ముంగిటకే పెన్షన్లు, రేషన్‌- మంత్రి అనిల్‌కుమార్‌

Beneficiaries Of Pensions And Rations Are Brought To The Home By Volunteers - Sakshi

గంటల తరబడి క్యూల్లో నిలబడాల్సిన అవసరం లేదు

50ఇళ్లకు ఒక వలంటీర్‌ను నియమిస్తున్నాం

వలంటీర్లు వచ్చి పథకాలను అందజేస్తారు

వైఎస్సార్‌ పెన్షన్‌ కానుక కార్యక్రమంలో మంత్రి అనిల్‌

సాక్షి, నెల్లూరు సిటీ: పెన్షన్ల కోసం అవ్వా, తాతలు, రేషన్‌ కోసం లబ్ధిదారులు గంటల తరబడి  క్యూల్లో నిలబడాల్సిన అసవరం లేకుండా మీఇంటి ముంగిటకే వచ్చి అందజేసేలా వలంటీర్లను నియమిస్తున్నామని రాష్ట్ర ఇరిగేషన్‌ శాఖ మంత్రి పోలుబోయిన అనిల్‌కుమార్‌యాదవ్‌ తెలిపారు. కిసాన్‌నగర్‌ సింహపురి మున్సిపల్‌ పాఠశాల ఆవరణలో సోమవారం నిర్వహించిన వైఎస్సార్‌ పెన్షన్‌ కానుక పంపిణీ కార్యక్రమంలో మంత్రి అనిల్‌కుమార్‌ పాల్గొని మాట్లాడారు.  వైఎస్సార్‌ జయంతిని పురస్కరించుకుని ఆయన బిడ్డ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు పెన్షన్లు పెంచారన్నారు.

పెన్షన్లు, రేషన్‌ కోసం లబ్ధిదారులు పడిగాపులు పడకుండా వలంటీర్లు ఇళ్ల ముంగిటకే తెచ్చి ఇస్తారని తెలిపారు. అమ్మఒడి పథకం కింద ఏటా జనవరి 26న పిల్లలను పాఠశాలల్లో చదివించే తల్లుల ఖాతాల్లో రూ.15వేలు నగదు అందజేస్తారన్నారు. ఆరోగ్య ఖర్చులు రూ.1000 దాటితే ఆరోగ్యశ్రీ కింద ప్రభుత్వమే భరిస్తుందన్నారు. ఇతర రాష్ట్రాల్లో వైద్యం చేయించుకున్న వైద్య ఖర్చులను ప్రభుత్వమే చెల్లించేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. 

72గంటల్లో  ప్రభుత్వ పథకాలు మంజూరు 
ప్రభుత్వ పథకాల కోసం కార్యాలయాల చుట్టూ నెలలు తరబడి తిరగాల్సిన అవసరం లేదని మంత్రి అనిల్‌కుమార్‌ అన్నారు. దరఖాస్తు చేసుకున్న 72 గంటల్లో ప్రభుత్వ పథకాలను మంజూరు చేసేలా చర్యలు తీసుకుంటామన్నారు.తెలిపారు. వచ్చే ఏడాది నుంచి 45 ఏళ్లు దాటిన బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ మహిళలకు ఏటా రూ.17,500 నగదు అందజేస్తామన్నారు. నాలుగేళ్లలో మద్యపాన నిషేధాన్ని పూర్తిస్థాయిలో అమలు చేయనున్నట్లు తెలిపారు. ఇప్పటికే బెల్టు దుకాణాలు లేకుండా చేశామన్నారు.

హౌస్‌ఫర్‌ ఆల్‌ క్రింద 300 చదరపు అడుగులు ఇళ్లకు రూ.3లక్షల రుణాన్ని పూర్తిగా ప్రభుత్వమే చెల్లిస్తుందన్నారు. 365,430 చదరపు అడుగుల ఇళ్లకు కొంతమొత్తాన్ని ప్రభుత్వమే చెల్లిస్తుందని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ డిప్యూటీ మేయర్‌ ముక్కాల ద్వారకానాథ్, వైఎస్సార్‌సీపీ యువజన విభాగం అధ్యక్షుడు పోలుబోయిన రూప్‌కుమార్‌యాదవ్, కార్పొరేషన్‌ కమిషనర్‌ అలీంబాషా, నాయకులు సన్నపురెడ్డి పెంచలరెడ్డి, సంక్రాంతి కళ్యాణ్, అడిషనల్‌ కమిషనర్‌ వెంకటేశ్వరరావు, ఈఈ శేషగిరిరావు పాల్గొన్నారు.

కార్పొరేట్‌ స్థాయికి మున్సిపల్‌ పాఠశాలలు 
నెల్లూరు సిటీ: మున్సిపల్‌ పాఠశాలలను కార్పొరేట్‌కు దీటుగా తీర్చిదిద్దుతామని ఇరిగేషన్‌ శాఖ మంత్రి అనిల్‌కుమార్‌యాదవ్‌ తెలిపారు. నగరంలోని బీవీఎస్‌ నగర పాలక సంస్థ ఉన్నత పాఠశాలలోని విద్యార్థినులకు సోమవారం సైకిళ్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా అనిల్‌కుమార్‌ మాట్లాడుతూ మున్సిపల్‌ పాఠశాలల్లో మౌళిక వసతులు కల్పించి విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ డిప్యూటీ మేయర్‌ ముక్కాల ద్వారకానాథ్, నాయకులు రూప్‌కుమార్‌యాదవ్, సంక్రాంతి కళ్యాణ్, తదితరులు పాల్గొన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top