ఊరూవాడా మిన్నంటిన సంబరాలు | Celebrations all over Andhra Pradesh On Three Capitals | Sakshi
Sakshi News home page

ఊరూవాడా మిన్నంటిన సంబరాలు

Jan 21 2020 6:05 AM | Updated on Jan 21 2020 6:36 AM

Celebrations all over Andhra Pradesh On Three Capitals - Sakshi

పాలన వికేంద్రీకరణను స్వాగతిస్తూ విశాఖలో జరిగిన బైక్‌ ర్యాలీలో పాల్గొన్న ప్రజలు

పాలన వికేంద్రీకరణకు మార్గం సుగమం చేస్తూ.. సమతుల అభివృద్ధికి బాటలు వేస్తూ.. మూడు రాజధానుల ఏర్పాటుకు సంబంధించి కేబినెట్‌లో తీర్మానం ఆమోదించడంతోపాటు.. అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టడాన్ని యావత్‌ రాష్ట్రం స్వాగతించింది. రాష్ట్ర ప్రజలు ఎక్కడికక్కడ బాణసంచా కాల్చి.. మిఠాయిలు పంచుకుని సంబరాలు చేసుకున్నారు. వికేంద్రీకరణ అంశంపై సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్న సీఎం వైఎస్‌ జగన్‌కి ప్రజా సంఘాలన్నీ జేజేలు పలుకగా.. అన్ని వర్గాల ప్రజలు బ్రహ్మరథం పట్టారు.  ర్యాలీలు, మానవ హారాలు, ప్రదర్శనలతో పట్టణాలు, పల్లెల్లో సందడి నెలకొంది. ఇదే సందర్భంలో చంద్రబాబు, టీడీపీ నేతల తీరుపై నిరసనలు వ్యక్తమయ్యాయి. ఇకనైనా బుద్ధి తెచ్చుకుని.. ప్రజల ఆకాంక్షలను గౌరవించాలని, అన్ని ప్రాంతాల అభివృద్ధికి కట్టుబడకపోతే చంద్రబాబు చరిత్ర హీనుడుగా మిగిలిపోతారని మేధావులు హితవు పలికారు.

‘పశ్చిమ’లో క్షీరాభిషేకాలు.. కేక్‌ కటింగ్‌లు
సాక్షి ప్రతినిధి, ఏలూరు: పాలన వికేంద్రీకరణ నిర్ణయంపై పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా భారీ ప్రదర్శనలు, బైక్‌ ర్యాలీలు జరిగాయి.  బాణసంచా  నిడదవోలు, పోలవరం, చింతలపూడిలో భారీ బైక్‌ ర్యాలీలు జరిగాయి. 

సింహపురి సంబరం
నెల్లూరు: పాలన వికేంద్రీకరణ బిల్లులను అసెంబ్లీలో ప్రవేశపెట్టిన సందర్భంగా పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ప్రజలు సంబరాలు జరుపుకున్నారు. మిఠాయిలను పంచి ఆనందం వ్యక్తం చేశారు. రూరల్‌ నియోజకవర్గంలో విద్యార్థులతో కలిసి ఆర్టీసీ బస్టాండ్‌ వద్ద స్వాగత ర్యాలీని నిర్వహించారు. 

సిక్కోలు అంతటా ర్యాలీల హోరు
శ్రీకాకుళం: మూడు రాజధానుల ఏర్పాటును స్వాగతిస్తూ శ్రీకాకుళం జిల్లావాసులు సోమవారం ర్యాలీలు నిర్వహించారు. అన్ని నియోజకవర్గ కేంద్రాలు, మండల కేంద్రాల్లో ర్యాలీలు సాగాయి. సీఎం వైఎస్‌ జగన్‌ చిత్రపటానికి క్షీరాభిషేకాలు చేశారు. పలుచోట్ల బాణసంచా కాల్చారు. 

విజయనగరంలో హర్షాతిరేకాలు
విజయనగరం: విశాఖలో ప్రభుత్వ కార్యనిర్వాహక రాజధాని, రాజ్‌భవన్‌ ఏర్పాటు చేయాలని రాష్ట్ర కేబినెట్, అసెంబ్లీలో నిర్ణయాలు తీసుకోవడాన్ని స్వాగతిస్తూ విజయనగరం జిల్లా అంతటా సోమవారం ప్రజలు ర్యాలీలు నిర్వహించారు. అన్ని నియోజకవర్గ కేంద్రాలు, మండల కేంద్రాల్లో ప్రదర్శనలు నిర్వహించి బాణసంచా కాల్చారు. పాలన వికేంద్రీకరణ వల్ల అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని నినాదాలు చేశారు.
గజపతినగరంలో బాణా సంచా కాలుస్తున్న ప్రజలు 

గుంటూరులో సందడే సందడి
ఏఎన్‌యూ/పట్నంబజార్‌(గుంటూరు): రాష్ట్రంలో మూడు రాజధానులు ఏర్పాటును స్వాగతిస్తూ ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో ఉద్యోగులు, పరిశోధకులు, విద్యార్థి సంఘాల నాయకులు సంబరాలు జరుపుకున్నారు. యూనివర్సిటీ ప్రధాన ద్వారం వద్ద సీఎం వైఎస్‌ జగన్‌ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. అభివృద్ధి, పాలన వికేంద్రీకరణ అణగారిన వర్గాల అభివృద్ధికి దోహదం చేస్తుందని నినాదాలు చేశారు. 
గుంటూరులో సీఎం చిత్రపటానికి క్షీరాభిషేకం చేస్తున్న వైఎస్సార్‌ సీపీ నేత అప్పిరెడ్డి తదితరులు 

ఒంగోలులో ర్యాలీ
ఒంగోలు: పాలనను వికేంద్రీకరిస్తూ మూడు రాజధానుల ఏర్పాటు నిర్ణయాన్ని స్వాగతిస్తూ ప్రకాశం జిల్లా కనిగిరిలో వైఎస్సార్‌ సీపీ కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు భారీ ర్యాలీ నిర్వహించారు. స్థానిక చర్చి సెంటర్‌లో మానవహారం నిర్వహించారు. జిల్లాలో పలుచోట్ల మానవ హారాలు ఏర్పాటు చేసి ప్రభుత్వానికి సంఘీభావం ప్రకటించారు. పలుచోట్ల కేక్‌లు కట్‌ చేశారు.

విశాఖలో హర్షాతిరేకాలు 
సాక్షి, విశాఖపట్నం: ప్రభుత్వ కార్యనిర్వాహక రాజధానిగా విశాఖను ఎంపిక చేస్తూ కేబినెట్‌ తీర్మానించడంతోపాటు అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టడంపై విశాఖ జిల్లా వ్యాప్తంగా సోమవారం సంబరాలు మిన్నంటాయి.  ప్రజలందరి మనసులు గెలిచేలా పాలన, అభివృద్ధి వికేంద్రీకరణ దిశగా సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి ప్రజలంతా బ్రహ్మరథం పట్టారు. ఏయూ వైఎస్సార్‌ స్టూడెంట్‌ యూనియన్, వైఎస్సార్‌ టీయూసీ, ఏయూ ఎంప్లాయీస్‌ యూనియన్‌ ఆధ్వర్యంలో విశ్వవిద్యాలయ ప్రాంగణంలో దివంగత సీఎం వైఎస్‌ రాజశేఖరరెడ్డి విగ్రహానికి క్షీరాభిషేకం చేశారు. విద్యార్థి సంఘాలు, జీవీఎంసీ ఆధ్వర్యంలో గాంధీ విగ్రహం వద్ద స్వీట్లు పంచి, బాణసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు. వివిధ ప్రజాసంఘాలు, వైఎస్సార్‌సీపీ శ్రేణులు సంపత్‌ వినాయక్‌ ఆలయం నుంచి బైక్‌ ర్యాలీ నిర్వహించారు. చంద్రబాబు తీరుకు నిరసనగా ఉత్తరాంధ్ర విద్యార్థి సేన ఆధ్వర్యంలో ఆంధ్ర విశ్వవిద్యాలయం గేటు వద్ద ఒక రోజు నిరసన దీక్ష నిర్వహించారు. తూర్పు నియోజకవర్గంలో సమన్వయకర్త అక్కరమాని విజయనిర్మల ఆధ్వర్యంలో సీఎం వైఎస్‌ జగన్‌ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. గాజువాకలో ర్యాలీ నిర్వహించారు.     
ఎగ్జిక్యూటివ్‌ రాజధానిని స్వాగతిస్తూ స్వీట్లు పంచుకుంటున్న విద్యార్థులు 

తూర్పు గోదావరిలో మిన్నంటిన వేడుకలు
సాక్షి ప్రతినిధి, రాజమహేంద్రవరం: మూడు రాజధానులకు అనుకూలంగా రాష్ట్ర కేబినెట్‌ తీర్మానించడం, అసెంబ్లీలో బిల్లు ప్రతిపాదించడాన్ని స్వాగతిస్తూ తూర్పు గోదావరి జిల్లా అంతటా సోమవారం సంఘీభావ ర్యాలీలు భారీఎత్తున నిర్వహించారు. బాణాసంచా కాల్చి.. మిఠాయిలు పంచుతూ వేడుకలు జరిపారు రాజమహేంద్రవరం ఎంపీ మార్గాని భరత్‌రామ్‌ ఆధ్వర్యంలో వైఎస్సార్‌సీపీ శ్రేణులు భారీ ర్యాలీ నిర్వహించారు. రాష్ట్ర మాల కార్పొరేషన్‌ చైర్‌పర్సన్‌ పెదపాటి అమ్మాజీ ఆధ్వర్యంలో మలికిపురంలో ర్యాలీ జరిపారు. అమలాపురం పార్లమెంటరీ నియోజకవర్గ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు ఆధ్వర్యంలో రామచంద్రపురంలో భారీ ర్యాలీ జరిగింది. పీఏసీ సభ్యుడు కుడుపూడి చిట్టబ్బాయి, శెట్టిబలిజ మహానాడు రాష్ట్ర కన్వీనర్‌ కుడుపూడి సూర్యనారాయణరావు ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఫ్లెక్సీకి క్షీరాభిషేకం చేశారు. కాకినాడ, అంబాజీపేట, పాశర్లపూడి, పి.గన్నవరం, అయినవిల్లి మండలం ముక్తేశ్వరం, పిఠాపురం, అనపర్తి తదితర ప్రాంతాల్లో ర్యాలీలు, మానవహారాలు నిర్వహించారు. బాణాసంచా కాల్చి స్వీట్లు పంచారు. 

వైఎస్సార్‌ జిల్లాలో ర్యాలీల హోరు
కడప: పాలన వికేంద్రీకరణతో ప్రగతికి పట్టం కట్టేందుకు ఉద్దేశించిన మూడు రాజధానుల బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టడంపై వైఎస్సార్‌ జిల్లాలో హర్షాతిరేకం వ్యక్తమైంది. రాజంపేట, కడప, బద్వేలు, రాయచోటి, పులివెందుల, వేంపల్లె తదితర ప్రాంతాల్లో ర్యాలీలు నిర్వహించారు. 

కాణిపాకం గణపతికి మొక్కులు
సాక్షి, తిరుపతి: అన్ని ప్రాంతాల అభివృద్ధే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని చిత్తూరు జిల్లా ప్రజలు స్వాగతించారు. జిల్లాలో పలుచోట్ల సంబరాలు చేసుకున్నారు. ర్యాలీలు నిర్వహించారు. కాణిపాకం వినాయకునికి కొబ్బరికాయలు కొట్టి మొక్కులు తీర్చుకున్నారు. పలుచోట్ల సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేస్తూ క్షీరాభిషేకాలు చేశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement