
సాక్షి, హైదరాబాద్: నాగార్జునసాగర్ ఎడమ కాలువ మూడో జోన్‌లోని పంటలను కాపాడుకునేందుకు రోజుకు 1,500 క్యూసెక్కుల చొప్పున ఈ నెల 10 వరకు నీటిని విడుదల చేసేలా తెలంగాణ అధికారులను ఆదేశించాలని కృష్ణా బోర్డును ఏపీ ఈఎన్‌సీ ఎం.వెంకటేశ్వరరావు కోరారు. ఈ మేరకు మంగళవారం ఆయన కృష్ణా బోర్డు సభ్య కార్యదర్శి ఎ.పరమేశంకు లేఖ రాశారు. కృష్ణా బోర్డు మార్చి 20న నాగార్జునసాగర్ ఎడమ కాలువకు నాలుగు టీఎంసీలను కేటాయించింది.
అప్పటినుంచి నాగార్జున ఎడమ కాలువ ద్వారా ఏపీ సరిహద్దుకు రోజుకు వెయ్యి క్యూసెక్కుల చొప్పున ఈ నెల 2 వరకు విడుదల చేశారు. అయితే కాలువలో నీటి మట్టం అంతంత మాత్రంగానే ఉండటంతో విడుదల చేసిన నీరు చివరి ఆయకట్టు వరకు అందడం లేదు. దీంతో పంటలు ఎండిపోతున్నాయని.. నీళ్లందించి కాపాడాలంటూ రోజూ రైతులు ఆందోళన చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రోజుకు కనీసం 1,500 క్యూసెక్కులు విడుదల చేయాలని ఏపీ ఈఎన్‌సీ బోర్డును కోరారు. తమకు కేటాయించిన కోటాలో ఇంకా 2.09 టీఎంసీలు మిగిలి ఉన్నాయని లేఖలో గుర్తు చేశారు.