధ్వర్యంలో తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ అమరవీరుల కోసం ఎమ్మెల్యే హరీష్‌రావు బియ్యం ఇచ్చారు.

 

 జిల్లా కేంద్రం సంగారెడ్డిలో బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదులు పాశం వండి పంచిపెట్టారు. కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు విష్ణువర్ధన్‌రెడ్డి, న్యాయవాదులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మెదక్‌లో కాంగ్రెస్ నాయకులు ర్యాలీ నిర్వహించి మిఠాయిలు పంచిపెట్టారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు మధుసూదన్‌చారి, ఆంజనేయులు, శశిధర్ పాల్గొన్నారు. సిద్దిపేటలో జేఏసీ, టీఆర్‌ఎస్ నాయకులు సంయుక్తంగా టౌన్ సెంటర్ నుంచి తెలంగాణ అమరవీరుల స్థూపం వరకు ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే హరీష్‌రావు, జేఏసీ నాయకులు పాపనయ్య, టీఆర్‌ఎస్ నాయకులు రాజనర్సు, చిన్న, నయ్యబ్‌పటేల్ తదితరులు పాల్గొన్నారు. బీజేపీ రాష్ట్ల్ర నాయకుడు వంగరామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో పార్టీ నాయకులు సుష్మాస్వరాజ్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు.

 

 పటాన్‌చెరులో ఎమ్మెల్యే నందీశ్వర్‌గౌడ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులు విజయోత్సవ వేడుకలు జరుపుకున్నారు. ఎమ్మెల్యే నివాసం ఎదుట కాంగ్రెస్ నాయకులు పెద్దఎత్తున బాణ సంచా కాల్చడంతోపాటు మిఠాయిలు పంపిణీ చేశారు. జహీరాబాద్‌లో కాంగ్రెస్ నాయకులు ర్యాలీ నిర్వహించి ఇందిర, రాజీవ్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. టీఆర్‌ఎస్ నాయకులు యాకుబ్, మోహన్, కార్యకర్తలు బాణసంచా కాల్చి స్వీట్లు పంచిపెట్టారు. బీజేపీ నియోజకవర్గ నేత సుధీర్ బండారి ఆధ్వర్యంలో ఆ పార్టీ నాయకులు ర్యాలీ నిర్వహించారు. టీఎన్జీవో జిల్లా నాయకులు జనార్దన్ ఆధ్వర్యంలో ఉద్యోగులు వేడుకలు జరుపుకున్నారు. ఏబీవీపీ నాయకులు పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. నారాయణఖేడ్‌లో కాంగ్రెస్, టీఆర్‌ఎస్, ఏబీవీపీ నాయకులు వేర్వేరుగా విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. డిగ్రీ కళాశాల విద్యార్థులు భారీ జాతీయ జెండాతో పట్టణంలో ఊరేగింపు చేపట్టారు. జోగిపేటలో టీఆర్‌ఎస్, జేఏసీ నాయకులు కిష్టయ్య, నాగభూషణం ఆధ్వర్యంలో బాణ సంచా కాల్చి స్వీట్లు పంచిపెట్టారు. కాంగ్రెస్ నాయకులు పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. నర్సాపూర్‌లో కాంగ్రెస్ నేత అనిల్‌గౌడ్, సర్పంచ్ రామణరావు ఆధ్వర్యంలో కార్యకర్తలు  బైక్ ర్యాలీ నిర్వహించారు. గజ్వేల్‌లో జేఏసీ, టీఆర్‌ఎస్, టీటీఎఫ్ నాయకులు పట్టణంలో ర్యాలీ నిర్వహించి స్వీట్లు పంపిణీ చేశారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top