చక్కెరలో చేదు గుళికలు

చక్కెరలో చేదు గుళికలు


విశాఖ రూరల్ : చక్కెర కర్మాగారాల లాభాలకు అధికారులే గండికొడుతున్నారు. ఆదాయమార్గాలను అన్వేషించాల్సిన వారు పరిశ్రమలు నిర్వీర్యమయ్యే నిర్ణయాలు చేస్తున్నారు. ఫ్యాక్టరీల భవిష్యత్తును ప్రశ్నార్థకంగా మారుస్తున్నారు. మొలాసిస్ అమ్మకాలే ఇందుకు నిదర్శనం. జిల్లాలో నాలుగు చక్కెర కర్మాగారాలు ఉన్నాయి. తాండవ, అనకాపల్లి, ఏటికొప్పాక, చోడవరం సహకార చక్కెర కర్మాగారాల్లో మొలాసిస్ అమ్మకాలపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. బహిరంగ మార్కెట్‌లో అత్యధిక ధర ఉన్నప్పటికీ 50 శాతం కంటే తక్కువకు విక్రయిస్తుండడం అనుమానాలకు తావిస్తోంది. ఈ విషయంపై కలెక్టర్ డాక్టర్ ఎన్.యువరాజ్‌కు ఫిర్యాదు అందింది.

 

50 శాతం తక్కువకు మొలాసిస్అధికారుల విచక్షణాధికారాలతో తక్కువ ధరకే వేల మెట్రిక్ టన్నుల మొలాసిస్‌ను రాష్ట్ర సగటు ధర కంటే 50 శాతం తక్కువకు విక్రయిన్నారు. అసలే అంతంత మాత్రం ఆదాయాలతో నెట్టుకొస్తున్న కర్మాగారాల ఆర్థిక పరిపుష్టికి చర్యలు తీసుకోవాల్సింది పోయి వచ్చే ఆదాయాన్ని కూడా తగ్గించడం పట్ల సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది. అందుకు 2012-13లో ఈ పరిశ్రమల్లో మొలాసిస్ అమ్మకాలే నిదర్శనం. మద్యం అమ్మకాల్లో వినియోగించే మొలాసిస్‌కు ప్రస్తుతం విపరీతమైన డిమాండ్ ఉంది. దీన్ని ఒడిశా, ఇతర పక్క రాష్ట్రాల వారికే విక్రయిస్తున్నారు. అదే ఇతర జిల్లాల్లో ఉన్న కర్మాగారాలు మొలాసిస్‌కు ఇంతకు రెట్టింపు ధరను నిర్ణయిస్తున్నారు.

 

తాండవలో..

 

తాండవ కో-ఆపరేటివ్ షుగర్స్ లిమిటెడ్‌లో గత ఏడాది మూడు దశల్లో మొలాసిస్ అమ్మకాలు చేపట్టారు. మూడుసార్లు మూడు ధరల్లో అమ్మకాలు చేపట్టారు. 8,500 మెట్రిక్ టన్నులను ఒక్కో ఎం.టి. రూ.2,103 కింద విక్రయించారు. అలాగే ఎం.టి. రూ.3,055 చొప్పున 1500 మెట్రిక్ టన్నులు, రూ.6 వేలు చొప్పున రూ.992 మెట్రిక్ టన్నులు అమ్మారు. దీని ప్రకారం సగటు మెట్రిక్ టన్ను ధర రూ.2,584గా మాత్రమే ఉంది. అదే రాష్ట్ర సగటు ధర రూ.5 వేలు నుంచి రూ.5,500 వరకు ఉంది. దీని ప్రకారం పరిశ్రమకు రూ.2.84 కోట్లు నష్టం వాటిల్లునట్టు తెలుస్తోంది.

 

అనకాపల్లిలో..

 

అనకాపల్లి కో-ఆపరేటివ్ షుగర్స్ లిమిటెడ్‌లో గత ఏడాది 1,816 మెట్రిక్ టన్నుల మోలాసిస్ అమ్మకాలు జరిపారు. రాష్ట్ర సగటు ధర రూ.5 వేలు నుంచి రూ.5,500 ఉంటే ఇక్కడ కేవలం రూ.3,055కు మాత్రమే విక్రయించారు. ఫలితంగా రూ.55.47 లక్షలు ఆదాయం కోల్పోయినట్లు తెలుస్తోంది.

 

ఏటికొప్పాకలో..ఏటికొప్పాక కో-ఆపరేటివ్ షుగర్స్ లిమిటెడ్‌లో 1920 మెట్రిక్ టన్నుల మొలాసిస్‌ను ఎం.టి. రూ.2,075 చొప్పున కట్టబెట్టారు. అలాగే ఎం.టి.రూ.3,055 చొప్పున 6200 మెట్రిక్ టన్నులు, రూ.6100 చొప్పున 350 మెట్రిన్ టన్నులు విక్రయించారు. దీంతో రూ.2 కోట్లు మేర ఆదాయం కోల్పోవాల్సి వచ్చింది.

 

చోడవరంలో..

 

చోడవరం కో-ఆపరేటివ్ షుగర్స్ లిమిటెడ్‌లో ఎం.టి. రూ.2100 చొప్పున 10,700 మెట్రిక్ టన్నులు, ఎం.టి.రూ.3,055 చొప్పున 10 వేలు మెట్రిక్ టన్నులు, ఎం.టి. రూ.6100 చొప్పున 600 మెట్రిక్ టన్నులు విక్రయించారు. ఫలితంగా రూ.6.45 కోట్లు ఆదాయం రాకుండా పోయింది.

 

విజిలెన్స్ విచారణ

 

ఈ అమ్మకాల తీరుపై వెంటనే విచారణ జరిపించాలని కోరుతూ చెరకు అభివృద్ధి మండలి అధ్యక్షుడు డి.రాంబాబు కలెక్టర్ యువరాజ్‌కు వినతిపత్రం అందజేశారు. విజిలెన్స్ విచారణ కూడా నిర్వహించాలని కోరారు. దీనిపై కలెక్టర్ స్పందిస్తూ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లి చర్యలు తీసుకుంటామని చెప్పారు.

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top