ఇష్టారాజ్యంగా నిర్ణయాలు

Appointments Without Notifications In IIIT Nuzvid - Sakshi

నూజివీడు ట్రిపుల్‌ ఐటీలో వివాదాస్పదం అవుతున్నఅధికారుల వైఖరి

నోటిఫికేషన్‌ లేకుండానే నియామకాలు

నాన్‌టీచింగ్‌ స్టాఫ్‌ని టీచింగ్‌ స్టాఫ్‌గా మార్పు

నూజివీడు: రాజీవ్‌గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం అధికారులు తీసుకుంటున్న నిర్ణయాలు వివాదాస్పదంగా మారుతున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా తీసుకున్న నిర్ణయాలపై సిబ్బందిలో సైతం తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ట్రిపుల్‌ఐటీ ప్రారంభంలో నాన్‌ టీచింగ్‌ స్టాఫ్‌ కింద తీసుకున్న హెచ్‌ఆర్‌టీలు దాదాపు 25 మందిని ఇటీవలే ఐటీ మెంటార్ల పేరుతో టీచింగ్‌ స్టాఫ్‌గా మార్చడంతో పాటు జీతాలను కూడా పెంచడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. 

జరిగిందిదీ..
ట్రిపుల్‌ ఐటీలను ఏర్పాటు చేసినప్పుడు హోమ్‌ రూమ్‌ ట్యూటర్ల(హెచ్‌ఆర్‌టీ)లను తీసుకోవడం జరిగింది. వీరు ప్రతి తరగతికి ఒకరు చొప్పున ఉన్నారు. వీరిని అప్పట్లో పీజీ డిప్లొమా ఇన్‌ ఐటీ అర్హతతో తీసుకుని అప్పట్లో నెలకు రూ.10వేల చొప్పున జీతం ఇచ్చారు. తరగతిలో మెంటార్‌ లేనప్పుడు తరగతిని పర్యవేక్షించడం, ల్యాప్‌ట్యాప్‌ల వాడకాన్ని విద్యార్థులకు నేర్పించడం, విద్యార్థులకు నిర్వహించే స్టడీ అవర్స్‌ను పర్యవేక్షించడం వీరి పని. నాలుగేళ్లు గడిచిన తర్వాత హెచ్‌ఆర్‌టీలను రద్దు చేసి వీరినే ఐటీ ఎస్‌ఎస్‌లుగా మార్చి జీతాన్ని రూ.15వేలుకి పెంచారు. ఆ తర్వాత మరలా కొంతకాలానికి టెక్నికల్‌ అసిస్టెంట్‌ (టీఏ)గా మార్చడంతో పాటు వేతనాన్ని రూ.20వేలకు పెంచారు. ఈ మూడు రకాల హోదాలు కూడా నాన్‌టీచింగ్‌ స్టాఫ్‌కు సంబంధించినవే. అనంతరం కొంతకాలానికి వారి జీతాన్ని రూ.25వేలకు పెంచారు.

నోటిఫికేషన్‌ లేదు..
ఇక్కడ టీఏలుగా పనిచేస్తున్న వారు ఉద్యోగం చేసుకుంటూనే నాగార్జున యూనివర్సిటీ నుంచి దూరవిద్యా విధానంలో ఎమ్మెస్సీ ఐటీ చదివారు. ఈ నేపథ్యంలో ఇటీవల ఆర్జీయూకేటీ ఉన్నతాధికారులు టీఏలను ఐటీ మెంటార్లు(టీచింగ్‌ స్టాఫ్‌)గా మారుస్తూ, జీతాన్ని కూడా రూ.33వేలకు పెంచుతున్నట్లు ఉత్తర్వులు జారీచేసి వారందరికి ఆర్డర్‌లను అందజేసింది. ప్రస్తుతం ఇదే వివాదాస్పదం అవుతోంది. ఏకపక్షంగా తీసుకుంటున్న నిర్ణయాలతో యూనివర్సిటీ ప్రమాణాలు పతనం చేస్తున్నారన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఒకవేళ ఐటీ మెంటార్లను నియమించాల్సి ఉంటే నోటిఫికేషన్‌ జారీ చేసి ఇంటర్వ్యూలు నిర్వహించి నియమించుకోవాలే గాని ఇలా చేయడమేమిటని మెంటార్లు సైతం ప్రశ్నిస్తున్నారు. అయితే ఈ హెచ్‌ఆర్‌టీలందరూ 20వ శతాబ్దపు గురుకులంలో చదువుకున్న విద్యార్థులు కావడం వల్లనే కావాలనే వారికి ఇలా లబ్ది చేస్తున్నారనే ప్రచారం ట్రిపుల్‌ఐటీలో జరుగుతోంది.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top