జెన్‌కో చీఫ్ ఇంజినీర్ నిర్బంధం | AP JENKO chief engineer detention | Sakshi
Sakshi News home page

జెన్‌కో చీఫ్ ఇంజినీర్ నిర్బంధం

Oct 9 2013 3:39 AM | Updated on Mar 28 2019 5:32 PM

సమైక్యాంధ్ర ఉద్యమాన్ని దెబ్బ తీయడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపిస్తూ ఏపీజెన్‌కో మోతుగూడెం విభాగం చీఫ్ ఇంజినీర్‌ను డొంకరాయి విద్యుదుత్పత్తి కేంద్రం ఉద్యోగులు మంగళవారం నిర్బంధించారు.

సీలేరు, న్యూస్‌లైన్ :
 సమైక్యాంధ్ర ఉద్యమాన్ని దెబ్బ తీయడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపిస్తూ ఏపీజెన్‌కో మోతుగూడెం విభాగం చీఫ్ ఇంజినీర్‌ను డొంకరాయి విద్యుదుత్పత్తి కేంద్రం ఉద్యోగులు మంగళవారం నిర్బంధించారు. చీఫ్ ఇంజనీర్ కృష్ణయ్య తమను విధులకు హాజరు కాకపోతే చర్యలు తీసుకుంటామని బెదిరిస్తున్నారని ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము సమ్మె చేస్తుండగా కృష్ణయ్య కొందరు ఉద్యోగులతో ముందే డొంకరాయిలో గేట్లు ఎత్తించి నీటిని విడుదల చేయించారని వీరు ఆరోపించారు. సీఈ వైఖరిని నిరసిస్తూ వారు స్థానిక తెలంగాణ ఉద్యోగులతో కలిసి ఆయన్ను ఓ గదిలో నిర్బంధించారు. విషయం తెలుసుకున్న స్థానిక పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని సంప్రదింపులు చేపట్టారు. దాంతో సుమారు రెండు గంటల పాటు ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
 
  ఎట్టకేలకు సీఈ సమైక్యాంధ్రకు అనుకూలంగా నినాదాలు చేయడంతో విడిచిపెట్టారు. అయితే ఆయన తిరిగి వెళ్లే దారిలో చెట్లు నరికి పడేశారు. అనంతరం జేఏసీ నాయకులు మాట్లాడుతూ రాష్ట్ర విభజన జరగదని ప్రకటించే వరకు ఉద్యమాన్ని ఆపేది లేదని స్పష్టం చేశారు. తెలంగాణ అధికారుల బెదిరింపులకు లొంగేదిలేదని తెలిపారు. మంగళవారం ఉదయం నుంచి సమ్మె కారణంగా 25 మెగావాట్ల విద్యుదుత్పత్తికి అంతరాయం ఏర్పడింది.  220 కేవీ లైన్‌ద్వారా విజయవాడ వెళ్లే విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.  
 
 మాచ్‌ఖండ్‌లో కాస్త మెరుగు
 ఆంధ్రా-ఒడిశా రాష్ట్రాలు ఉమ్మడిగా నిర్మించిన మాచ్‌ఖండ్ జలవిద్యుత్ కేంద్రంలో 57 మెగావాట్ల విద్యుదుత్పత్తిని మంగళవారం ఉదయం పునఃప్రారంభించారు. దీంతో యథాప్రకారం విద్యుత్తు సరఫరా అవుతోంది. మాచ్‌ఖండ్‌లోని కొన్ని యూనిట్లు ట్రిప్ కావడంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. అయితే ఒడిశా జెన్‌కో అధికారులు వెంటనే బాగుచేసి విద్యుత్ సరఫరాను పునరుద్ధరించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement