సాక్షి, అమరావతి: రాజధాని పరిపాలనా నగరం తుది డిజైన్లను నార్మన్ ఫోస్టర్ సంస్థ వచ్చే నెల 25వ తేదీన మరోసారి ప్రభుత్వానికి ఇవ్వనుంది. ఇందుకోసం సీఎం చంద్రబాబునాయుడు, ఆయన బృందం ప్రత్యేకంగా అక్టోబర్ 24, 25 తేదీల్లో లండన్ వెళ్లనున్నారు. ఇప్పటివరకు నార్మన్ ఫోస్టర్ సంస్థకు చెందిన ఆర్కిటెక్ట్‌లతో చర్చలు జరపగా అక్టోబర్ 24న చంద్రబాబు ఆ సంస్థ ఎండీ, అంతర్జాతీయ ఆర్కిటెక్ట్ నార్మన్ ఫోస్టర్‌తో ప్రత్యేకంగా భేటీ కానున్నారు.
సీఎం బుధవారం ఉదయం వెలగపూడి సచివాలయంలో సీఆర్‌డీఏ వ్యవహారాలపై మంత్రి నారాయణతో కలసి సమీక్ష నిర్వహించారు. రాజధాని డిజైన్లపై సుదీర్ఘంగా చర్చించిన ఆయన లండన్ పర్యటన గురించి తెలిపారు. వచ్చే నెల 24న నార్మన్ ఫోస్టర్‌తో సమావేశం తర్వాత 25వ తేదీన తుది డిజైన్లు ఖరారు చేద్దామని అధికారులతో చెప్పారు. ఇదిలా ఉండగా సీఎం లండన్ పర్యటనకు ముందుగా అక్టోబర్ 11, 12, 13 తేదీల్లో లండన్‌లోనే నార్మన్ ఫోస్టర్ బృందం రాజధాని డిజైన్ల రూపకల్పనపై ప్రత్యేక సదస్సు నిర్వహించనుంది. ఈ సదస్సులో తన బృందంతో కలిసి పాల్గొని సలహాలిచ్చేందుకు దర్శకుడు ఎస్‌ఎస్ రాజమౌళి అంగీకరించారని సీఆర్‌డీఏ కమిషనర్ శ్రీధర్ తెలిపారు.
Sep 28 2017 12:46 AM | Updated on Aug 14 2018 11:24 AM
Advertisement
Advertisement