మార్కెట్‌ ధరకే ఏపీఐఐసీకి భూమి!

APIIC Should Pay Market Price For Land, Says AP CS Dinesh Kumar - Sakshi

వ్యాపారం చేసే సంస్థకు ఉచితంగా ఎందుకు

మొత్తం జీవోలతో నివేదిక సమర్పించండి

ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేష్‌కుమార్‌   

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ పారిశ్రామిక మౌలిక సదుపాయాల కల్పన సంస్థ (ఏపీఐఐసీ)కి ప్రభుత్వ భూములను ఉచితంగా కేటాయించడం సమంజసం కాదని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేష్‌ కుమార్‌ అభిప్రాయపడ్డారు. పారిశ్రామిక సంస్థలకు భూములను అమ్ముకునే ఏపీఐఐసీకి ప్రభుత్వం భూములను ఉచితంగా ఇవ్వాల్సిన అవసరం ఏమిటని ఆయన రెవెన్యూ అధికారులను ప్రశ్నించారు. సోమవారం సమీక్ష సందర్భంగా ఈ విషయం ప్రధానంగా ప్రస్తావనకు వచ్చింది.

రెవెన్యూ శాఖకు చెందిన భూమిని ఉచితంగా ఏపీఐఐసీకి ఎందుకు కేటాయించాలి? ఎప్పటి నుంచి ఈ విధానం అమల్లోకి వచ్చింది? అని దినేష్‌కుమార్‌ వాకబు చేశారు. గతంలో మార్కెట్‌ ధరకు కేటాయించే విధానం ఉండేదని, ప్రభుత్వ భూములను బేసిక్‌ ధరకు కేటాయించే పద్ధతి తర్వాత వచ్చిందని అధికారులు వివరించారు. ‘ప్రస్తుత ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రభుత్వ భూములను బేసిక్‌ ధరకు కాకుండా ఉచితంగానే కేటాయించాలని ఏపీఐఐసీ కోరింది. దీనిని ఆమోదిస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసిందని’ రెవెన్యూ అధికారులు వివరించారు.

నివేదిక సిద్ధం చేయండి
ఏపీఐఐసీకి భూముల కేటాయింపునకు గతంలో ఉన్న జీవోలు, తర్వాత వచ్చిన జీవోలు, ప్రస్తుతం అమల్లో ఉన్న విధానంపై సమగ్ర నివేదిక రూపొందించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదేశించారు. ఏవిధానం మంచిది? ఇందుకు ప్రామాణికాలేమిటి? అనే వివరాలతో పాటు జీవో కాపీలను కూడా జత చేసి నివేదిక రూపొందించి సమర్పించాలని సీఎస్‌ ఆదేశించారు.

దీనిపై సమీక్షించి ఏపీఐఐసీకి మార్కెట్‌ ధరకే భూములు కేటాయించడం సమంజసంగా ఉంటుందనే అభిప్రాయంతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఉన్నారు. అయితే ఆయన తీసుకునే నిర్ణయం అంతిమం కాదు. సీఎస్‌ ఈ మేరకు ప్రభుత్వానికి సిఫార్సు చేయవచ్చని, తుది నిర్ణయం మాత్రం కేబినెట్‌దే అవుతుందని ఒక అధికారి తెలిపారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top