
విజయవాడ : ప్రతి ఏటా ఆశ్వీయుజ మాసంలో 10 రోజులపాటు జరిగే దసరా శరన్నవరాత్రి మహోత్సవాలకు విజయవాడ ఇంద్రకీలాద్రి ముస్తాబయింది. ఉత్సవ ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ మాట్లాడుతూ.. నేటి నుంచి అక్టోబర్ 8వ తేదీ వరకు దసరా ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తాం. అమ్మవారి జన్మనక్షత్రం మూల నక్షత్రం రోజైన అక్టోబర్ 5న రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పట్టువస్త్రాలు, పసుపు, కుంకుమ, గాజులు, పువ్వులు, పండ్లు సమర్పిస్తారు. మూల నక్షత్రం రోజున ఇంద్రకీలాద్రి భక్తులతో కిటకిటలాడుతుంది. అందువల్ల ఆ రోజు వీఐపీల దర్శనం రద్దు చేశాం. ఆ రోజున అన్ని క్యూలైన్లను సర్వదర్శనంగా పరిగణిస్తారు. ఉత్సవాలకు ఏపీ నుంచే కాకుండా తెలంగాణ, కర్ణాటక, ఒడిశా, తమిళనాడు నుంచి భక్తులు లక్షల సంఖ్యలో తరలిరానుండడంతో భక్తులకి ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ఇంకా ఎక్కడైనా సమన్వయలోపాలుంటే ఆలయ ఈఓతో చర్చించి వాటిని సరిదిద్దుకుంటామన్నారు.