ఆంగ్ల మీడియానికి జనామోదం

ap people appreciate cm jagan english mediumon in govt schools - Sakshi

ముఖ్యమంత్రి జగన్‌ నిర్ణయాన్ని స్వాగతిస్తున్న విద్యావేత్తలు, తల్లిదండ్రులు  

సాక్షి, అమరావతి: ప్రభుత్వ పాఠశాలల్లో వచ్చే ఏడాది నుంచి పూర్తిగా ఇంగ్లిష్‌ మీడియంలో విద్యాబోధన చేపట్టాలన్న రాష్ట్ర ప్రభుత్వ విప్లవాత్మక నిర్ణయం అతి పెద్ద చర్చకు దారితీసింది. ముఖ్యమంత్రి జగన్‌ నిర్ణయాన్ని సామాన్య ప్రజానీకం, విద్యార్థుల తల్లిదండ్రులు, మెజార్టీ విద్యావేత్తలు, సామాజికవేత్తలు సంపూర్ణంగా సమర్థిస్తున్నారు. ఒక్క చోట కూడా విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి వ్యతిరేకత వ్యక్తం కాకపోవడం ప్రభుత్వ నిర్ణయం పట్ల ప్రజామోదానికి నిదర్శనం. పేద, మధ్య తరగతి విద్యార్థుల భవితకు బంగారు బాట వేసే ఈ నిర్ణయాన్ని కూడా ప్రతిపక్ష టీడీపీ, జనసేన ఆనవాయితీగా విమర్శించడం విస్మయపరిచింది.  

నాలుగేళ్లలో అన్ని తరగతుల్లో బోధన..
వర్తమాన పోటీ ప్రపంచంలో ఉపాధి అవకాశాలు అందిపుచ్చుకునేందుకు కమ్యూనికేషన్‌ స్కిల్స్, నైపుణ్యాలు పెంపొందించుకోవడం ఏకైక మార్గమన్నది నిర్వివాదాంశం. తెలుగు మీడియం విద్యార్థులు ఈ అంశంలో వెనుకబడుతుండటం వల్ల నష్టపోవాల్సి వస్తోంది. ఆధునిక విజ్ఞానం అంతా ఇంగ్లిష్‌లోనే అందుబాటులో ఉంది. ఈ సమస్యలకు పరిష్కారంగా ప్రభుత్వ పాఠశాలల్లో పూర్తిగా ఇంగ్లిష్‌ మీడియంలో బోధనను ప్రవేశపెడతామని ముఖ్యమంత్రి జగన్‌ ప్రకటించారు. వచ్చే ఏడాది నుంచి ఒకటో తరగతి నుంచి ఆరో తరగతి వరకు పూర్తిగా ఇంగ్లిష్‌ మీడియంలో విద్యాబోధన అమలు చేస్తారు. నాలుగేళ్లలో అన్ని తరగతులు పూర్తిగా ఇంగ్లిష్‌ మీడియంలో బోధించేలా చర్యలు చేపడతారు. ఉపాధ్యాయులకు ఇంగ్లిష్‌ మీడియంలో బోధనపై తగిన శిక్షణ ఇచ్చేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అయితే తెలుగు లేదా ఉర్దూ తప్పనిసరి సబ్జెక్టుగా కొనసాగుతాయని ముఖ్యమంత్రి జగన్‌ స్పష్టం చేశారు. తెలుగు భాష అభ్యున్నతికి కట్టుబడి ఉన్నామని ప్రభుత్వం విస్పష్టంగా ప్రకటించింది.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top