చిత్తూరు జిల్లా వరదయ్యపాళెంలో 2014 నవంబర్ 16న జరిగిన సప్తగిరి గ్రామీణ బ్యాంకు దోపిడీ కేసుకు సంబంధించి
796 గ్రాముల బంగారం స్వాధీనం
నిందితుడు సినిమా నిర్మాత ?
సత్యవేడు : చిత్తూరు జిల్లా వరదయ్యపాళెంలో 2014 నవంబర్ 16న జరిగిన సప్తగిరి గ్రామీణ బ్యాంకు దోపిడీ కేసుకు సంబంధించి తమిళనాడు రాష్ట్రం తిరువారుర్‌కు చెందిన ఎన్.బాలమురుగన్(45)ను పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. బెంగళూరు పోలీసుల కస్టడీలో ఉన్న అతడిని ఈ నెల తొమ్మిదో తేదీ పీటీ వారెంట్‌పై వరదయ్యపాళెం పోలీసులు తీసుకొచ్చారు. నిందితుడి నుంచి 796 గ్రాముల బంగారు స్వాధీనం చేసుకున్న పోలీసులు మంగళవారం మీడియా ఎదుట హాజరుపరిచారు.
చిన్న వయసు నుంచే..
బాలమురుగన్ 18 ఏళ్ల వయసు నుంచే చోరీలకు అలవాటుపడ్డాడు. ఇతనిపై ఇంటి దొంగతనాలకు సంబంధించి తమిళనాడులో 30 కేసులు, కర్ణాటకలో 80 వరకు కేసులు ఉన్నాయి. బెంగళూరులో చోరీలు చేసేందుకు వెళ్లినప్పుడు అక్కడ మంజుల అనే మహిళను పెళ్లి చేసుకున్నాడు. ఇతని కుటుంబ సభ్యులు అందరూ తమిళనాడులో వ్యాపారాలు, కాంట్రాక్టు పనులు చేస్తున్నారు.
గొప్పవాడు కావాలని...
తమ కుటుంబ సభ్యుల కంటే గొప్పగా ఉండాలని, తనకు గుర్తింపు రావాలని బాలమురుగన్ సినిమాలు తీయాలని ఆలోచించాడు. అందుకు డబ్బు ఎక్కువ కావాల్సి వస్తుందనే ఉద్దేశంతో చిన్న దొంగతనాలు మానేసి బ్యాంకు దోపిడికీ ప్లాన్ చేశాడు. ఓ కేసులో జైలుశిక్ష అనుభవిస్తున్నపుడు మొబైల్‌లో ఇంటర్‌నెట్ ద్వారా దొంగతనం చాకచక్యంగా చేసే విధానం తెలుసుకున్నాడు. సెక్యూరిటీ ఉన్న బ్యాంకుల వివరాలను మొబైల్ ఇంటర్‌నెట్ ద్వారానే గుర్తించాడు. చోరీ సమయంలో గ్యాస్ కట్టర్‌తో లాకర్ తెరిచేవాడు. మొట్ట మొదట అతడు హైదరాబాద్‌లోని ఓ గ్రామీణ బ్యాంకులో చోరీ చేశాడు. అనంతరం వరదయ్యపాళెం బ్యాంకు, ఆ తరువాత బాలానగర్ బ్యాంకుల్లో దొంగతనాలు చేశాడు. కర్ణాటక రాష్ట్రంలోనూ నాలుగు బ్యాంకుల్లో చోరీకి పాల్పడ్డాడు. నిందితుడు ప్రస్తుతం ‘మనసా వినవే’ అనే తెలుగు సినిమా ను రూ. 7 కోట్లు ఖర్చు చేసి తీస్తున్నట్లు తెలిసింది. మీడియా సమావేశంలో వరదయ్యపాళెం సీఐ టి.నరసింహులు, ఎస్‌ఐ షేక్‌షావలిపాల్గొన్నారు.