ఒంగోలు నగరంలో ఓటు హక్కుకు సంబంధించి పదివేల దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయని
ఒంగోలు కలెక్టరేట్, న్యూస్‌లైన్: ఒంగోలు నగరంలో ఓటు హక్కుకు సంబంధించి పదివేల దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయని, వాటిని సకాలంలో పరిష్కరించకపోవడంతో జిల్లా మొత్తానికి చెడ్డపేరు వ స్తోందని కలెక్టర్ జీఎస్‌ఆర్‌కేఆర్ విజయకుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలని ఒంగోలు ఆర్‌డీఓను ఆదేశించారు. మంగళవారం రాత్రి స్థానిక సీపీఓ కాన్ఫరెన్స్ హాలులో ఓటర్ల నమోదు ప్రక్రియపై జిల్లా అబ్జర్వర్ మధుసూదనరావుతో కలిసి నియోజకవర్గస్థాయి అధికారులు, తహసీల్దార్లతో ఆయన సమీక్షించారు. ఓటర్ల నమోదుకు సంబంధించి ప్రతిరోజూ తనకు ఎస్‌ఎంఎస్ రూపంలో నివేదికలు అందించాలని ఆదేశించారు.
ఏబీసీడీలు కూడా నొక్కలేరా..
‘ప్రతి తహసీల్దార్‌కు డిజిటల్ సిగ్నేచర్ ఇచ్చాం. కీలకమైన ఆ సిగ్నేచర్‌ను ఆపరేట్ చేయలేకపోతున్నారు. ఏబీసీడీ అనే లెటర్స్ కూడా కొట్టలేకపోతున్నారు. పైగా కంఫ్యూటర్ ఆపరేటర్‌కు వాటిని ఇస్తున్నారు. మీ వాలకం చూస్తుంటే మిమ్మల్ని బయటకు పంపించి కంప్యూటర్ ఆపరేటర్లను తహసీల్దార్లుగా చేయాల్సి వస్తుందేమోనని’ కలెక్టర్ వ్యాఖ్యానించారు. మార్కాపురం ఆర్‌డీఓను అడిగితే తహసీల్దార్ పేరు చెప్పడం, తహసీల్దార్ అడిగితే కంప్యూటర్ ఆపరేటర్ పేరు చెప్పడంపై కలెక్టర్ మండిపడ్డారు. జిల్లాలో చేతగానివారు, పనికిమాలినవాళ్లు ఉన్నారని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఒకవైపు పనిచేస్తూ కూడా ఎందుకు అనిపించుకోవాలని ఆయన అధికారులను ప్రశ్నించారు.
ఓటర్ల దరఖాస్తులు ప్రతిరోజూ అప్‌లోడ్ చేయాలి: రోల్ అబ్జర్వర్
ఓటర్లను విచారించిన అనంతరం ఆ దరఖాస్తులను ఏరోజుకారోజు అప్‌లోడ్ చేయాలని రోల్ అబ్జర్వర్ మధుసూదనరావు ఆదేశించారు. ఒంగోలులో ఓటర్ల నమోదుకు సంబంధించి రాజకీయ పార్టీల నుంచి ఫిర్యాదులు వస్తున్నందున అధికారులు మరింత జాగ్రత్తగా వ్యవహరించాలన్నారు. అవసరమైతే అదనపు సిబ్బందిని నియమించుకొని సకాలంలో విచారణ పూర్తి చేయాలన్నారు. ఓటరు జాబితా సవరణ ప్రక్రియ అంతా ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు చేయాలన్నారు. పోలింగ్ కేంద్రాల్లో బూత్ లెవల్ ఆఫీసర్లు లేకుంటే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.