డాక్టర్‌ వాంగ్మూలాన్ని నమోదు చేయండి

AP High Court Mandate on issue of Anesthesia Doctor Sudhakar - Sakshi

మత్తు వైద్యుడు సుధాకర్‌ వ్యవహారంలో హైకోర్టు ఆదేశం  

సాక్షి, అమరావతి: మానసిక వైద్యశాలలో చికిత్స పొందుతున్న అనస్తీషియా వైద్యుడు సుధాకర్‌ వాంగ్మూలాన్ని నమోదు చేయాలని విశాఖపట్నం జిల్లా జడ్జిని హైకోర్టు ఆదేశించింది. ఈమేరకు వాంగ్మూలం నమోదు నిమిత్తం మేజిస్ట్రేట్‌ను సుధాకర్‌ వద్దకు పంపాలని సూచించింది. గురువారం సాయంత్రం కల్లా వాంగ్మూలాన్ని సీల్డ్‌ కవర్‌లో తమ ముందుంచాలని మేజిస్ట్రేట్‌ను హైకోర్టు ఆదేశించింది. మరోవైపు డాక్టర్‌ సుధాకర్‌ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రిని అసభ్య పదజాలంతో దూషించిన వీడియో క్లిప్పింగులను తమ ముందు ఉంచాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్‌ రాకేష్‌కుమార్, జస్టిస్‌ కంచిరెడ్డి సురేష్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. దీనిపై తదుపరి విచారణను ఈనెల 22కి వాయిదా వేసింది. 

వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా హాజరు పరుస్తాం
డాక్టర్‌ సుధాకర్‌ విషయంలో అధికారులు అమానుషంగా ప్రవర్తించారని, దీనిపై జోక్యం చేసుకోవాలంటూ మాజీ ఎమ్మెల్యే, టీడీపీ మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత హైకోర్టుకు లేఖ రాశారు. దీంతోపాటు ఓ వీడియోను కూడా జత చేశారు. అయితే ఆ వీడియోను ఎడిట్‌ చేసి ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ఫోటోను జత చేశారు. ఈ వ్యవహారాన్ని సుమోటో పిల్‌గా పరిగణించిన హైకోర్టు ధర్మాసనం బుధవారం మరోసారి విచారణ జరిపింది. ఈ కేసులో ధర్మాసనం ఆదేశాల మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కౌంటర్‌ దాఖలు చేశారని ప్రభుత్వ న్యాయవాది వైఎన్‌ వివేకానంద తెలిపారు. కౌంటర్‌ను ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేశామని వివరించారు.

డాక్టర్‌ సుధాకర్‌ను ప్రత్యక్షంగా కోర్టు ముందు హాజరు పరిచే పరిస్థితి లేదని, ఏడు గంటల పాటు ఆయన ప్రయాణం చేసే స్థితిలో లేరని, వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ఆయన్ను హాజరుపరుస్తామని కోర్టుకు నివేదించారు. ఈ అభ్యర్థనతో అనుబంధ పిటిషన్‌ కూడా దాఖలు చేశామన్నారు. కౌంటర్‌ కాపీ ప్రత్యక్షంగా తమ ముందు లేకపోవడంతో విచారణను వాయిదా వేయాలని ధర్మాసనం నిర్ణయించింది. కాగా, ఈ సమయంలో కోర్టు సహాయకారిగా వ్యవహరిస్తున్న సీనియర్‌ న్యాయవాది పి.వీరారెడ్డి జోక్యం చేసుకుంటూ డాక్టర్‌ సుధాకర్‌ ఒంటిపై గాయాలున్నాయో లేదో పరిశీలించాల్సిన అవసరం ఉందని, ఆయన్ను మేజిస్ట్రేట్‌ ముందు హాజరుపరిచేలా పోలీసులను ఆదేశించాలని కోరారు.

ఆస్పత్రిలో వైద్యుడి వాంగ్మూలం నమోదు
పెదవాల్తేరు (విశాఖ తూర్పు): ప్రభుత్వ మానసిక ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న డాక్టర్‌ సుధాకర్‌ వాంగ్మూలాన్ని విశాఖ జిల్లా కోర్టు సెషన్స్‌ జడ్జి శ్రీనివాసరెడ్డి బుధవారం సాయంత్రం నమోదు చేశారు. హైకోర్టు ఆదేశాల మేరకు ఆస్పత్రిలోని ప్రత్యేక వార్డులో చికిత్స పొందుతున్న వైద్యుడి వద్దకు చేరుకుని వాంగ్మూలాన్ని నమోదు చేశారు. సెషన్స్‌ జడ్జి వెంట ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ రాధారాణి, మూడో పట్టణ సీఐ కె.రామారావు తదితరులున్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top