సీఎం హామీ, సమ్మె విరమించిన ఆర్టీసీ ఉద్యోగులు

APSRTC JAC Leaders Meet CM YS Jagan - Sakshi

సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హామీతో ఆర్టీసీ జేఏసీ నేతలు సమ్మె విరమించారు. బుధవారం సచివాలయంలో ముఖ్యమంత్రితో జేఏసీ నేతలు భేటీ అయ్యారు. ఈ సమావేశంలో జేఏసీ నేతలు తమ సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకు వెళ్లారు. సీఎంతో చర్చల అనంతరం జేఏసీ నేతలు సమ్మె విరమిస్తున్నట్లు ప్రకటన చేశారు. ఈ సందర్భంగా జేఏసీ నేతలు మాట్లాడుతూ...‘ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తున్నందుకు ముఖ్యమంత్రికి ధన్యవాదాలు. ఇక నుంచి ఆర్టీసీ ఉద్యోగులంతా ప్రభుత్వ ఉద్యోగులేనని సీఎం మా భుజం తట్టారు. ముఖ్యమంత్రి ఇచ్చిన హామీని తొలి కేబినెట్‌లో అమలు చేయడం సంతోషం. ప్రభుత్వంలో ఆర్టీసీ విలీన ప్రక్రియ ప్రారంభమైంది. ఆర్టీసీ కార్మికుల జీవితాల్లో ముఖ్యమంత్రి నిర‍్ణయం వెలుగులు నింపింది. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి ఆర్టీసీ ఉద్యోగులు జీవితాంతం రుణపడి ఉంటారు. ఆర్టీసీని ప్రభుత్వపరం చేయడం వల్ల 55వేలమంది ఉద్యోగులకు మేలు జరుగుతుంది. ఆర్టీసీ రూ.7కోట్లు అప్పుల్లో ఉంది. మా డిమాండ్లను ముఖ్యమంత్రి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు’  అని అన్నారు.

కాగా రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(ఏపీఎస్‌ ఆర్టీసీ)ను తాము అధికారంలోకి వచ్చాక ప్రభుత్వంలో విలీనం చేస్తామంటూ పాదయాత్ర సందర్భంగా వైఎస్‌ జగన్‌ హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఆర్టీసీ విలీనంపై రాష్ట్ర సర్కారు త్వరలో అధ్యయన కమిటీని నియమించనుంది. గతంలో ఆర్టీసీ ఎండీగా, డీజీపీగా పనిచేసి, పదవీ విరమణ పొందిన సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి ఆంజనేయరెడ్డి ఈ కమిటీకి నేతృత్వం వహిస్తారు. కమిటీలో కార్మిక సంఘాల నేతలు, ప్రభుత్వ ఉన్నతాధికారులు సభ్యులుగా ఉంటారు. కమిటీ నియామకంపై రెండు, మూడు రోజుల్లో ప్రభుత్వం జీవో జారీ చేయనుంది. రెండు నెలల్లో ఈ అధ్యయన కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా ఆర్టీసీ విలీనానికి విధివిధానాలు ఖరారు చేస్తారు.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top