లబ్..డబ్బు | Capture precious alcohol | Sakshi
Sakshi News home page

లబ్..డబ్బు

Apr 11 2014 2:01 AM | Updated on Sep 17 2018 5:36 PM

జిల్లాలో ఓటర్లను ప్రలోభపెట్టి నోటుతో ఓటు దండుకోవడమే లక్ష్యంగా కొన్ని రాజకీయ పార్టీలు ధన రాజకీయం సాగిస్తున్నాయి. ఒకటి కాదు.. రెండు కాదు..

  • జిల్లాలో ఎన్నికల ధనప్రవాహం
  •  చేతులుమారుతున్న వైనం
  •  ఇప్పటివరకు  రూ.3.39 కోట్లు స్వాధీనం
  •  రూ. 75 లక్షల విలువైన మద్యం పట్టివేత
  •  వందల సంఖ్యలో కేసులు నమోదు
  •  సాక్షి, విజయవాడ : జిల్లాలో ఓటర్లను  ప్రలోభపెట్టి నోటుతో ఓటు దండుకోవడమే లక్ష్యంగా కొన్ని రాజకీయ పార్టీలు ధన రాజకీయం సాగిస్తున్నాయి. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా వందల కోట్లు కుమ్మరించడానికి రంగం సిద్ధంచేసి విడతలవారీగా పంపిణీకి తెరతీశారు. ఎన్నికల వేళ గెలుపుపై అనుమానంతో నేతల గుండెలు దడదడలాడుతుంటే డబ్బు వెదజల్లేందుకు దారులు వెతుకుతున్నారు.

    ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికలతో మొదలైన నోట్లవరద వచ్చే నెలలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల వరకు కొనసాగనుంది. పోలీసులు చెక్‌పోస్టులు ఏర్పాటుచేసి విస్తృతంగా తనిఖీలు చేస్తున్నప్పటికీ ఫలితం ఉండడం లేదు. ఇప్పటివరకు అధికారికంగా రూ. 3.39 కోట్లు సీజ్ చేశారు. లెక్కలోకి  రాని ఆదాయం కూడా అంతే మొత్తంలో ఉంటుందని అంచనా. ఇది కాకుండా  దాదాపు  రూ. 75 లక్షల విలువైన మద్యం నిల్వలు, బంగారం, వెండి, ఇతర ఉత్పత్తులను  స్వాధీనం చేసుకున్నారు.
     
    చెక్‌పోస్టుల వద్ద తనిఖీలు
     
    జిల్లాలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చాక విజయవాడ కమిషనరేట్ పోలీసులు, జిల్లా పోలీసులు విస్తృత తనిఖీలకు తెరతీశారు. ప్రధానంగా కమిషనరేట్ పోలీసులు గుంటూరు అర్బన్ జిల్లా పోలీసులతో కలిపి 11 చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి తనిఖీలు నిరంతరాయంగా సాగిస్తున్నారు.  జిల్లా పోలీసులు 33 చెక్‌పోస్టులు ఏర్పాటుచేసి సోదాలు కొనసాగిస్తున్నారు. రెండో దశ ప్రాదేశిక ఎన్నికలు శుక్రవారం జరగనున్న క్రమంలో గురువారం మధ్యాహ్నం నుంచి తనిఖీలు, సోదాలు మరింత ముమ్మరమయ్యాయి. మున్సిపల్ ఎన్నికలు, జిల్లాపరిషత్, మండల పరిషత్ తొలివిడత ఎన్నికలు ఇప్పటివరకు పూర్తయ్యాయి. మలి పోరు శుక్రవారం ముగుస్తుంది.
     
    ప్రలోభాల వల..
     
    వివిధ రాజకీయ పార్టీల నేతలు ఓటర్లను ప్రలోభపెట్టడమే ఎజెండాగా పెట్టుకొని డబ్బు, నగదు పంపిణీ చేపట్టారు. పురుషులకు డబ్బు, మహిళలకు చీరలు, వెండి వస్తువులు ఇస్తున్నారు.  పశ్చిమ కృష్ణాలో తెలుగుదేశం పార్టీ నేతలు అధికంగా ఈ పనిలో నిమగ్నమయ్యారు. డబ్బు, నగదుతో పట్టుబడితే రాజకీయంగా ఇబ్బందులు వస్తాయని రాజకీయాలతో సంబంధం లేని సొంత మనుషులతో ఈ వ్యవహారాన్ని చక్కబెడుతున్నారు.

    జిల్లాలో ఇప్పటివరకు రూ. 3.39 కోట్లు నగదును, 35 కిలోల వెండిని సీజ్ చేశారు. అత్యధికంగా నగదును పోలీసులు సీజ్ చేసిన విషయంలో రాష్ట్రంలోనే మూడో స్థానంలో నిలిచారంటే ఏస్థాయిలో ధనప్రవాహం జరుగుతుందో తెలుస్తోంది. కమిషనరేట్ పరిధిలో ఇప్పటివరకు రూ. 1.54 కోట్ల నగదు, రూ. 17.23 లక్షలు విలువైన మద్యం, 5 కిలోల వెండిని స్వాధీనం చేసుకున్నారు.  347 మంది రౌడీషీటర్లు, 350 మంది ట్రబుల్ మాంగర్స్, 633 మంది సస్పెక్ట్ షీటర్స్, గత ఎన్నికల కేసుల్లో ఉన్న  385 మందిపై సెక్యూరిటీ సెక్షన్ల కింద బైండోవర్ కేసులు నమోదు చేశారు.

    అలాగే 79 మందిపై ఎన్నికల కోడ్ ఉల్లంఘనల కేసులు నమోదు అయ్యాయి. కృష్ణా జిల్లాలో 1.85 కోట్ల నగదు, 3300 మందిపై బైండోవర్ కేసులు, 76 మందిపై ఎన్నికల కోడ్ ఉల్లంఘన కేసులు 17,847 మద్యం కేసులు, 10,440 కిలోల నల్లబెల్లం, ఏడు ఆటోలు,  రెండు కార్లు సీజ్ చేశారు. వీటితో పాటు 30 కిలోల వెండిని స్వాధీనం చేసుకున్నారు.   బైండోవర్ కేసులు నమోదయిన వారి ప్రవర్తనపై దృష్టి సారించారు. ఈక్రమంలో కంచికచర్లలో ఇప్పటికే బైండోవర్ కేసులు ఉన్న ఐదుగురు వ్యక్తులు దాడి ఘటనలో పాల్గొన్న  క్రమంలో వారిపై క్రిమినల్ కేసులు  నమోదు చేసి అరెస్ట్ చేయడంతోపాటు రౌడీషీట్లు తెరిచారు.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement