వసతి..దుర్గతి | Sakshi
Sakshi News home page

వసతి..దుర్గతి

Published Tue, Mar 20 2018 12:24 PM

Budget Funds Delay On BC Hostels - Sakshi

కర్నూలు(అర్బన్‌): జిల్లాలోని బీసీ కళాశాల వసతిగృహాల్లో ఆకలికేకలు వినిపిస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి మూడు నెలలకు ఒకసారి విడుదల చేయాల్సిన బడ్జెట్‌ను ఏడాది పైగా పెండింగ్‌ పెట్టింది. దీంతో ఎక్కడి బిల్లులు అక్కడే ఆగిపోయాయి. బియ్యం మాత్రమే ప్రభుత్వం సరఫరా చేస్తోంది. మిగిలిన  సరుకులన్నీ బయటి మార్కెట్‌లో కొనుగోలు చేయాల్సి వస్తోంది. భవనాలకు అద్దెలు చెల్లించాలని యజమానులు ఒకవైపు ఒత్తిడి చేస్తుండగా, వెంటనే బిల్లులు చెల్లించకుంటే కరెంటు కట్‌ చేస్తామని ఆ శాఖ అధికారులు మరోవైపు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. కనీసం కూరగాయలు, పండ్లు, గుడ్లు, పాలకు కూడా డబ్బు చెల్లించలేక వసతి గృహ సంక్షేమాధికారులు ఇబ్బంది పడుతున్నారు.

రాష్ట్ర ప్రభుత్వం ఏడాదిగా బీసీ కళాశాల సంక్షేమ వసతిగృహాలకు నయాపైసా బడ్జెట్‌ విడుదల చేయలేదు. డైట్‌ బిల్లులే రూ.1,89,85,484 పెండింగ్‌ పడ్డాయి. విద్యుత్‌ బిల్లులకు రూ.10 లక్షలను విడుదల చేయాల్సి ఉంది. ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవడంతో విద్యార్థుల వసతి సౌకర్యాలు చూడడానికి సంబంధిత అధికారులు అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. కేవలం బియ్యం ఇచ్చి సర్కారు సరిపెట్టుకుంటోంది. పలు సరుకుల సరఫరాకు సంబంధించి కాంట్రాక్టర్లకు బిల్లులు ఇవ్వడం లేదు. దీంతో వారు కొన్ని సరుకులను నాణ్యత లేనివి సరఫరా చేస్తున్నారు. అలాగే అనేక మంది వసతిగృహ సంక్షేమాధికారులు బయటి మార్కెట్‌ నుంచి సరుకులు కొనుగోలు చేస్తున్నారు. నెలల తరబడి డైట్‌ చార్జీలు విడుదల కాకపోవడంతో సంబంధిత షాపుల యజమానులు కూడా సరుకులను అప్పుగా ఇచ్చేందుకు వెనుకంజ వేస్తున్నారని వార్డెన్లు వాపోతున్నారు. ఈ నేపథ్యంలో అధిక వడ్డీలకు అప్పు చేసి వసతిగృహాలను నిర్వహిస్తున్నట్లు వారు చెబుతున్నారు. అద్దె భవనాల్లో కొనసాగుతున్న వాటికి అద్దెలు విడుదల చేయకపోవడంతో యజమానులు ఒత్తిడి తెస్తున్నారు. అలాగే విద్యుత్‌ బిల్లులు ప్రతి నెలా చెల్లించకపోవడంతో సంబంధిత శాఖ సిబ్బంది పలుమార్లు కనెక్షన్‌ కట్‌ చేస్తున్నారు.

ఎన్ని వసతిగృహాలు, ఎంత పెండింగ్‌ ...
జిల్లాలో 28  బీసీ కళాశాల వసతిగృహాలు ఉన్నాయి. వీటిలో దాదాపు 4,400 మంది విద్యార్థులు వసతి పొందుతున్నారు. వీటికి డైట్‌ చార్జీలు రూ.1.89 కోట్లు, విద్యుత్‌ బిల్లులు రూ.10 లక్షలు, అద్దెలు రూ.1.20 కోట్లు, టెలిఫోన్‌ బిల్లులు రూ.2.85 లక్షలు, ఓఓఈ (అదర్‌ ఆఫీస్‌ ఎక్స్‌పెన్సెస్‌) రూ.4.30 లక్షలు, మెటీరియల్‌ సప్లయ్‌కు గాను రూ.2 లక్షలను ప్రభుత్వం చెల్లించాల్సి ఉంది. రాష్ట్ర ప్రభుత్వం నేటి (ఈ నెల 20)లోపు బడ్జెట్‌ విడుదల చేయకుంటే, ఇప్పటికే ట్రెజరీకి వెళ్లిన బిల్లులన్నీ వెనక్కి వచ్చే ప్రమాదముంది.

బడ్జెట్‌ విడుదలయ్యే అవకాశాలున్నాయి
నేటిలోగా బడ్జెట్‌ విడుదలయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఇప్పటికే అవసరమైన బిల్లులన్నీ ట్రెజరీకి పంపాం. ఏడాది కాలంగా బీసీ వసతిగృహాలకు బిల్లులు పెండింగ్‌ ఉన్న మాట వాస్తవమే. ఈ ఏడాది జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలల్లో ఫ్రీజింగ్‌ ఉన్న కారణంగా బిల్లులు మంజూరు కాలేదు. బిల్లులు ఇవ్వాలని జిల్లా కలెక్టర్‌ ద్వారా తమ శాఖ డైరెక్టర్‌కు గత నెలలో నివేదికలు పంపాము.   
– కె.లాలాలజపతిరావు, ఇన్‌చార్జ్‌ డీబీసీడబ్ల్యూఓ

కోర్టు నోటీసులు పంపించారు
ఏడాదిగా అద్దె చెల్లించకపోవడంతో భవన యజమాని కోర్టు నోటీసు పంపారు. వెంటనే అద్దె చెల్లించాలని, లేని పక్షంలో ఖాళీ చేయాలని జిల్లా బీసీ సంక్షేమాధికారికి పంపిన నోటీసులో పేర్కొన్నారు. అద్దె దాదాపు రూ.6 లక్షలు, విద్యుత్‌ బిల్లులు రూ.లక్ష, డైట్‌ బిల్లులు రూ.10 లక్షల  వరకు పెండింగ్‌ ఉన్నాయి. ఇప్పటికే పలు చోట్ల అప్పులు చేశాం. ఇంకా ఎక్కడి నుంచి తేవాలో తెలియడం లేదు. కూరగాయలు, గుడ్లు, అరటి పండ్లు తదితర వాటికి కూడా డబ్బు చెల్లించలేని స్థితిలో ఉన్నాం.  – కె.హారతీదేవి, బీసీ బాలికల వసతిగృహం సంక్షేమాధికారిణి, కర్నూలు

రూ.15 లక్షలు చెల్లించాల్సి ఉంది
14 నెలలుగా అద్దె దాదాపు రూ.15 లక్షలు చెల్లించాల్సి ఉంది. భవన యజమాని ఒత్తిడి చేస్తున్నారు. 2017 ఆగస్టు నుంచి ఇప్పటి వరకు రూ.12 లక్షల డైట్‌ బిల్లులు పెండింగ్‌ ఉన్నాయి. రూ.2లక్షలు విద్యుత్‌ బిల్లులు వెంటనే చెల్లించాలని ఆ శాఖ అధికారులు ఒత్తిడి చేస్తున్నారు. ఏడాది కాలంగా అప్పులు చేసి విద్యార్థులకు భోజనం పెట్టాం.  పలుమార్లు సమస్యను జిల్లా అధికారి దృష్టికి తీసుకెళ్లాం.    
 – ఎన్‌.గిరిజాదేవి, పాణ్యం బీసీ బాలుర హెచ్‌డబ్ల్యూఓ

Advertisement

తప్పక చదవండి

Advertisement