రాజకీయ దురుద్దేశంతోనే టీటీడీపై దుష్ప్రచారం | Bjp MP Subramanya Swamy Slams TDP Leaders | Sakshi
Sakshi News home page

రాజకీయ దురుద్దేశంతోనే టీటీడీపై దుష్ప్రచారం

Dec 30 2019 2:44 AM | Updated on Dec 30 2019 4:58 AM

Bjp MP Subramanya Swamy Slams TDP Leaders - Sakshi

సాక్షి, అమరావతి: రాజకీయ దురుద్దేశంతోనే తిరుమల వ్యవహారాలపై కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని బీజేపీ సీనియర్‌ నేత, ఎంపీ సుబ్రమణ్య స్వామి మండిపడ్డారు. గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో టీటీడీలో యథేచ్ఛగా అవినీతి చోటుచేసుకుందని, ఆ ఐదేళ్లలో టీటీడీ నుంచి ప్రభుత్వం ఖర్చు చేసిన నిధులపై ఆడిటింగ్‌ జరపాలని, సిట్‌ వేయాలని డిమాండ్‌ చేశారు. తిరుమలలో సుబ్రమణ్యస్వామి ఆదివారం విలేకరులతో మాట్లాడుతూ.. టీటీడీలో సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సక్రమంగా అమలు చేస్తున్నారని అభినందించారు. ప్రస్తుతం బలమైన హిందూ అనుకూల పాలకమండలి ఆధ్వర్యంలో టీటీడీ వ్యవహారాలన్నీ సక్రమంగా జరుగుతున్నాయని ఆయన ప్రశంసించారు.

వైవీ సుబ్బారెడ్డిపై అవాస్తవాలు ప్రచారం చేశారు
‘టీటీడీ చైర్మన్‌గా వైవీ సుబ్బారెడ్డిని నియమించినప్పుడు ఆయన క్రిస్టియన్‌ అని అసత్య కథనాలను విపరీతంగా ప్రచారంలోకి తెచ్చారు. వాటిపై విచారించి వాస్తవాలు తెలుసుకున్నాను. వైవీ సుబ్బారెడ్డి పక్కా హిందువని తెలిసింది. వెంటనే నేను అదే విషయాన్ని ట్వీట్‌ చేశాను. తిరుమలలో ఓ కొండపై చర్చి కడుతున్నారంటూ కొందరు దుష్ప్రచారం చేశారు. ఫొటోషాప్‌ చేసిన ఫొటోను చూపిస్తూ అదే చర్చని సోషల్‌ మీడియాలో వైరల్‌ చేశారు. అదీ పూర్తిగా అవాస్తవమని నిర్ధారణైంది’ అని సుబ్రహ్మణ్యస్వామి పేర్కొన్నారు. అవాస్తవాలతో ప్రజల్ని తప్పుదోవ పట్టించేందుకే కొందరు కుయుక్తులు పన్నుతున్నారని ఆయన విమర్శించారు.  గత ఎన్నికల్లో ఏపీలో ఓడిపోయిన పార్టీనే ఈ కుట్రలు చేస్తోందని సుబ్రహ్మణ్య స్వామి తప్పుపట్టారు.

మత కలహాలు సృష్టించడానికే ఇలాంటి అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఆయన విరుచుకుపడ్డారు. ఇలా దుష్ప్రచారం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. వారిపై పరువు నష్టం దావా వేసి, క్రిమినల్‌ కేసులు నమోదు చేయాలని ఆయన సూచించారు. టీటీడీ ఉద్యోగుల్లో క్రిస్టియన్లు ఎక్కువ మంది ఉన్నారన్న ఆరోపణలు వాస్తవం కాదని, ఈ విషయంపై అన్ని వివరాలు తెలుసుకున్నానని స్వామి చెప్పారు. ‘15 వేల మంది టీటీడీ ఉద్యోగుల్లో కేవలం 44 మంది క్రిస్టియన్లు.. అది కూడా రవాణా విభాగంలో పనిచేస్తున్నారు. వారు ప్రభుత్వ ఇతర శాఖల నుంచి కారుణ్య నియమాకాల కింద నియమితులయ్యారు. వారిని వేరే శాఖలకు బదిలీ చేసే అంశాన్ని పరిశీలిస్తామని ఈఓ చెప్పారు’ అని స్వామి అన్నారు.

బాబు హయాంలో టీటీడీ నిధుల దుర్వినియోగం
తెలుగుదేశం హయంలో తిరుమల ఆలయ వ్యవహారాల్లో యథేచ్చగా అవినీతికి పాల్పడ్డారని సుబ్రహ్మణ్య స్వామి దుయ్యబట్టారు. గత ఐదేళ్లలో టీటీడీ నిధుల వ్యయంపై స్వతంత్ర ఆడిటర్‌తో ఆడిటింగ్‌ చేయించలేదని ఆయన విమర్శించారు. ‘తిరుమల ఆలయ నిధులను భారీగా దుర్వినియోగం చేశారు. ప్రస్తుతం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తీసుకుంటున్న నిర్ణయాలు ఆశాజనకంగా ఉన్నాయి. గతంలో జరిగిన తప్పులను సరి చేస్తున్నారు. టీడీపీ ప్రభుత్వంలో టీటీడీ వ్యవహారాల్లో అవినీతిపై విచారణకు ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్‌)ను నియమించాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని కోరుతున్నాను’ అని స్వామి పేర్కొన్నారు.

రమణ దీక్షితుల నియమాకం మంచి పరిణామం
తిరుమల ఆలయ పూర్వ ప్రధాన అర్చకుడు రమణ దీక్షితులను శ్రీవారి ఆలయంలో పునర్నియమించడం పట్ల సుబ్రహ్మణ్య స్వామి సంతోషం వ్యక్తం చేశారు. టీటీడీలో ఈవో అనిల్‌ కుమార్‌ సింఘాల్, అదనపు ఈవో ధర్మారెడ్డి పనితీరు బాగుందని కితాబునిచ్చారు. తిరుమల ఆలయాన్ని ప్రభుత్వ నియంత్రణ నుంచి తప్పించాలన్న వాదనను ఆయన పునరుద్ఘాటించారు. దేశంలోని మదర్సాలు, వక్ఫ్‌ బోర్డులు, చర్చిలపై ప్రభుత్వ నియంత్రణ లేనప్పుడు హిందూ ఆలయాలపై మాత్రం ఎందుకుండాలని ప్రశ్నించారు.

దేవాలయాల పరిరక్షణపై సదస్సు
యూనివర్సిటీక్యాంపస్‌(చిత్తూరు జిల్లా): ఆదివారం సాయంత్రం తిరుపతి శ్రీపద్మావతి మహిళ విశ్వవిద్యాలయంలోని ఇందిరాప్రియదర్శిని ఆడిటోరియంలో హిందూ దేవాలయాల పరిరక్షణ అంశంపై నిర్వహించిన కార్యక్రమంలో సుబ్రహ్మణ్య స్వామి పాల్గొని ప్రసంగించారు. గ్లోబల్‌ హిందూ హెరిటేజ్‌ ఫౌండేషన్, సేవ్‌ టెంపుల్స్‌ తిరుపతి సంయుక్తంగా ఈ కార్యక్రమం నిర్వహించాయి. శ్రీపీఠం పీఠాధిపతి పరిపూర్ణానంద సరస్వతి స్వామీజీ మాట్లాడుతూ.. దేశమంతా భారతీయ తత్వాన్ని విస్తరింపజేయాలని కోరారు. గ్లోబల్‌ హిందు హెరిటేజ్‌ ఫౌండేషన్‌కు చెందిన వెలగపూడి ప్రకాష్‌రావు మాట్లాడుతూ.. హిందూ ఆలయాలను కాపాడాలని కోరారు.

►తిరుమలలో ఓ కొండపై చర్చి కడుతున్నారంటూ కొందరు దుష్ప్రచారం చేశారు. మార్ఫింగ్‌ చేసిన ఫొటోను సోషల్‌ మీడియాలో వైరల్‌ చేశారు. అది పూర్తిగా అవాస్తవమని నిర్ధారణైంది. మతకలహాలు సృష్టించేందుకు గత ఎన్నికల్లో ఓడిపోయిన పార్టీనే ఈ విధంగా కుట్రలు పన్నుతోంది.
– బీజేపీ ఎంపీ సుబ్రమణ్య స్వామి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement