ప్రభుత్వ విప్‌ పిన్నెల్లిపై హత్యాయత్నం

Assassination attempt on Government Whip Pinnelli Ramakrishna Reddy - Sakshi

రాజధాని రైతుల ముసుగులో టీడీపీ గూండాల దౌర్జన్యం 

గుంటూరు జిల్లా చినకాకాని వద్ద ఎమ్మెల్యే కారుపై దాడి

రాళ్లు, కర్రలతో బీభత్సం

పూర్తిగా ధ్వంసమైన కారు అద్దాలు

నిలువరించేందుకు యత్నించిన గన్‌మెన్లపైనా విచక్షణారహితంగా దాడి

సకాలంలో పోలీసులు రావడంతో తప్పిన ముప్పు

త్రుటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్న పిన్నెల్లి రామకృష్ణారెడ్డి

సాక్షి, గుంటూరు: పాలన వికేంద్రీకరణపై ఆందోళన పేరుతో రాజధాని రైతుల ముసుగులో టీడీపీ గూండాలు రెచ్చిపోయారు. ప్రభుత్వ విప్, మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై హత్యాయత్నానికి పాల్పడ్డారు. ఆయన కారుపై రాళ్లు, కర్రలతో విచక్షణారహితంగా దాడికి దిగి విధ్వంసం సృష్టించారు. కారు అద్దాలు ధ్వంసం చేశారు. సమీపంలో ఉన్న పోలీసులు సకాలంలో రావడంతో పీఆర్కే త్రుటిలో ప్రాణాప్రాయం నుంచి బయటపడ్డారు. గుంటూరు జిల్లా చినకాకాని వద్ద మంగళవారం మధ్యాహ్నం ఈ ఘటన చోటు చేసుకుంది. మందడంలో ఇటీవల మీడియా ప్రతినిధులు, పోలీసులపై రాజధాని రైతుల ముసుగులో కొందరు దాడికి పాల్పడిన ఘటన మరువకముందే తాజాగా ఎమ్మెల్యేపైనే టీడీపీకి చెందిన గూండాలు దాడికి దిగడం గమనార్హం.

రాస్తారోకో పేరిట అరాచకం..   
రాష్ట్రంలో పాలన వికేంద్రీకరణను నిరసిస్తూ పొలిటికల్‌ జేఏసీ జాతీయ రహదారి–16పై మంగళవారం రాస్తారోకో, ధర్నాలకు పిలుపునిచ్చింది. అయితే ఇందుకు పోలీసులు అనుమతించలేదు. అయినా పట్టించుకోని టీడీపీ నాయకులు వివిధ ప్రాంతాల నుంచి భారీ ఎత్తున జనాన్ని రాస్తారోకోకు తరలించారు. కృష్ణా, గుంటూరు జిల్లాల్లో నియోజకవర్గానికి 200 మంది చొప్పున టీడీపీ కార్యకర్తలను తరలించినట్టు సమాచారం. అనుమతుల్లేకుండా వస్తున్న ఆందోళనకారులను ఎక్కడికక్కడ చెక్‌పోస్టులు, పికెట్‌లు ఏర్పాటు చేసి పోలీసులు అడ్డుకోగా.. టీడీపీ శ్రేణులు అల్లరిమూకలతో కలసి పొలాల్లోని రోడ్లు, డొంకల వెంట ద్విచక్ర వాహనాలపై చినకాకాని చేరుకున్నాయి. ఇలా వచ్చిన వందలాది మంది టీడీపీ శ్రేణులు ఎన్‌హెచ్‌–16పై రెండు గంటలపాటు బైఠాయించి ఆందోళన చేశారు. ఫలితంగా జాతీయ రహదారిపై వాహనాల రాకపోకలకు అంతరాయమేర్పడింది. కిలోమీటర్ల మేరకు వాహనాలు నిలిచిపోయాయి. రహదారి ముట్టడికి వచ్చిన వారంతా తమ ద్విచక్ర వాహనాలను సర్వీస్‌ రోడ్డు వెంబడి పెట్టడంతో సర్వీసు రోడ్డులోనూ ఇరువైపులా ట్రాఫిక్‌ నిలిచిపోయింది. 

సర్వీస్‌ రోడ్డులో ఉన్న పీఆర్కే కారును గుర్తించి..
ఇదే సమయంలో మధ్యాహ్నం 12.30 గంటల సమయంలో కారులో గుంటూరు నుంచి విజయవాడ వెళుతున్న ప్రభుత్వ విప్, మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి చినకాకాని వద్ద సర్వీస్‌ రోడ్డులో ట్రాఫిక్‌లో చిక్కుకుపోయారు. ఇది గమనించిన టీడీపీ గూండాలు 50 మందికిపైగా పక్కా ప్రణాళికతో ఆయనపై హత్యాయత్నానికి పాల్పడ్డారు. రాళ్లు, కర్రలతో కారుపై విచక్షణారహితంగా దాడికి దిగారు. కారు అద్దాలను ధ్వంసం చేశారు. కారులో నుంచి పీఆర్కేను కిందకు దింపి ఆయన్ను తుదముట్టించాలని ప్రయత్నించారు. దీన్ని పసిగట్టిన పీఆర్కే గన్‌మెన్లు టీడీపీ గూండాలను నిలువరించే ప్రయత్నం చేశారు. దీంతో వారిపైనా టీడీపీ గూండాలు దాడికి తెగబడ్డారు. సమీపంలో ఉన్న పోలీసులు విషయం తెలుసుకుని ఘటనా స్థలికి చేరుకుని టీడీపీ గూండాల బారి నుంచి ఎమ్మెల్యేను రక్షించారు. అక్కడినుంచి పోలీసు బందోబస్తు మధ్య ఆయన్ను గుంటూరుకు తరలించారు.

పక్కా ప్రణాళికతోనే.. 
పాలన వికేంద్రీకరణపై టీడీపీ కొన్ని రోజులుగా ఆందోళనలు చేస్తుండడం తెలిసిందే. అయితే ప్రజల నుంచి సరైన స్పందన లేకపోవడంతో హింసను ప్రేరేపించి రాష్ట్ర, జాతీయ స్థాయిలో హాట్‌ టాపిక్‌గా మార్చాలని టీడీపీ స్కెచ్‌ వేసినట్టు సమాచారం. ఇందులో భాగంగా ఆందోళన చేస్తున్న సమయంలో అటువైపు వచ్చిన పోలీసులు, మీడియా ప్రతినిధులు, మంత్రులు, వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలపై దాడికి యత్నించాలని ముందుగానే పథకం వేసుకున్నట్టు తెలుస్తోంది. ఇటీవల మందడంలో పోలీసులు, మీడియా ప్రతినిధులపై ఆందోళనకారుల ముసుగులో టీడీపీ శ్రేణులు దాడి చేయడం విదితమే. ఈ ఘటనలో పోలీసులు అరెస్టు చేసిన వారిలో చాలావరకూ టీడీపీ సానుభూతిపరులే ఉండడం గమనార్హం. ఈ నేపథ్యంలో పీఆర్కే ట్రాఫిక్‌లో ఉన్న విషయం తెలుసుకున్న టీడీపీ గూండాలు పథకం ప్రకారం రాళ్లు, కర్రలతో దాడికి పాల్పడ్డారు. దాడికి యత్నించిన వారందరూ మద్యం తాగి ఉన్నట్టు పీఆర్కే చెబుతున్నారు. మద్యం తాగి ఉండడమేగాక ముందస్తుగా రాళ్లు, కర్రలతో సిద్ధంగా ఉన్న టీడీపీ గూండాలు ఎమ్మెల్యే వాహనంపై ఒక్కసారిగా దాడికి తెగబడటాన్ని చూస్తుంటే ఇది పక్కా ప్రణాళిక ప్రకారమే జరిగిందని విదితమవుతోంది.

టీడీపీకి ఇది కొత్తేమీ కాదు..
అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా హింసను ప్రేరేపించి పబ్బం గడుపుకోవడం టీడీపీ నాయకులకు కొత్తేమీ కాదని పరిశీలకులు అంటున్నారు. పీఆర్కేపై హత్యాయత్నం నేపథ్యంలో అధికారాన్ని అడ్డుపెట్టుకుని గత ఐదేళ్లలో గుంటూరు జిల్లాలో టీడీపీ నేతలు చేసిన అరాచకాలను వారు గుర్తు చేస్తున్నారు. గతంలో ప్రజాస్వామ్యానికి పాతరేస్తూ ఏడుగురు ఎంపీటీసీలున్న వైఎస్సార్‌సీపీకి జిల్లాలోని ముప్పాళ్ళ ఎంపీపీ స్థానం దక్కకుండా ఐదుగురు ఎంపీటీసీలున్న టీడీపీ నేతలు కుట్రలకు పాల్పడ్డారు. వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీలను కిడ్నాప్‌ చేసి ఎంపీపీ స్థానాన్ని దక్కించుకున్నారు. 2014 జూలై 13న ముప్పాళ్ల ఎంపీపీ ఎన్నికకు ఎంపీటీసీలతో వెళ్తున్న వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే మొహమ్మద్‌ ముస్తఫా, అంబటి రాంబాబులపై మాజీ స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు తనయుడు శివరామ్‌ గూండాలతో మేడికొండూరు వద్ద దాడులు చేయించారు. ఎంపీపీలు ప్రయాణిస్తున్న బస్సు, ఎమ్మెల్యే వాహనాన్ని ధ్వంసం చేయడమేగాక ముస్తఫాతోపాటు అంబటిపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచి భయానక వాతావరణం సృష్టించారు.

ఎమ్మెల్యే పీఆర్కేపై దాడి హేయం
టీడీపీ నేతలు రైతులను తప్పుదోవ పట్టిస్తున్నారు రాజధాని రైతుల సమస్యలను పరిష్కరించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. చర్చలకు వస్తే వారి న్యాయపరమైన డిమాండ్లు పరిష్కరిస్తామని మంత్రులు చెబుతున్నారు. రైతులు శాంతియుతంగా చేస్తున్న నిరసనలను టీడీపీ నేతలు పక్కదోవ పట్టిస్తున్నారు. ఎమ్మెల్యేపై జరిగిన దాడి వెనుక టీడీపీ నేతల హస్తం ఉంది. టీడీపీ ఇప్పుడు కూడా రైతులను మోసం చేస్తోంది.
– ఉండవల్లి శ్రీదేవి, తాడికొండ ఎమ్మెల్యే 

దాడి వెనుక టీడీపీ గూండాలు ఉన్నారు
ఎమ్మెల్యే పిన్నెల్లిపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నా. ఇలాంటి దాడులు చేయడం, కారు అద్దాలు పగలగొట్టడం హేయమైన చర్య. దాడి వెనుక టీడీపీ గూండాలు ఉన్నారు.   
– నందిగం సురేష్, బాపట్ల ఎంపీ 

టీడీపీ గూండాల పనే 
రైతుల రూపంలో టీడీపీ గూండాలను ప్రేరేపించి వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై హత్యాయత్నానికి పాల్పడ్డారని ఉపముఖ్యమంత్రి అంజాద్‌ బాషా ఆరోపించారు. దేశంలో నంబర్‌ వన్‌ యాంటీ సోషల్‌ ఎలిమెంట్‌ చంద్రబాబే అని ధ్వజమెత్తారు.  చంద్రబాబుకు కావాల్సింది స్టేట్‌ కాదు..రియల్‌ ఎస్టేట్‌ అని ధ్వజమెత్తారు. 

బాబు దిగజారుడుతనానికి నిదర్శనం 
వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, కైలే అనిల్‌కుమార్‌లపై దాడులు చేయించడం టీడీపీ అధినేత చంద్రబాబు దిగజారుడుతనానికి నిదర్శనమని జలవనరుల శాఖ మంత్రి పి.అనిల్‌కుమార్‌ యాదవ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో వైఎస్‌ జగన్‌పై అక్రమంగా కేసులు పెట్టినప్పుడు, ఆయనపై హత్యాయత్నం జరిగినప్పుడు తాము దాడులకు, హింసకు పాల్పడలేదని గుర్తు చేశారు.  

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top