బార్‌ల ‘మందు’చూపు

Bar Organizers Commits Irregularities In Liquor Sales With Support Of Excise Officers - Sakshi

బార్ల నిర్వాహకులు ‘మందు’చూపుతో వ్యవహరిస్తున్నారు. ఎక్సైజ్‌ అధికారులను మచ్చిక చేసుకుని మద్యం నిల్వలను డంప్‌ చేస్తున్నారు. కోరిన మద్యం అందజేస్తూ కాసులు కురిపించుకుంటున్నారు. వైన్‌ షాపులకు సరుకు సరఫరా కాకుండా చూస్తూ దందా సాగిస్తున్నారు. ఎక్సైజ్‌ అధికారులను మామూళ్ల మత్తులో ముంచి మందు బాబులను పిండేస్తున్నారు.  

సాక్షి, అనంతపురం సెంట్రల్‌ : మద్య నిషేధంలో భాగంగా ప్రభుత్వం మద్యం దుకాణాల సంఖ్య తగ్గించడంతో పాటు వేళలను కూడా మార్చింది. కానీ దీన్ని పకడ్బందీగా అమలు చేయాల్సిన ఎక్సైజ్‌ శాఖ సర్కార్‌ లక్ష్యానికి తూట్లు పొడుస్తోంది. బార్ల నిర్వాహకులతో కుమ్మక్కై మందుబాబుల జేబుకు చిల్లు పెడుతోంది.  

బార్‌ నిర్వాహకులకు కాసులపంట 
అక్టోబర్‌ 1 నూతన మద్యం పాలసీ అమల్లోకి రాగా.. అప్పటి వరకూ నడుస్తున్న ప్రైవేటు మద్యం దుకాణాలు రద్దయ్యాయి. వాటిస్థానంలో ప్రభుత్వమే దుకాణాలను ఏర్పాటు చేసింది. జిల్లాలో 247 మద్యం దుకాణాలున్న చోట 20 శాతం కుదించి 197 దుకాణాలను ఏర్పాటు చేశారు. ఇలా ఏటా 20 శాతం మద్యం దుకాణాలను తగ్గించేలా ప్రభుత్వం పాలసీని తీసుకొచ్చింది. దశల వారీగా మద్యానికి సామాన్యులకు దూరం చేయాలనే సంకల్పంతో ప్రభుత్వం పనిచేస్తోంది. అయితే ఇది కాస్తా బార్ల యజమానులకు కలసివస్తోంది. రాత్రి 11 గంటల వరకు అనుమతి ఉండటం.. ఎక్సైజ్‌ అధికారుల ప్రోత్సాహం తోడు కావడంతో బార్ల నిర్వాహకులకు కాసుల పంట పండుతోంది. 

సరాఫరా నుంచే.. 
జిల్లాకు వచ్చిన స్టాకు మొత్తం బార్ల యజమానులు తన్నుకుపోతున్నారు. దీంతో ప్రభుత్వ మద్యం దుకాణాలు వెలవెలబోతున్నాయి. ఎక్సైజ్‌ అధికారుల సహకారంతో రెండు నెలల ముందు నుంచి బార్లలో రూ.కోట్లు విలువజేసే మద్యాన్ని డంప్‌ చేసుకున్నట్లు తెలుస్తోంది. దీంతో మందుబాబులు బార్ల వద్దకే క్యూ కడుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఇటీవల అమ్మకాలు భారీగా పెరిగాయి. రోజుకు రూ.లక్ష జరిగే బార్లు.. నేడు రూ.10 లక్షల వరకూ కౌంటర్‌ జరుగుతోందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. బార్‌ల యజమానులతో ఎక్సైజ్‌ అధికారులు కుమ్మక్కు కావడంతోనే ఇది సాధ్యమవుతోందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.  

నిబంధనలన్నీ తూచ్‌ 
నిబంధనల ప్రకారం బార్‌లలో ఫుల్‌బాటిళ్లు మాత్రమే విక్రయించాలి. కానీ అనంతలో క్వాటర్‌ బాటిల్‌ నుంచి లభ్యమవుతున్నాయి. ఎక్సైజ్‌ అధికారులే అధికారికంగా బార్లకు సరఫరా చేస్తుండడం గమనార్హం. కొన్ని బార్లలో లూజు విక్రయాలు కూడా చేస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ఇదిలా ఉంటే ఎంఆర్‌పీ ఉల్లంఘన యథేచ్ఛగా సాగుతోంది. ఫుల్‌బాటిల్‌పై రూ.100 అదనంగా వసూలు చేస్తున్నారు. బార్‌లలో జరుగుతున్న అక్రమాల గురించి ఎక్సైజ్‌ అధికారులకు తెలిసినప్పటికీ కనీస తనిఖీలు చేయడం లేదు. జిల్లాలో ఎక్కడా ఒక్క కేసూ నమోదు కాని పరిస్థితి. దీని వెనుక ఎక్సైజ్‌ అధికారులకు నెలనెలా మామూళ్లకు ఒప్పందం కుదిరిందనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.

బార్‌లలో దోపిడీ ఇలా..

బ్రాండ్‌ పేరు  వైన్‌షాపు ధర(క్వాటర్‌) బార్‌ ధర(క్వాటర్‌)
మ్యాన్షన్‌హౌస్‌ 150 180–200
ఎంసీ బ్రాందీ 140 170–190
మార్ఫియస్‌ 250 280–300 
కింగ్‌ఫిషర్‌(స్ట్రాంగ్‌ బీరు) 130 160–170
నాకౌట్‌ 130 160–180
హేవర్డ్స్‌ (చీప్‌ లిక్కర్‌) 120 150–160
కొరియర్‌ గ్రీన్‌ విస్కీ 230 260–290
ఐబీ విస్కీ 150  180–190
Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top