అశోక్‌బాబుకు చంద్రన్న కానుక

Ashok Babu got Promise from CM Chandrababu for MLC? - Sakshi

స్వచ్ఛంద ఉద్యోగ విరమణ చేయగానే ఏపీఎండీసీ ఛైర్మన్‌ పదవి

మార్చిలో ఎమ్మెల్సీ ఇచ్చేటట్టు సీఎం చంద్రబాబు నుంచి హామీ

స్వచ్ఛంద విరమణకు అడ్డుగా మారిన నకిలీ సర్టిఫికెట్ల కేసు

కేసు నుంచి బయటపడేసేందుకు ప్రభుత్వ పెద్దల యత్నం

సాక్షి, అమరావతి: ఏపీ ఎన్జీవో అధ్యక్షుడు అశోక్‌బాబుకు ఏపీ ఎండీసీ (ఆంధ్రప్రదేశ్‌ మినరల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌) చైర్మన్‌ పదవి ఖరారైంది. ఈ మేరకు అశోక్‌బాబుకు ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టమైన హామీ ఇచ్చినట్లు అధికార వర్గాల ద్వారా తెలిసింది. అశోక్‌బాబు స్వచ్చంద ఉద్యోగ విరమణ చేయగానే ఏపీ ఎండీసీ చైర్మన్‌గా నియమించనున్నారు. అలాగే మార్చిలో ఎమ్మెల్సీ పదవి ఇచ్చేందుకు కూడా చంద్రబాబు హామీ ఇచ్చినట్లు సమాచారం. ఇందుకు కృతజ్ఞతగా ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరించే వ్యక్తి ఏపీ ఎన్జీవో అధ్యక్షుడిగా ఎన్నికయ్యేలా కృషి చేస్తానని అశోక్‌బాబు తన స్వామి భక్తి చూపించినట్లు అధికార వర్గాలు తెలిపాయి.
   
ఎమ్మెల్సీ కోసం గతంలోనే ప్రయత్నం..
వాస్తవానికి కొన్ని నెలల కిందటే ఎమ్మెల్సీ పదవి కోసం అశోక్‌బాబు తీవ్రంగా ప్రయత్నించారు. గాలి ముద్దుకృష్ణమనాయుడు మృతి చెందడంతో ఖాళీ అయిన ఎమ్మెల్సీ పదవిని తనకు ఇవ్వాలని అశోక్‌బాబు అడగ్గా.. ఇందుకు చంద్రబాబు కూడా సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. అయితే ముద్దుకృష్ణమ కుటుంబం ఆ ఎమ్మెల్సీ పదవి తమకే కావాలని పట్టుబట్టడంతో.. ఏదైనా కార్పొరేషన్‌ చూసుకోవాలని సీఎం సూచించడంతో అశోక్‌బాబు ఏపీ ఎండీసీ చైర్మన్‌ పదవిని ఎంపిక చేసుకున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.

ఈ నేపథ్యంలో ప్రస్తుత ఉద్యోగానికి స్వచ్చంద విరమణ తీసుకోగానే.. ఏపీఎండీసీ చైర్మన్‌గా నియమిస్తానని అశోక్‌బాబుకు సీఎం హామీ ఇచ్చినట్లు తెలిసింది. ఏపీఎండీసీ చైర్మన్‌ పదవి రాగానే ఎన్జీవో అధ్యక్ష పదవికి రాజీనామా చేసి.. ప్రభుత్వ అనుకూల వ్యక్తిని ఆ స్థానంలోకి వచ్చేలా శాయశక్తులా కృషి చేస్తానని ముఖ్యమంత్రికి అశోక్‌బాబు చెప్పినట్లు సమాచారం. దీంతో మార్చిలో ఏపీ ఎండీసీ చైర్మన్‌ పదవి వదులుకుంటే.. ఎమ్మెల్సీ అయ్యేందుకు కూడా అవకాశం కల్పిస్తానని ముఖ్యమంత్రి హామీ ఇచ్చినట్లు ఓ ఉన్నతాధికారి ద్వారా తెలిసింది.

విచారణ పూర్తయితేనే ఉద్యోగ విరమణ
ఇదిలాఉండగా, అశోక్‌బాబు స్వచ్చంద ఉద్యోగ విరమణకు పలు అడ్డంకులు ఎదురయ్యాయి. ఆయన ప్రస్తుతం వాణిజ్య పన్నుల శాఖలో ఏసీటీవోగా పనిచేస్తున్నారు. ఆయనపై నకిలీ సర్టిఫికెట్లతో పదోన్నతి పొందారనే ఆరోపణలున్నాయి. దీనిపై అప్పట్లో ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. ఈ విచారణ కొనసాగుతోంది. ఇది పూర్తయ్యి క్లీన్‌చిట్‌ వస్తేనే స్వచ్చంద పదవీ విరమణకు దరఖాస్తు చేసుకునే అవకాశం లభిస్తుంది. దీంతో క్లీన్‌చిట్‌ తెచ్చుకునేందుకు అశోక్‌బాబు శతవిధాలా ప్రయత్నిస్తున్నట్టు వాణిజ్య విభాగంలోని ఓ అధికారి ‘సాక్షి’తో చెప్పారు. విచారణాధికారిగా ఉన్న ఓ డిప్యూటీ కమర్షియల్‌ ట్యాక్స్‌ ఆఫీసర్‌ అశోక్‌బాబుకు క్లీన్‌చిట్‌ ఇచ్చేందుకు గట్టిగా ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది. ఈ కేసుకు సంబంధించి అశోక్‌బాబుకు అనుకూలంగా వ్యవహరించాలని విచారణాధికారులను కొందరు ప్రభుత్వ పెద్దలు ఆదేశించారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

విద్యాసాగర్‌ అభ్యర్థిత్వంపై తీవ్ర వ్యతిరేకత..
రాష్ట్రంలో ఏపీ ఎన్జీవో అసోసియేషన్‌ 15 యూనిట్లుగా ఉంది. అశోక్‌బాబు రాజీనామా చేస్తే ఈ 15 యూనిట్ల అధ్యక్షులు, కార్యదర్శుల్లో మెజారిటీ సభ్యులు కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోవాలి. అయితే చాలా ఏళ్లుగా జనరల్‌ సెక్రటరీనే అధ్యక్షుడిగా ఎన్నుకుంటూ వస్తున్నారు. కానీ తాజా పరిణామాల నేపథ్యంలో తమకు అనుకూలమైన వ్యక్తిని ఏపీ ఎన్జీవో అధ్యక్ష పదవిలో నియమించాలని ప్రభుత్వం పట్టుబట్టడంతో.. వెస్ట్‌ కృష్ణా యూనిట్‌ అధ్యక్షుడు విద్యాసాగర్‌ పేరును అశోక్‌బాబు తెరపైకి తెచ్చినట్లు అసోసియేషన్‌ సభ్యులు చెప్పారు. కానీ విద్యాసాగర్‌ను 15 యూనిట్లలో 12 యూనిట్ల సభ్యులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. సాగర్‌ను అధ్యక్షుడిని చేయాలని చూస్తే.. అసోసియేషన్‌ నుంచి పూర్తిగా తప్పుకుంటామని వారు హెచ్చరించినట్లు సమాచారం.  

అసోసియేషన్‌ను రాజకీయాల్లోకి లాగొద్దు..
కొన్ని రోజుల కిందట ఏలూరులో ఏపీ ఎన్జీవో అసోసియేషన్‌ ఎగ్జిక్యూటివ్‌ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో 12 యూనిట్లకు సంబంధించిన సభ్యులు ప్రస్తుత జనరల్‌ సెక్రటరీని అధ్యక్షుడిగా చేయాలని, మరో ముగ్గురు సభ్యులను కార్యవర్గంలోకి తీసుకోవాలని కోరుతూ సంతకాలు చేశారు. ఆ తర్వాత విశాఖలోనూ ఇలాగే జరిగింది. మెజారిటీ సభ్యులు విద్యాసాగర్‌ను వ్యతిరేకించారు. ‘కావాలంటే మీరు రాజకీయాల్లోకి వెళ్లండి. అంతేగానీ అసోసియేషన్‌ను మాత్రం రాజకీయాల్లోకి లాగొద్దు. ఇది రాజకీయ అనుబంధ సంస్థ కాదు. ఉద్యోగులు ఏర్పాటు చేసుకున్నది’ అని పలువురు సభ్యులు అశోక్‌బాబును ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేశారు.

మీరు బయటకు వెళితేనే అసోసియేషన్‌కు మంచిది..
అలాగే విజయవాడలోని ఎన్జీవో భవన్‌లో శనివారం(18వ తేదీ) అర్ధరాత్రి కీలక సమావేశం జరిగింది. ఈ సందర్భంగా పలువురు సభ్యులు అధ్యక్షుడి ఎంపికకు సంబంధించి తమ అభిప్రాయం, సంతకాలు చేసిన కాపీని అశోక్‌బాబుకు అందించారు. దీంతో నన్నెప్పుడు వెళ్లిపొమ్మంటారంటూ అశోక్‌బాబు ఆ సభ్యులను ముభావంగా ప్రశ్నించినట్లు తెలిసింది. ‘మీరు ఇప్పటికే తెలుగుదేశం పార్టీ వ్యక్తిగా ముద్ర వేసుకున్నారు. మీరు ఎంత త్వరగా బయటికి వెళితే అంత మంచిది. లేకపోతే ఏ పార్టీతోనూ సంబంధం లేదని మీడియాకు చెప్పండి’ అని అసోసియేషన్‌ సభ్యులు తేల్చిచెప్పారు. ‘ఇప్పటికే చాలామంది ఉద్యోగులు అశోక్‌బాబు అంటే టీడీపీ సభ్యుడనే అభిప్రాయంలో ఉన్నారు. మీరు ఎంత త్వరగా అసోసియేషన్‌ నుంచి బయటకు వెళితే అంత మంచిది. మన అసోసియేషన్‌కు రాజకీయ ముద్ర ఉందన్న అపప్రద పోతుంది’ అని అశోక్‌బాబుపై మరికొందరు విరుచుకుపడ్డారు. దీంతో ఉక్కిరిబిక్కరి అయిన అశోక్‌బాబు.. త్వరలోనే ముఖ్యమంత్రితో మాట్లాడి నిర్ణయం ప్రకటిస్తానని చెప్పి వెళ్లిపోయారని ఆ సమావేశానికి హాజరైన ఎన్జీవో సభ్యులు తెలిపారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top