‘బాబు పాలనలో భగవంతుని పట్ల తీరని అపచారం’

Bhumana Karunakar Reddy slams Chandrababu Naidu - Sakshi

తిరుపతి: టీటీడీ దేవస్థానంలో నగలు మాయమవుతున్నాయని అనేక ఫిర్యాదులు వచ్చినా ఏపీ సర్కారు విచారణ జరిపించకపోవడంపై వైఎస్సార్‌సీపీ సీనియర్‌ నేత భూమన కరుణాకర్‌ రెడ్డి మండిపడ్డారు. తిరుపతిలోని గోవిందరాజు స్వామి ఆలయంలో ఉత్సవమూర్తులకు అలంకరించే మూడు బంగారు కిరీటాలు మాయం కావడం సంస్కృతి, సాంప్రదాయాలకు తీవ్ర విఘాతం కలగడమేనన్నారు. గతంలో విజయవాడ కనకదుర్గమ్మ కిరీటాన్ని కూడా మాయం చేశారని ఈ సందర్భంగా భూమన పేర్కొన్నారు. ఆదివారం ప్రెస్‌కాన్పరెన్స్‌లో భూమన మాట్లాడుతూ.. చంద్రబాబు నాయుడు హయాంలో ఆలయాల ప్రతిష్ట దిగజారుతుందని విమర్శించారు.

‘చంద్రబాబు పాలనలో భగవంతుని పట్ల తీరని అపచారం జరుగుతోంది. భక్తులు సమర్పించిన నగలన‍్నీ ఎత్తుకెళ్లారని ప్రధాన అర్చకుడే ఆరోపణలు చేశారు. పింక్‌ డైమండ్‌ను చోరీ చేశారని.. ఇతర దేశాల్లో విక్రయించారని ఆరోపణలు వచ్చాయి.  ఇక్కడ ఆరోపణలు చేసిన వారిపై చర్యలు తీసుకున్నారే కానీ న్యాయ విచారణకు ఎందుకు ఆదేశించలేదు. చంద్రబాబుపై ఆరోపణలు చేస్తే వారిని సంఘ ద్రోహులుగా చిత్రీకరించారు. విజయవాడ పరిసరాల్లోనే దేవాలయాలు నేలమట్టం అయ్యాయి. చంద్రబాబు హయాంలో 40 దేవాలయాలు నేలమట్టం చేశారు. కాళహస్తి ఆలయం, బెజవాడ దుర్గమ్మ ఆలయాల్లో క్షుద్ర పూజలు జరుగుతున్నా చర్యలు ఎందుకు లేవు. అమరావతిలోని అమరేశ్వర ఆలయ భూములను తన తాబేదార్లకు తక్కువ ధరకే చంద్రబాబు కట్టబెట్టారు. చంద్రబాబు తీరు ఇలానే ఉంటే హైందవ ధర్మాన్ని ఎవరు రక్షిస్తారు. తిరుపతిలో గోవిందరాజు స్వామి ఆలయంలో దోపిడీ జరిగింది. అంటే ఎంత దోపిడీ వ్యవస్థ నడుస్తుందో అర్థం చేసుకోవాలి’ అని భూమన ఘాటుగా ప్రశ్నించారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top