గుప్తనిధుల వేటకు వెళ్లిన కెనరా బ్యాంక్ ఉద్యోగి మృతి

Canara bank emp dies in Forest after searching for Gupta nidhulu - Sakshi

నల్లమల అడవుల్లో శవమైన శివకుమార్‌

వీరి ముగ్గురిదీ గుంటూరు జిల్లా కొల్లిపర

సాక్షి, ఒంగోలు: వారు ముగ్గురు స్నేహితులు. వీరికి సులువుగా డబ్బు సంపాదించుకోవాలనే ఆశ కలిగింది. గుప్తనిధుల వేటలో పడ్డారు. అందుకు అవసరమైన సామగ్రితో పాటు మంచినీరు, ఆహారం, మజ్జిగ తీసుకుని బయల్దేరారు. ఇంకే ముంది ఎవరు చెప్పారో ఏమో ముగ్గురు కలిసి తర్లుపాడు మండలం తాడివారిపల్లె సమీపంలోని వెలిగొండ అటవీ ప్రాంతంలోకి వెళ్లారు. గత ఆదివారం రాత్రి అడవిలోకి వెళ్లిన వీరు తిరిగి వచ్చేందుకు రహదారి కనుగొనలేక ముగ్గురూ మూడు దారుల్లో వెళ్లారు. ఒకరు దాహార్తికి తట్టుకోలేక మృత్యువాత పడగా మరొకరు చెట్టు, పుట్టను పట్టుకుని రోడ్డుకెక్కారు. ఇంకొకరి కోసం పోలీసులు అడవిలో గాలింపు చర్యలు చేపట్టారు. 

వివరాలు.. గుంటూరు జిల్లా కొల్లిపరకు చెందిన కృష్ణనాయక్, హనుమంత నాయక్, హైదరాబాద్‌లో కెనరా బ్యాంక్‌ ఉద్యోగిగా పనిచేస్తున్న కట్టా శివకుమార్‌లు తాడివారిపల్లె వెలిగొండ అడవిలోకి వెళ్లారు. ఈ క్రమంలో ఒక రాత్రంతా అడవిలోనే గడిపారు. తిరిగి రెండో రోజు కూడా కొండ నుంచి కిందకు దిగేందుకు బయల్దేరారు. వీరిలో కృష్ణానాయక్‌ మాత్రమే సోమవారం మధ్యాహ్నానికి తీవ్ర దాహంతో కర్నూలు–ఒంగోలు రోడ్డుకు చేరుకున్నాడు. సమీపంలోని గుడి వద్దకు వెళ్లి దాహం తీర్చుకున్నాడు. మరో ఇద్దరు అటవీ ప్రాంతాన్ని దాటలేకపోయారు. 

బయటకు వచ్చిన కృష్ణానాయక్‌ అదృశ్యమైన హనుమంతనాయక్, శివకుమార్‌ బంధువులకు చెప్పాడు. అటవీ ప్రాంతానికి చేరుకున్న శివకుమార్‌ బంధువులతో పాటు కృష్ణానాయక్‌ మంగళవారం, బుధవారం అదృశ్యమైన ఇద్దరి కోసం తీవ్రంగా గాలించారు. ఆచూకీ లభించకపోవడంతో తప్పని పరిస్థితుల్లో తాడివారిపల్లె పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో రంగంలోకి దిగిన పొదిలి సీఐ చిన్న మీరా సాహెబ్‌ నేతృత్వంలో 15 మంది ప్రత్యేక బలగాలు, పోలీసులు, ఫారెస్ట్‌ ఉద్యోగి నాగరాజు గాలించేందుకు అడవిలోకి వెళ్లారు. ఉదయం 8 నుంచి తీవ్రంగా శ్రమించగా ఒంటి గంట ప్రాంతంలో శివకుమార్‌ మృతదేహాన్ని గుర్తించారు. మరో వ్యక్తి కోసం ఇంకా అడవిలోనే గాలిస్తున్నారు. తాగేందుకు నీరు లేకపోవడంతోనే ఆయన మృతి చెందినట్లు పోలీసులు భావిస్తున్నారు.

సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి
 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top