ఎన్‌ఐఏ ఎఫ్‌ఐఆర్‌ను రద్దు చేయండి | AP State govt Petition in the High Court about Murder Attempt on YS Jagan | Sakshi
Sakshi News home page

ఎన్‌ఐఏ ఎఫ్‌ఐఆర్‌ను రద్దు చేయండి

Jan 20 2019 4:18 AM | Updated on Mar 28 2019 5:32 PM

AP State govt Petition in the High Court about Murder Attempt on YS Jagan - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై విశాఖపట్నం విమానాశ్రయంలో జరిగిన హత్యాయత్నం దర్యాప్తు బాధ్యతలను జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ)కు అప్పగిస్తూ కేంద్ర హోంశాఖ జారీ చేసిన ఉత్తర్వును సవాలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించింది. కేంద్ర ప్రభుత్వ ఉత్తర్వు, తదనుగుణంగా ఎన్‌ఐఏ నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ను చట్ట విరుద్ధంగా ప్రకటించి, వాటిని రద్దు చేయాలని కోరుతూ రాష్ట్ర హోం శాఖ ముఖ్య కార్యదర్శి ఏఆర్‌ అనురాధ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఇందులో కేంద్ర హోంశాఖ కార్యదర్శి, ఎన్‌ఐఏ డైరెక్టర్‌ జనరల్, ఎన్‌ఐఏ డిప్యూటీ ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌ను ప్రతివాదులుగా పేర్కొన్నారు.

ప్రస్తుతం హైకోర్టుకు సంక్రాంతి సెలవులు ఉన్న నేపథ్యంలో ఈ వ్యాజ్యంపై హౌస్‌మోషన్‌ (న్యాయమూర్తి ఇంటి వద్ద)రూపంలో విచారణ జరపాలని అభ్యర్థించారు. అయితే హౌస్‌మోషన్‌గా విచారించేందుకు హైకోర్టు నిరాకరించింది. అత్యవసరంగా విచారించాల్సినది ఈ వ్యాజ్యంలో ఏమీ లేదని తేల్చి చెప్పింది. సంక్రాంతి సెలవుల అనంతరం సోమవారం నుంచి హైకోర్టు పునః ప్రారంభమవుతున్న నేపథ్యంలో ఈ వ్యాజ్యంపై ఆ రోజు న్యాయమూర్తి ముందు ప్రస్తావించే అవకాశం ఉంది. 

హత్యాయత్నం చిన్న విషయం...
జగన్‌పై జరిగిన హత్యాయత్నం ఘటనను రాష్ట్ర ప్రభుత్వం తన పిటిషన్‌లో చాలా చిన్న విషయంగా అభివర్ణించింది. ఇంత చిన్న విషయంపై కేంద్ర ఎన్‌ఐఏ దర్యాప్తునకు ఆదేశించడంపై అభ్యంతరం వ్యక్తం చేసింది. శాంతి, భద్రతల వ్యవహారం పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోనిదని, ఇందులో జోక్యం చేసుకునే అధికారం కేంద్రానికి లేదని తన 13 పేజీల పిటిషన్‌లో పేర్కొంది. ఎన్‌ఐఏ దర్యాప్తునకు కేంద్రం ఆదేశించినపుడు అందుకు కారణాలను తెలియచేయాలంది. అయితే ఈ కేసు విషయంలో  తన ఉత్తర్వులో ఎటువంటి కారణాలను పేర్కొనలేదని తెలిపింది. జగన్‌పై జరిగిన దాడిని చాలా చిన్న విషయంగా తాము భావిస్తున్నామని తెలిపింది. దీనికీ పౌర విమానయాన భద్రతకూ ఎటువంటి సంబంధం లేదని వివరించింది.

కేంద్ర హోంశాఖ ఉత్తర్వు, ఎన్‌ఐఏ ఎఫ్‌ఐఆర్‌ చట్ట విరుద్ధమని, ఏకపక్షంగా తీసుకున్న నిర్ణయమని ఆరోపించింది. ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) దర్యాప్తునకు సంబంధించిన రికార్డులను, ఇతర మెటీరియల్‌ను స్వాధీనం చేయాలని ఎన్‌ఐఏ అధికారులు ఒత్తిడి చేస్తున్నారని, అందువల్ల ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేస్తున్నామని తెలిపింది. ఈ కేసులో ఉన్న అత్యవసరం దృష్ట్యా దీనిపై అత్యవసర విచారణ జరపాల్సిన అవసరం ఉందంది. కేంద్ర ప్రభుత్వ ఉత్తర్వు, ఎన్‌ఐఏ ఎఫ్‌ఐఆర్‌కు సంబంధించిన తదుపరి చర్యలన్నింటినీ నిలిపేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలని అభ్యర్థించింది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement