వార్డుబాయ్‌ పోస్టుకు రూ.2 లక్షలు

Bribery Demand For Wardboy Posts In Kurnool - Sakshi

వసూలు మొదలు పెట్టిన ప్రజాప్రతినిధి  

అనుచరుల ద్వారా పోస్టుల అమ్మకాలు 

నిరుద్యోగుల ఆశను ఆసరాగా చేసుకున్న ఓ ప్రజాప్రతినిధి చివరకు ఆసుపత్రిలో వార్డు బాయ్‌ పోస్టులను సైతం అమ్మకానికి పెట్టేశాడు. తనకు నమ్మకస్తులైన అనుచరుల ద్వారా వసూళ్ల కార్యక్రమానికి శ్రీకారం చుట్టాడు. ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్య పద్ధతిలో ఒప్పందం చేసుకున్న ఓ సంస్థ భర్తీ చేసే ఈ పోస్టులకు ఏకంగా రూ.2లక్షల నుంచి రూ.3లక్షల వరకు వసూలు చేస్తున్నారు.  

కర్నూలు(హాస్పిటల్‌): అన్ని బోధనాసుపత్రుల్లో ఫ్రంట్‌ డెస్క్‌ మేనేజర్లు, వార్డు బాయ్‌లు, ఎలక్ట్రియన్లు, లిఫ్ట్‌ ఆపరేటర్లను నియమించుకుని మూడేళ్ల పాటు సేవలందించాలని ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్య పద్ధతిలో రాష్ట్ర ప్రభుత్వం రెండు నెలల క్రితం ఓ ప్రైవేటు ఏజెన్సీతో ఒప్పందం చేసుకుంది. సాధారణంగా ప్రభుత్వ శాఖల్లో ఏ పోస్టులు భర్తీ చేయాలన్నా ముందుగా పత్రికా ప్రకటన ఇచ్చి, ఆ తర్వాత దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ పాటించి భర్తీ చేసేవారు. గతంలోనూ ఆసుపత్రుల్లో ఇదే విధంగా నియామకాలు జరిగాయి. ఇందుకు విరుద్ధంగా జరిగిన నియామకాలను అప్పటి జిల్లా ఉన్నతాధికారులు రద్దు చేశారు. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అన్ని బోధనాసుపత్రుల్లో సిబ్బందిని నియమించుకునే బాధ్యత ఓ ప్రైవేటు ఏజెన్సీకి అప్పగించింది. ఇందులో భాగంగా కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో ఆరుగురు ఫ్రంట్‌ డెస్క్‌ మేనేజర్లు, 42 మంది వార్డు బాయ్‌లు, 10 మంది ఎలక్ట్రీయన్లు, నలుగురు లిఫ్ట్‌ ఆపరేటర్లు కలిపి మొత్తం 62 పోస్టులున్నాయి.  

సబ్‌ లీజ్‌ పేరుతో మాయ.. 
ప్రభుత్వ ఆసుపత్రిలో నియమించుకునే పోస్టులను సదరు ప్రైవేటు ఏజెన్సీ నిర్వాహకులు తమకు సబ్‌లీజ్‌కు ఇచ్చారని, తామే పోస్టులను భర్తీ చేస్తామని ఓ ప్రజాప్రతినిధి అనుచరుడు నగరంలో హల్‌చల్‌ చేస్తున్నాడు. సదరు ప్రజాప్రతినిధి ఎవరికి చెబితే వారినే పోస్టుల్లో నియమిస్తారని ప్రచారం చేసుకుంటున్నాడు. ఇందులో భాగంగా వార్డుబాయ్‌ పోస్టుకు రూ.2లక్షలు, ఫ్రంట్‌ డెస్క్‌ మేనేజర్, ఎలక్ట్రిషియన్‌ పోస్టులకు రూ.3లక్షల దాకా వసూలు చేస్తున్నారు. ఆసుపత్రిలో అవుట్‌ సోర్సింగ్‌ పోస్టులకు ఇంత మొత్తమా అంటూ పలువురు అభ్యర్థులు బహిరంగంగానే తిట్టిపోస్తున్నారు. నిరుద్యోగ సమస్య కారణంగా పలువురు అభ్యర్థులు అడిగిన మొత్తాన్ని కూడా ఇచ్చేందుకు ముందుకు వస్తుండటంతో ప్రజాప్రతినిధి అనుచరులకు అడ్డులేకుండా పోతోంది. ఇప్పటికే పలువురు అభ్యర్థులు కొంత మొత్తాన్ని వారికి ముట్టచెప్పారని, మిగిలిన మొత్తాన్ని నియామకాలు జరిగాక ఇచ్చేలా ఒప్పందం చేసుకున్నట్లు సమాచారం. సదరు ప్రజాప్రతినిధికి తెలిసే పోస్టుల అమ్మకాలు జరుగుతున్నట్లు ప్రచారం సాగుతోంది. కాగా ఈ పోస్టుల నియామకాలకు సంబంధించి నిబంధనలు తమకు ఇప్పటివరకు ఎలాంటి ఆదేశాలు రాలేదని ఆసుపత్రి అధికారులు చెబుతున్నాయి. ప్రైవేట్‌ ఏజెన్సీతో ఎంత మేరకు ఒప్పందం చేసుకున్నారు, ఉద్యోగుల జీతం ఎంత? అనే విషయాలు కూడా తమకు తెలియవని వారు పేర్కొంటున్నారు. ఆసుపత్రి నుంచి వెళ్లే ఎన్టీఆర్‌ వైద్యసేవ రివాల్వింగ్‌ ఫండ్‌ నుంచి ఉద్యోగులకు జీతాలు ఇచ్చే విధంగా ఒప్పందం చేసుకున్నట్లు సమాచారం.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top