breaking news
Registrar General of High Court
-
హైకోర్టుకు తొలి మహిళా రిజిస్ట్రార్ జనరల్
సాక్షి, అమరావతి: హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ (ఆర్జీ)గా బీఎస్ భానుమతి నియమితులయ్యారు. రిజిస్ట్రార్ జనరల్ పోస్టులో ఓ మహిళ నియమితులు కావడం ఇదే తొలిసారి. భానుమతి ప్రస్తుతం విశాఖపట్నం, ప్రిన్సిపల్ జిల్లా, సెషన్స్ జడ్జిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఈ నెల 30లోపు ఆమె కొత్త బాధ్యతలను స్వీకరించాల్సి ఉంటుంది. హైకోర్టు విభజన తరువాత చీకటి మానవేంద్రనాథ్ హైకోర్టు తొలి రిజిస్ట్రార్ జనరల్‌గా వ్యవహరించారు. ఆరు నెలల పాటు ఆర్జీగా ఉన్న ఆయన ఆ తరువాత హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. అప్పటి నుంచి ఆ పోస్టు ఖాళీగా ఉంది. రిజిస్ట్రార్ (ఐటీ కమ్ సెంట్రల్ ప్రాజెక్ట్ కో ఆర్డినేటర్) బి.రాజశేఖర్ రిజిస్ట్రార్ జనరల్ బాధ్యతలను నిర్వర్తిస్తూ వచ్చారు. తాజాగా బీఎస్ భానుమతిని హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్‌గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. జిల్లా జడ్జీల కోటా నుంచి భానుమతి, హరిహరనాథ శర్మ తదితరుల పేర్లను హైకోర్టు న్యాయమూర్తి పదవికి 2018 సెప్టెంబర్‌లో ఉమ్మడి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సిఫారసు చేశారు. 2019 ఏప్రిల్ 15న ఈమె పేరును పరిగణనలోకి తీసుకున్న సుప్రీంకోర్టు కొలీజియం, పదోన్నతిని వాయిదా వేస్తున్నట్లు పేర్కొంది. అప్పటి నుంచి వీరి పేర్లు సుప్రీంకోర్టు కొలీజియం వద్దే పెండింగ్‌లో ఉన్నాయి. -
హైకోర్టులో ‘బాంబు’
సాక్షి, చెన్నై: మద్రాసు హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ కార్యాలయానికి వచ్చిన ఓ ఫోన్ కాల్ పోలీసుల్ని పరుగులు తీయించింది. కాసేపట్లో హైకోర్టులో బాంబులు పేలనున్నాయన్న ఆ హెచ్చరికతో ఆ పరిసరాలను నిఘా వలయంలోకి తెచ్చారు. అణువణువు క్షుణ్ణంగా తనిఖీలు చేశారు. ఇటీవల ప్రభుత్వ కార్యాలయాలకు, వీఐపీల ఇళ్లకు, విమానాశ్రయాలకు బాంబు బూచీలు పెరిగాయి. ఇవి బూచీలుగా తేలుతున్నా, పోలీసులకు, బాంబ్, డాగ్ స్క్వాడ్లకు మాత్రం ముచ్చెమటలు పట్టిస్తున్నాయి. అయితే, ఈ బెదిరింపు కేసుల్లో అజ్ఞాత వ్యక్తుల్ని గుర్తించడం సైబర్ క్రైం పోలీసులకు సవాల్‌గా మారింది. ఈ పరిస్థితుల్లో మంగళవారం ఉదయం హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ కార్యాలయానికి వచ్చిన ఓ ఫోన్‌కాల్ అక్కడి సిబ్బందిని, పోలీసులను ఆందోళనకు గురిచేసింది. బూచీతో పరుగు: ఉదయం 10.15 గంటలకు ఆ కార్యాలయానికి వచ్చిన ఫోన్‌కాల్‌ను అక్కడి సిబ్బంది సురేంద్రన్ రిసీవ్ చేసుకున్నారు. హైకోర్టు పరిసరాల్లో బాంబులు అమర్చామని, మరి కాసేపట్లో అవి పేలబోతున్నాయంటూ అవత లి వ్యక్తి బెదిరించి లైన్ కట్ చేశాడు. ఈ సమాచారాన్ని రిజిస్ట్రార్ జనరల్ కళైయరసు దృష్టికి తీసుకెళ్లారు. వెను వెంటనే అక్కడి భద్రతా సిబ్బందిని అప్రమత్తం చేస్తూ, కంట్రోల్ రూంకు ఆయన సమాచారం అందించారు. ఆగమేఘాలపై పోలీసు బలగాలు, డాగ్, బాంబు స్క్వాడ్లు అక్కడికి చేరుకుని అణువణువు తనిఖీలు చేశాయి. హైకోర్టు ఆవరణలో ప్రధాన బెంచ్‌తో పాటుగా 36 కోర్టుల్లో విచారణ సాగుతున్న సమయంలో ఈ బెదిరింపు రావడంతో ఉద్రిక్తత నెలకొంది. సీఎం జయలలిత దాఖలు చేసిన పరువు నష్టం దావా కేసులతో పాటుగా మరికొన్ని కేసుల విచారణ వాడివేడిగా సాగుతున్న సమయంలో ఆయా కోర్టుల్లోకి పోలీసులు డాగ్, బాంబ్ స్క్వాడ్‌తో ప్రవేశించడంతో న్యాయమూర్తులు సైతం కంగారు పడ్డారు. వారి దృష్టికి అసలు విషయాన్ని తీసుకెళ్లినానంతరం, తనిఖీలకు న్యాయమూర్తులు అనుమతించారు. దీంతో ఆయా కోర్టుల గదుల్లో తనిఖీలు క్షుణ్ణంగా చేశారు. హైకోర్టు పరిసరాల్లోను, చాంబర్లలోను తనిఖీలు చేసినా ఎలాంటి పేలుడు పదార్థాలు లభించ లేదు. అయితే, ఈ బూచీ కారణంగా హైకోర్టు పరిసరాల్లో మధ్యాహ్నం వరకు తీవ్ర ఉత్కంఠ నెలకొంది. అయినా, పోలీసులు ఆ పరిసరాల్లో నిఘాను కట్టుదిట్టం చేసి అప్రమత్తంగా వ్యవహరించారు. అలాగే, ఈ బెదిరింపు కాల్ చేసిన వ్యక్తి కోసం అన్వేషణ ఆరంభమైంది. కోర్టు విధులకు ఆటంకం కలిగించే రీతిలో వ్యవహరించిన ఆ వ్యక్తిని త్వరితగతిన అరెస్టు చేయడానికి పరుగులు తీస్తున్నారు. లేని పక్షంలో ఎక్కడ కోర్టు ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుందోనన్న బెంగ పోలీసుల్లో నెలకొనటం గమనార్హం.