మీరు పది వేలు కట్టండి... నాలుగున్నర సంవత్సరాల తరువాత వంద గజాల స్ధలాన్ని ఉచితంగా ఇస్తాం!, మీ దగ్గరున్న సొమ్ములను
నిలువునా ముంచేశారు
Jan 20 2014 3:39 AM | Updated on Sep 2 2018 4:46 PM
శ్రీకాకుళం క్రైం, న్యూస్‌లైన్: మీరు పది వేలు కట్టండి... నాలుగున్నర సంవత్సరాల తరువాత వంద గజాల స్ధలాన్ని ఉచితంగా ఇస్తాం!, మీ దగ్గరున్న సొమ్ములను మా దగ్గర డిపాజిట్ చేయండి.. అధిక మొత్తంలో వడ్డీ చెల్లిస్తామంటూ కల్లబొల్లి కబుర్లతో ప్రజలను నమ్మించిన బొమ్మరిల్లు కంపెనీ చివరకు బోర్డు తిరగేసింది. ఖాతాదారులను నిలువునా ముంచేయడంతో ఆందోళన చెం దుతున్నారు. న్యాయం చేయాలంటూ పోలీసు స్టేషన్ల చుట్టూ తిరుగుతున్నారు. వివరాల్లోకి వేళ్తే.. శ్రీకాకుళం పట్టణంలోని డే అండ్ నైట్ సమీపంలో కొత్త వంతెన వద్ద బొమ్మరిల్లు కంపెనీని కొన్నెళ్ల కిందట అట్టహాసంగా ప్రారంభించారు. కమిషన్ ఆశచూపి జిల్లా మొత్తం మీద ఏజెంట్లను ఏర్పాటు చేసుకున్నారు.
ఈ ఏజెంట్లు పలు ప్రాంతాల్లో వేలాది మంది ప్రజలను బొమ్మరిల్లు డిపాజిట్‌దారులుగా చేర్పించారు. రూ. కోట్లలో వసూలు చేసిన సొమ్ములను కంపెనీ తన ఖాతాలో జమచేసుకుంది. పదివేల రూపాయలు జమ చేసి నాలుగున్నర సంవత్సరాలు ఫిక్స్‌డ్ డిపాజిట్‌గా ఉంచేస్తే వంద గజాల స్థలం ఇస్తామని చెప్పారు. సీతంపేట మండలం పులిట్టి గ్రామంలో సర్వే నంబర్ 49/10లో స్థలాన్ని ముందుగానే పది రూపాయల స్టాంపుపేపరుపై రాసి ఇచ్చేశారు కూడా. ఈ మోసాన్ని గుర్తించలేని వారు అధిక మంది డబ్బులు చెల్లించారు. అయితే, గత కొద్ది నెలల కిందట ఖాతాదారులు తమ డిపాజిట్‌లు మెచ్యూరిటీ కావడంతో సొమ్ము చెల్లించాలని, లేకుంటే స్థలాన్ని రిజిస్ట్రేషన్ చేయాలని నిలదీశారు. ఇదిగోఅదిగో అంటూ సంస్థ నిర్వాహకులు తప్పించుకుంటూ వచ్చారు. చివరకు గత నెలలో పూర్తిగా బోర్డు తిరగేసి సిబ్బంది మాయమైనట్టు తెలియడంతో లబోదిబోమంటున్నారు. వేల సంఖ్యలో సంస్థ ఖాతాదారులు ఉన్నట్టు తెలుస్తోంది.
సిరిపురంలోనే 67 మంది డిపాజిట్ దారులు
సంతకవిటి మండలం సిరిపురం గ్రామానికి చెందిన వారే 67 మంది డిపాజిట్ దారులు ఉన్నారంటే ఇక జిల్లా మొత్తం వీరి సంఖ్య ఏ స్థాయిలో ఉంటుందో అర్ధం చేసుకోవచ్చు. ఈ 67 మంది నుంచి సుమారు 30 లక్షల వరకు వసూలు చేసిన బొమ్మరిల్లు కంపెనీ జిల్లా మొత్తం మీద కోట్ల రూపాయలను వసూలు చేసి ఉంటుందని అంచనా. సిరిపురం గ్రామానికి చెందిన 67 మంది బాధితులు మూకమ్మడిగా ఆదివారం వచ్చి శ్రీకాకుళం రెండో పట్టణ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. తమను ఏ విధంగా మోసం చేశారు, ఎటువంటి బాండ్లు ఇచ్చారు తదితర వివరాలను ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు బొమ్మరిళ్లు డెరైక్టర్లు వానపల్లి వెంకటరావు, కాపు శ్రీనివాసరావు, కమ్మెల బాపూజీ, జి.ఎర్రయ్యలతో పాటు శ్రీకాకుళం బ్రాంచ్ మేనేజర్ ఎన్డీవీ.గిరిలపై సీఐ రాధకృష్ణ కేసు నమోదు చేశారు.
పలాసలో కూడా...
పలాస రూరల్: అధిక వడ్డీ పేరుతో భారీగా డిపాజిల్లు సేకరించిన బొమ్మరిల్లు ఫైనాన్స్ సంస్థ ఏజెంట్లపై కాశీబుగ్గ పోలీసులు కేసు నమోదు చేశారు. సోంపేటకు చెందిన పొందూరు కూర్మారావు, ఈశ్వరరావులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కాశీబుగ్గ సాయికాలనీకు చెందిన ఏజెంట్ కణితి కృష్ణారావు, బొమ్మరిల్లు యాజ మాన్యంపై కేసు నమోదు చేశామని కాశీబుగ్గ ఎస్సై ఆర్.వేణుగోపాల్ తెలిపారు.
నమ్మించి తప్పించారు
నేను 34 వేల రూపాయలను డిపాజిట్ చేశాను. గత ఏడాది నవంబర్ 2వ తేదీకి మెచ్యూరిటీ అయ్యింది. డబ్బులు చెల్లించాలని కోరితే 15 రోజుల్లో ఇచ్చేస్తామని నిర్వాహకులు తెలిపారు. చివరకు డిసెంబర్ ఒకటో తేదీన వెళ్లి చూసే సరికి ఎవ్వరూ లేకుండా పోయారు.
-కె.అప్పన్న, బాధితుడు
కమీషన్‌కే పనిచేశా
శ్రీకాకుళం పట్టణంలోని బ్రాంచ్ మేనేజరు ఎన్డీవీ గిరి ద్వారానే ఏజెంట్ కింద చేరాను. కేవలం కమీషన్ కోసమే కంపెనీలో పనిచేశాను. లక్ష రూపాయలు కట్టిస్తే నాలుగు వేల రూపాయలు కమీషన్ ఇచ్చేవారు. ఇలా మోసం చేసి కంపెనీ బోర్డు తిరగేసేస్తుందని అనుకోలేదు. కంపెనీ నిర్వాహకులను పట్టుకుని ఎలాగైనా డబ్బులు వచ్చేలా పోలీసులే చర్యలు తీసుకోవాలి. తమ తప్పేమీ లేదు. పోలీసులకు అవసరమైన సహకారం అందిస్తాం.
-గంథం గోవింద్, బొమ్మరిల్లు ఏజెంట్
Advertisement
Advertisement