ఎమ్మెల్యే నిధులకు మంగళం | ap MLA quota funds not release | Sakshi
Sakshi News home page

ఎమ్మెల్యే నిధులకు మంగళం

Mar 20 2015 3:52 AM | Updated on Sep 2 2017 11:06 PM

ఎమ్మెల్యే నిధులకు మంగళం

ఎమ్మెల్యే నిధులకు మంగళం

ఎమ్మెల్యే కోటా నిధులుగా పిలిచే అసెంబ్లీ నియోజకవర్గ అభివృద్ధి (ఏసీడీపీ) నిధులకు రాష్ట్ర ప్రభుత్వం మంగళం పాడేసింది.

 ఏలూరు :ఎమ్మెల్యే కోటా నిధులుగా పిలిచే అసెంబ్లీ నియోజకవర్గ అభివృద్ధి (ఏసీడీపీ) నిధులకు రాష్ట్ర ప్రభుత్వం మంగళం పాడేసింది. దీంతో నియోజకవర్గాలను అభివృద్ది చేసే విషయంలో ఎమ్మెల్యేలు ఆమడదూరంలో నిలబడాల్సిన దుస్థితి తలెత్తింది. బడ్జెట్‌లో ఏసీడీపీ కింద కేటాయింపులు చేయకపోవడంతో ఎమ్మెల్యేలు ఒకింత ఆవేదనకు గురవుతున్నారు. తెలంగాణ సర్కారు ప్రతి ఎమ్మెల్యేకి రూ.2 కోట్ల చొప్పున నిధులను విడుదల చేసింది. ఏపీ సర్కారు మాత్రం మొండిచెయ్యి చూపించింది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ఏటా రూ.కోటి చొప్పున నిధులు కేటాయించేవారు.
 
 2015-16 బడ్జెట్‌లో టీడీపీ సర్కార్ ఆ నిధుల ఊసే ఎత్తకపోవడంతో ఎమ్మెల్యేలు ప్రజలకు ఏ విధమైన హామీలు ఇవ్వకుండా తప్పించుకుని తిరగాల్సిన దుస్థితి దాపురించింది. ఉత్తచేతులతో నియోజకవర్గాల్లో తిరగలేక మొహం చాటేయాల్సి వస్తుందని ఎమ్మెల్యేలు మదనపడుతున్నారు. చిన్నపాటి సమస్యలను సైతం పరిష్కరించాలంటే స్థానిక సంస్థలకు సిఫార్సు చేయడం మినహా ఏమీ చేయలేని నిస్సహాయత దాపురించిందని ఎమ్మెల్యేలు వాపోతున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నిధులు ఇవ్వకుండా ఎమ్మెల్యేలను ఉత్సవ విగ్రహాలుగా మార్చేశారని ఒక ప్రజాప్రతినిధి వ్యాఖ్యానించారు. కాగా గత ప్రభుత్వాల హయాంలో మంజూరు చేసిన పనులను సైతం నిలిపివేస్తూ ఉత్తర్వులు ఇవ్వడం కూడా ఎమ్మెల్యేలకు కొరుకుడు పడటం లేదు.
 
 ఎంపీ నిధులే ఆధారం
 నియోజకవర్గాల్లో కీలకమైన సమస్యలు, కొత్త ప్రాజెక్టులకు అవసరమైన నిధుల కోసం ఎమ్మెల్యేలంతా ఎంపీలను ఆశ్రయించాల్సి ఉంటుంది. ఒక్కొక్క ఎంపీకి గడచిన సంవత్సరంలోనే రూ.5 కోట్ల చొప్పున కేటాయించగా, ఆ మేరకు పనులు చేపట్టేందుకు ప్రతిపాదనలు కూడా వెళ్లాయి. ఇందులోనే ఎంపీలు ఎంపిక చేసుకున్న దత్తత గ్రామాలకు నిధులు ఖర్చు చేయాల్సి ఉంది. ఈ పరిస్థితుల్లో ఎమ్మెల్యేలు కోరిన పనులకు ఎంపీలు ఏమేరకు నిధులు కేటాయిస్తారనేది సందేహంగానే ఉంది. నిధులు కోసం పోరాటం చేసే పరిస్థితి లేదని, జిల్లాకు అన్నివిధాలా న్యాయం చేస్తామని చెప్పిన సీఎం చంద్రబాబును కలిసి కొన్ని ప్రాజెక్టులకైనా మంజూరు చేయించుకుందామన్నా ఆయన ఆ మేరకు స్పందించే పరిస్థితి లేదని ఎమ్మెల్యేలు వాపోతున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement