ఎన్ని చట్టాలు తెచ్చినా మహిళలు, విద్యార్థినులపై దాడులు ఆగడం లేదని ఎమ్మెల్యే గురునాథ్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం యాసిడ్ దాడిలో గాయపడిన వాణిని ఎమ్మెల్యే పరామర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఇలాంటి ఘటనలను ప్రభుత్వం సీరియస్‌గా పరిగణించాలన్నారు
అనంతపురం అర్బన్, న్యూస్‌లైన్: ఎన్ని చట్టాలు తెచ్చినా మహిళలు, విద్యార్థినులపై దాడులు ఆగడం లేదని ఎమ్మెల్యే గురునాథ్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం యాసిడ్ దాడిలో గాయపడిన వాణిని ఎమ్మెల్యే పరామర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఇలాంటి ఘటనలను ప్రభుత్వం సీరియస్‌గా పరిగణించాలన్నారు. వెంటనే చర్యలు తీసుకుని, నిందితులను కఠినంగా శిక్షించాలన్నారు. మహిళలపై దాడులకు పాల్పడేవారికి ఉరిశిక్ష విధించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పట్టపగలే పోకిరీలు మహిళలపై దాడులు చేస్తుంటే పోలీసు యంత్రాంగం ఏం చేస్తోందన్నారు. విద్యార్థినిపై దాడిని వైఎస్సార్ సీపీ నగర అధ్యక్షుడు రంగంపేట గోపాల్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. మహిళా విభాగం నగర అధ్యక్షురాలు శ్రీదేవి మాట్లాడుతూ యువతిపై యాసిడ్ దాడి దారుణమన్నారు. బాధితురాలిని పరామర్శించిన వారిలో వైఎస్సార్ సీపీ నాయకులు యూపీ నాగిరెడ్డి, మారుతీ నాయుడు, సోమశేఖర్ రెడ్డి తదితరులు ఉన్నారు. ఈ సంఘటనపై నగరంలోని పలువురు ఇలా స్పందించారు.
మహిళలకు భద్రత కల్పించాలి
సమాజంలో మహిళలకు రక్షణ కరువు అవుతోంది. దేశంలో, రాష్ట్రంలో ఎక్కడో ఒకచోట దాడులు జరుగుతూనే ఉన్నాయి. నగరంలో జరిగిన ఘటనకు ప్రభుత్వమే బాధ్యత తీసుకోవాలి. దాడి జరిగిన సమయంలో ప్రభుత్వం కఠిన చట్టాలు రూపొందిస్తామని, దాడులను అరికడతామని ప్రకటనలు గుప్పిస్తున్నా...తర్వాత గాలికొదిలేస్తోంది. దీంతో దాడులు పునరావృతం
-జొన్నలగడ్డ పద్మావతి , వైఎస్సార్‌సీపీ
శింగనమల నియోజకవర్గ సమన్వయ కర్త
రాజకీయనాయకుల హస్తం ఉంది
విద్యార్థినిపై యాసిడ్ దాడి ఘటన పోలీసుల వైఫల్యానికి నిదర్శనం. వేధింపులపై విద్యార్థిని గతంలోనే ఫిర్యాదు చేసినా రాజకీయ ఒత్తిళ్లకు లొంగడం వల్లే కేసు నమోదు చేయలేదు. ఈ సంఘటనలో రాజకీయ నాయకుల హస్తం ఉంది. నిందితులు ఎంతటివారైనా కఠినంగా శిక్షించాలి
- సావిత్రమ్మ(ఐద్వా జిల్లా కార్యదర్శి)
పోలీసుల నిర్లక్ష్యమే
మే 28న బాధితురాలు నిందితులపై ముదిగుబ్బలో ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదు. మహిళలకు రక్షణ కల్పించాల్సిన పోలీసులే నిందితులను బాసటగా ఉంటున్నారు. మొదట్లోనే నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేసి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు.
- డాక్టర్ ప్రసూన(మాజీ కార్పొరేటర్)
ఎస్పీ బాధ్యత వహించాలి
యాసిడ్ దాడి ఘటనకు ఎస్పీ శ్యాంసుందర్ బాధ్యత వహించాలి. వేధింపులపై ఫిర్యాదు అందినా ముదిగుబ్బ ఎస్‌ఐ నిర్లక్ష్యంగా వ్యవరించడమే కాకుండా, కేసును పక్కదోవ పట్టించారు. తక్షణం ఆయనపై చర్యలు తీసుకోవాలి.నిందితులు ఎంతటి వారినైనా కఠినంగా శిక్షించాలి. - రాంభూపాల్(సీపీఐ నగర కార్యదర్శి
పోలీసుల వైఫల్యం
పట్టపగలు, అందరూ చూస్తుండగానే విద్యార్థినిపై యాసిడ్ దాడి సంఘటన చోటు చేసుకోవడంపై పోలీసుల వైఫల్యం కొట్టొచ్చినట్లుగా కనిపిస్తోంది. యూపీఏ ప్రభుత్వ హయాంలో దేశ వ్యాప్తంగా మహిళలపై దాడులు అధికమయ్యాయి. నిర్భయ చట్టం తెచ్చినా ఫలితం లేకుండా పోయింది. ఈ కేసులో నిందితులను కఠినంగా శిక్షించాలి.
- ఎస్.విష్ణువర్ధన్ రెడ్డి(బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు)
ప్రభుత్వ చేతగానితనానికి నిదర్శనం
మహిళలపై దాడులు సాధారణమయ్యాయి. ప్రభుత్వ చేతగానితనం వల్లే ఈ దుస్థితి ఏర్పడింది. జిల్లాలో పోలీసు వ్యవస్థ కూడా చేతులెత్తేసింది. కఠిన చట్టాలున్నా దాడులను అరికట్టలేకపోవడం సిగ్గు చేటు. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్లు తెరవాలి.
- పయ్యావుల కేశవ్, ఉరవకొండ ఎమ్మెల్యే