హైకోర్టుకు తొలి మహిళా రిజిస్ట్రార్‌ జనరల్‌

BS Bhanumathi Appointed As Registrar General To The High Court - Sakshi

బీఎస్‌ భానుమతి నియామకం

సాక్షి, అమరావతి: హైకోర్టు రిజిస్ట్రార్‌ జనరల్‌ (ఆర్‌జీ)గా బీఎస్‌ భానుమతి నియమితులయ్యారు. రిజిస్ట్రార్‌ జనరల్‌ పోస్టులో ఓ మహిళ నియమితులు కావడం ఇదే తొలిసారి. భానుమతి ప్రస్తుతం విశాఖపట్నం, ప్రిన్సిపల్‌ జిల్లా, సెషన్స్‌ జడ్జిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఈ నెల 30లోపు ఆమె కొత్త బాధ్యతలను స్వీకరించాల్సి ఉంటుంది. హైకోర్టు విభజన తరువాత చీకటి మానవేంద్రనాథ్‌ హైకోర్టు తొలి రిజిస్ట్రార్‌ జనరల్‌గా వ్యవహరించారు. ఆరు నెలల పాటు ఆర్‌జీగా ఉన్న ఆయన ఆ తరువాత హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. అప్పటి నుంచి ఆ పోస్టు ఖాళీగా ఉంది. రిజిస్ట్రార్‌ (ఐటీ కమ్‌ సెంట్రల్‌ ప్రాజెక్ట్‌ కో ఆర్డినేటర్‌) బి.రాజశేఖర్‌ రిజిస్ట్రార్‌ జనరల్‌ బాధ్యతలను నిర్వర్తిస్తూ వచ్చారు. తాజాగా బీఎస్‌ భానుమతిని హైకోర్టు రిజిస్ట్రార్‌ జనరల్‌గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. జిల్లా జడ్జీల కోటా నుంచి భానుమతి, హరిహరనాథ శర్మ తదితరుల పేర్లను హైకోర్టు న్యాయమూర్తి పదవికి 2018 సెప్టెంబర్‌లో ఉమ్మడి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సిఫారసు చేశారు. 2019 ఏప్రిల్‌ 15న ఈమె పేరును పరిగణనలోకి తీసుకున్న సుప్రీంకోర్టు కొలీజియం, పదోన్నతిని వాయిదా వేస్తున్నట్లు పేర్కొంది. అప్పటి నుంచి వీరి పేర్లు సుప్రీంకోర్టు కొలీజియం వద్దే పెండింగ్‌లో ఉన్నాయి.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top