ఆందోళన చేస్తున్న బాధితులు
నష్టపరిహారం అంచనాలో అక్రమాలు
కూటమి నాయకులతో ఏపీఐఐసీ అధికారి కుమ్మక్కు
నిర్వాసితుల జాబితాలో స్థానికేతరులు
కమీషన్ల ఆశ చూపిస్తే అధికంగా సిఫార్సు
తహసీల్దార్ కార్యాలయం వద్ద బాధితుల ఆందోళన
నక్కపల్లి: బల్క్ డ్రగ్ పార్క్, ఆర్సెలార్ మిట్టల్ స్టీల్ ప్లాంట్ కోసం నివాస ప్రాంతాలు త్యాగం చేసిన నిర్వాసితులకు చెల్లించాల్సిన నష్టపరిహారం విషయంలో ప్రభుత్వం అన్యాయం చేస్తోంది. సేకరిస్తున్న భూముల్లో తొలగించేందుకు గుర్తించిన ఇళ్లకు నష్టపరిహారం అంచనా వేయడంలో ఏపీఐఐసీ సిబ్బంది చేతివాటం ప్రదర్శిస్తున్నారు. టీడీపీ నాయకులు సూచించిన వారికి, లాంఛనాలు(కమీషన్లు) అందించే వారికి అధికంగానూ, మిగిలిన వారికి తక్కువగానూ నష్టపరిహారాన్ని అంచనా వేస్తున్నారంటూ బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ వ్యవహారంపై విచారణ జరిపి, న్యాయం చేయాలని కోరుతూ సోమవారం బాధితులంతా వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి వీసం రామకృష్ణ, సీపీఎం జిల్లా కార్యవర్గసభ్యులు ఎం.అప్పలరాజు, చందనాడ ఎంపీటీసీ గంటా తిరుపతిరావు, రైతు నాయకుడు తళ్ల భార్గవ్‌ల ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయం వద్ద ఆందోళనకు దిగారు. తహసీల్దార్ ఆర్.నరసింహమూర్తికి వినతి పత్రం ఇచ్చారు.
నిర్వాసిత జాబితాలో స్థానికేతరులు
చందనాడ పంచాయతీ తమ్మయ్యపేటలో సర్వే నెం. 90/9, 90/10లలో సుమారు 12 ఎకరాల విస్తీర్ణంలో 70 ఇళ్లు ఉన్నాయి. ఈ 12 ఎకరాలను ప్రభుత్వం స్టీల్‌ప్లాంట్ కోసం సేకరిస్తోంది. ఇందులో ఉన్న నిర్మాణాలకు నష్టపరిహారం చెల్లించాల్సి ఉంది. ఇళ్లతోపాటు, రైతులకు చెందిన పశువుల షెడ్లు కూడా ఉన్నాయి. ఇళ్లకు చదరపు అడుగుకు రూ.750 చొప్పున నష్టపరిహారం చెల్లించడానికి నిర్ణయించింది. ఏపీఐఐసీ, ఆర్‌అండ్‌బీ అధికారులు నిర్మాణాలకు విస్తీర్ణాన్ని బట్టి నష్టపరిహారం అంచనాలు తయారు చేస్తున్నారు.
ఆర్‌సీసీ శ్లాబ్ ఇళ్లకు తక్కువగా, షెడ్లు, పెంకుటిళ్లకు అధికంగా అంచనాలు తయారు చేసి, నష్టపరిహారం కోసం సిఫార్సు చేస్తున్నారని బాధితులు చెబుతున్నారు. ఎన్యూమరేషన్‌లో దయ అనే ఏపీఐఐసీ అధికారి చేతివాటం ప్రదర్శిస్తున్నారని, సదరు అధికారి కూటమి నాయకులు సూచించిన వారికి, కమీషన్లు ఆశ చూపించిన వారికి అధికంగా నష్టపరిహారం సిఫార్సు చేశారని పేర్కొన్నారు. ఈ సర్వే నంబర్లలో 70 మంది మాత్రమే ఇళ్లు నిర్మించుకుని ఎప్పటినుంచో కాపురాలు చేస్తుంటే దాదాపు 50 మంది స్థానికేతరులను అదనంగా నిర్వాసితుల జాబితాల్లో చేర్చారని విమర్శిస్తున్నారు. అనర్హులు, స్థానికేతరుల జాబితాను తహసీల్దార్‌కు అందించారు.
వివరాల నమోదులో పక్షపాతం
ఆరు సెంట్ల విస్తీర్ణంలో రెండు ఆర్‌సీసీ శ్లాబ్ ఇళ్లు కలిగిన దొరబాబు అనే నిర్వాసితుడికి కేవలం రూ.6 లక్షల నష్టపరిహారం సిఫార్సు చేసి, రెండు సెంట్ల స్థలంలో వేరొకరి రేకుల షెడ్డుకు రూ.5 లక్షల పరిహారానికి సిఫార్సు చేశారని బాధితులు పేర్కొన్నారు. ఒకే ఇంటికి సంబంధించి ఇద్దరు నివసిస్తుంటే ఒకరికి అదనంగా, మరొకరికి తక్కువగా పరిహారం చెల్లించేందుకు సిఫార్సు చేసినట్లు వివరించారు. తాము ఇచ్చిన ఫిర్యాదులపై బహిరంగ విచారణ జరిపి, బాధ్యులైన వారిపై చర్యలు తీసుకునేవరకు నష్టపరిహారం తీసుకోబోమని, ఇళ్లను కూడా ఖాళీ చేసేది లేదని స్పష్టం చేశారు. ఈ ఫిర్యాదులపై విచారణ జరిపిస్తామని, డీఈ స్థాయి అధికారి నేతృత్వంలో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి ఎన్యూమరేషన్ చేయిస్తామని తహసీల్దార్ హామీ ఇచ్చారు.


