వికేంద్రీకరణ వికసిస్తేనే అభివృద్ధి ఫలాలు

Benefits of development only with Decentralization - Sakshi

ప్రజలకు గులాబీలు పంపిణీ చేసి మూడు రాజధానుల ఆవశ్యకతను చాటిన విద్యార్థులు

కొనసాగిన రిలే దీక్షలు

మూడు రాజధానులనే విత్తనాలు నాటితే పాలన వికేంద్రీకరణ మొక్కలు పుష్పించి అన్ని ప్రాంతాలకు అభివృద్ధి ఫలాలను అందిస్తాయని చెబుతూ.. గులాబీ పువ్వులను ప్రజలకు అందజేశారు. మూడు రాజధానుల వల్ల కలిగే ప్రయోజనాలను వివరిస్తూ విద్యార్థులు, యువత ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా శుక్రవారం పుష్పాల పంపిణీ కార్యక్రమాలు జరిగాయి. మరోవైపు వికేంద్రీకరణకు మద్దతుగా వివిధ వర్గాల ప్రజలు చేపట్టిన రిలే నిరాహార దీక్షలు కొనసాగాయి.    
– సాక్షి నెట్‌వర్క్‌

ప్రచార రథం ప్రారంభం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో అభివృద్ధిని పరుగులు పెట్టించటానికి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తీసుకున్న మూడు రాజధానులు, అభివృద్ధి వికేంద్రీకరణ నిర్ణయాలపై రాష్ట్రమంతటా చర్చ నడుస్తోందని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు (ప్రజా వ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ఆంధ్రప్రదేశ్‌ గవర్నమెంట్‌ సెకండ్‌ రిప్రజెంటేటివ్‌ ఆఫ్‌ నార్త్‌ అమెరికా (ఏపీ జీఎస్‌ఆర్‌ఎన్‌ఏ) ఆధ్వర్యంలో ‘వికేంద్రీకరణ జరగాలి.. రాష్ట్రమంతటా అభివృద్ధి జరగాలి’ అనే నినాదంతో ప్రచార కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.

ఇందుకు సంబంధించిన ప్రచార రథాన్ని రామకృష్ణారెడ్డి గుంటూరు జిల్లా తాడేపల్లిలో శుక్రవారం జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మూడు, నాలుగేళ్లలో దశాబ్దపు అభివృద్ధిని చూపాలనే లక్ష్యంతో తీసుకున్న ఈ నిర్ణయాలను ప్రజలంతా నిండు మనసుతో స్వాగతిస్తున్నారన్నారు. ప్రభుత్వ నిర్ణయాన్ని కొన్ని శక్తులు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నాయని ధ్వజమెత్తారు. రూ.లక్షల కోట్ల అప్పులతో ఆర్థికంగా కుంగిన రాష్ట్రాన్ని మరింత కుంగదీసేందుకు టీడీపీ ప్రయత్నిస్తోందన్నారు. 

ఈ నేపథ్యంలో ఎన్‌ఆర్‌ఐ విభాగం, యువకులు, ఉత్సాహవంతులు ప్రజలను చైతన్యవంతుల్ని చేసేందుకు ముందుకు కదలటం సంతోషదాయకమన్నారు. నార్త్‌ అమెరికాలో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రత్యేక ప్రతినిధి పండుకాయల రత్నాకర్‌ మాట్లాడుతూ.. 13 జిల్లాలను సమానంగా అభివృద్ధి  చేయాలనే తలంపుతో సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తీసుకున్న మూడు రాజధానులు, అభివృద్ధి వికేంద్రీకరణ నిర్ణయాలకు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రవాసాంధ్రులు సంపూర్ణ మద్దతు తెలుపుతున్నారన్నారు. కార్యక్రమంలో ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ చైర్మన్‌ చల్లా మధు, మాజీ ఎమ్మెల్యే కుంభా రవిబాబు పాల్గొన్నారు.

వికేంద్రీకరణ నిర్ణయానికి మద్దతుగా గుంటూరులో విద్యార్థులు గులాబీ పువ్వులు పంపిణీ చేశారు. మూడు రాజధానుల వల్ల కలిగే ప్రయోజనాలను వివరిస్తూ ప్రచురించిన కరపత్రాలను కూడా అందజేశారు. నరసరావుపేట మార్కెట్‌ సెంటర్‌లో మూడు రాజధానులకు మద్దతుగా సంతకాల సేకరణ జరిపారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే డాక్టర్‌ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి హాజరై సంఘీభావం తెలిపారు. విశాఖపట్నంలో పలుచోట్ల విద్యార్థులు గులాబీ పువ్వులు, కరపత్రాలు పంపిణీ చేశారు. మద్దిలపాలెం, అక్కయ్యపాలెం, ఆనందపురం, తగరపువలస, అచ్యుతాపురం మండలం మల్లవరంలో ఈ కార్యక్రమాలు జరిగాయి. చోడవరం, రావికమతం మండలం  కొత్తకోటలో వంటావార్పు నిర్వహించగా.. ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ హాజరై సంఘీభావం తెలిపారు. విజయనగరంలో చేపట్టిన రిలే దీక్షలు 11వ రోజుకు చేరాయి.

యువజన, విద్యార్థి విభాగాల ఆధ్వర్యంలో వాహన చోదకులు, పాదచారులకు గులాబీ పువ్వులు, అవగాహన పత్రాలను పంపిణీ చేశారు. జిల్లాలోని నెల్లిమర్ల, సాలూరు, గజపతినగరం, పార్వతీపురంలో ర్యాలీలు, మానవహారాలు నిర్వహించి ప్రజలకు గులాబీలు పంచిపెట్టారు. ఎమ్మెల్యేలు పి.రాజన్నదొర, బొత్స అప్పలనర్సయ్య, అలజంగి జోగారావు హాజరై సంఘీభావం ప్రకటించారు. కృష్ణా జిల్లా పెనుగంచిప్రోలులో గులాబీ పూలు, కరపత్రాలు పంపిణీ చేసి వికేంద్రీకరణ వల్ల కలిగే ప్రయోజనాలను వివరించారు. కార్యక్రమానికి ప్రభుత్వ విప్‌ సామినేని ఉదయభాను హాజరై మద్దతు తెలిపారు. మూడు రాజధానులకు మద్దతుగా శ్రీకాకుళం జిల్లా భామిని, రాజాంలో శుక్రవారం ర్యాలీ నిర్వహించారు. ఎమ్మెల్యేలు విశ్వాసరాయి కళావతి, కంబాల జోగులు పాల్గొని సంఘీభావం ప్రకటించారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top