ఆర్టీ'ఛీ'..ప్రాణాలతో చెలగాటం

APSRTC Negligence On Passengers - Sakshi

రిటైర్డు డ్రైవర్లతో విధులు

ఆర్టీసీ అధికారుల నిర్వాకం

ప్రయాణికుల భద్రతను గాలికొదిలిన వైనం

కార్మిక సంఘాల మండిపాటు

కర్నూలు–1 డిపోకు చెందిన డ్రైవర్‌ నజీర్‌అహ్మద్‌ ఏప్రిల్‌ 10న విధి నిర్వహణలో భాగంగా హైదరాబాదుకు వెళ్తూ గుండెపోటుకు గురయ్యారు. 55ఏళ్ల వయస్సు పైబడి కార్మికులను ఆర్డినరీ సర్వీసులకే పంపాలనే నిబంధన ఉన్నా ఇతన్ని ఇంద్ర ఏసీ బస్సుకు పంపించారు. అదృష్టవశాత్తు హైదరాబాదుకు చేరుకున్నాకే మృత్యువాత పడడంతో ప్రయాణికులకు ఎలాంటి అపాయం జరగలేదు.

కర్నూలు(రాజ్‌విహార్‌): అసలే దసరా పండుగ సీజన్‌.. బస్సుల్లో కాలు తీసి కాలు పెట్టేందుకు కూడా వీలుండదు.. పిల్లాపాపలతో ఎక్కడెక్కడి నుంచో సొంత గ్రామాలకు చేరుకోవాలన్న ఆత్రుత ప్రయాణికులది. వారి అవసరాన్ని ఆసరాగా చేసుకున్న ఆర్టీసీ.. చార్జీ పెంచి భద్రతను గాలికొదిలేసింది. ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం సురక్షితమంటూ ప్రకటనలు గుప్పించే అధికారులు కిక్కిరిసిన బస్సులను పదవీ విరమణ చెందిన డ్రైవర్ల చేతుల్లో పెట్టి చోద్యం చూశారు. అదృష్టం బాగుండి ఏమీ కాలేదు కానీ జరగరానిది జరిగివుంటే బాధ్యులెవరు?. ప్రయాణికుల ప్రాణాలతో చెలగాటమా అంటూ ఆర్టీసీని ఛీదరించుకుంటున్నారు.

ఆదాయంపైనే దృష్టి..
ఆర్టీసీ ఆదాయాన్ని పెంచుకోవడమే తప్ప సురక్షిత ప్రయాణాలపై దృష్టి సారించడంలేదు. ప్రత్యేక బస్సుల్లో 1.5 శాతం చార్జీలు వసూలు చేసి, ఖజానా నింపుకుంటోంది కానీ ప్రయాణికుల క్షేమాన్ని పట్టించుకోవడం లేదు. దసరా సమయంలో రిటైర్డు డ్రైవర్లతో స్పెషల్‌ బస్సులకు నడిపించి ప్రయాణికుల ప్రాణాలతో చెలగాటమాడింది. వయస్సు మీరడంతో అన్‌ఫిట్‌గా భావించి పదవీ విరమణ చేయించిన తొమ్మిది మందితో బస్సులు నడిపించడమే అందుకు నిదర్శనం. కర్నూలు–1డిపో నుంచి ముగ్గురిని అనంతపురం (స్పెషల్‌ టైప్‌ లాంగ్‌ సర్వీస్‌)కు పంపించారు. వీరితోపాటు నంద్యాల, మరో డిపోలో కూడా పదవీ విరమణ పొందిన వాళ్లకు విధులు అప్పగించినట్లు తెలుస్తోంది. అత్యధిక ఆదాయం వచ్చిందని సంబరపడుతున్నా.. ఏదైనా జరిగితే బాధ్యులెవరనేది ఆర్టీసీ అధికారులే చెప్పాలి.

ఆ నిబంధనకు అందుకే దూరం
నిబంధన ప్రకారం 58 ఏళ్లు నిండిన డ్రైవర్‌ పదవీ విరమణకు అర్హుడు. కార్మికుడి శారీరక, మానసిక పరిస్థితులను బట్టి ఈ నిబంధన అమల్లోకి తీసుకొచ్చారు. ప్రభుత్వ శాఖలతోపాటు విద్యుత్‌ శాఖ (కార్పొరేషన్‌) ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు 60ఏళ్లకు పెంచినా ఆర్టీసీ కార్మికులకు, ఉద్యోగులకు ఇది వర్తింపజేయలేదు. 58 ఏళ్ల తరవాత బస్సులు నడపడం సరి కాదని, 60ఏళ్ల విధానం అమల్లోకి వస్తే ప్రయాణికుల భద్రతకు ముప్పు వాటిల్లే అవకాశం ఉందని భావించి ఆ నిబంధనకు దూరం చేశారు. స్థానిక అధికారులు మాత్రం ఇవేమీ పట్టించుకోకుండా ప్రయాణికులతో కిటకిటలాడుతున్న బస్సులను చేతుల్లో పెట్టి పంపడం విమర్శలకు తావిస్తోంది.

కిలో మీటరుకు రూ.2 చొప్పున చెల్లింపు
పదవీ విరమణ పొందిన కార్మికులకు విధులు అప్పగించి కిలో మీటరుకు రూ.2 చొప్పున చెల్లించారు. అనంతపురానికి వెళ్లి వస్తే 298కిలో మీటర్లుకు రూ.596 చెల్లించారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top