బాధితులకు.. సర్కారు ఆపన్నహస్తం | AP Govt Helping Hand To Visakha Gas Leak victims | Sakshi
Sakshi News home page

బాధితులకు.. సర్కారు ఆపన్నహస్తం

May 9 2020 4:53 AM | Updated on May 9 2020 4:53 AM

AP Govt Helping Hand To Visakha Gas Leak victims - Sakshi

విశాఖ గ్యాస్‌ లీక్‌ ఘటన బాధితుల కోసం సుజాత నగర్‌లో ఏర్పాటు చేసిన షెల్టర్‌ను సందర్శించిన జిల్లా ఇన్‌చార్జి మంత్రి కన్నబాబు, మంత్రులు అవంతి శ్రీనివాస్, బొత్స సత్యనారాయణ, ఆళ్ల నాని, ధర్మాన కృష్ణదాస్‌ తదితరులు

విశాఖ సిటీ: విశాఖలో గురువారం విషవాయువు లీకేజీ ప్రమాదంతో భయాందోళనలకు గురైన స్థానిక గ్రామాల ప్రజలకు ప్రభుత్వం ఆపన్నహస్తం అందిస్తోంది. మొత్తం 29 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసింది. పెందుర్తి, సింహాచలం, గోశాల ప్రాంతాల్లో పలు కల్యాణ మండపాల్లో 20 వేల మందికి సరిపడ సౌకర్యాలను కల్పించింది. ఓ పక్క కరోనా పొంచి ఉండటంతో తగిన జాగ్రత్తలు తీసుకుంటూ జీవీఎంసీ, రెవెన్యూ అధికారులు ప్రజల యోగక్షేమాలు చూస్తున్నారు. ప్రమాదం తర్వాత వెంకటాపురంలో ఉన్న 1,250 ఇళ్లలో సుమారు 8వేల మందిని, నందమూరినగర్‌లో చెందిన 2,250 మందిని, కంపరపాలెంలో 250 ఇళ్ల నుంచి 1,200 మందిని, పద్మనాభ నగర్‌లో 500 కుటుంబాల నుంచి 2,500 మందిని, ఎస్సీ, బీసీ కాలనీలో 480 ఇళ్ల నుంచి 2 వేల మందిని అధికారులు పునరావాస కేంద్రాలకు తరలించారు.   

మెనూ ప్రకారం భోజనం 
పునరావాస కేంద్రాల్లో ఉదయం అల్పాహారంతోపాటు మధ్యాహ్నం భోజనం, సాయంత్రం పండ్లు, రాత్రికి మళ్లీ భోజనం లేదా టిఫిన్‌ పెడుతున్నారు. గర్భిణులు, ఆరోగ్య సమస్యలు ఉన్న వారిపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. వారికి అవసరమైన మందులు, ఇతర సామగ్రిని పంపిణీ చేస్తున్నారు. మరోవైపు యువత, స్వచ్ఛంద సేవా సంస్థలు అల్పాహారం, మజ్జిగ, అరటి పండ్లు అందిస్తున్నాయి. ప్రభుత్వం తమకు అన్నివిధాల అండగా ఉందని బాధితులు చెబుతున్నారు. మరో రెండు, మూడు రోజులు ఆయా గ్రామాల ప్రజలకు పునరావాస కేంద్రాల్లోనే భోజనం అందిస్తారు. 

ఇబ్బంది లేకుండా చూసుకుంటున్నారు
మాది పాలిమర్స్‌ కంపెనీకి సమీపంలో ఉన్న కృష్ణానగర్‌. గురువారం వేకువజామున విడుదలైన విషవాయువు కారణంగా ఊపిరి తీసుకోవడం కష్టంగా మారింది. తను నిండు గర్భిణి కావడంతో నాకు కాళ్లు చేతులూ ఆడలేదు. కాసేపటికే అధికారులు వచ్చి మమ్మల్ని సురక్షిత ప్రాంతానికి తరలించి గోశాలలో ఆశ్రయం కల్పించారు. ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటున్నారు. 
– భారతి, శ్రీను దంపతులు

ప్రభుత్వం బాగా చూసుకుంటోంది
గ్యాస్‌ బయటకు రావడంతో ఊపిరి ఆడక అందరం పరుగులు తీశాం. ఇంతలో స్థానిక యువకులు మమ్మల్ని ఆటోలో బయటకు పంపేశారు. అధికారులు బస్సులో ఇక్కడికి తీసుకొచ్చారు. ప్రభుత్వం సమయానికి భోజనం, పిల్లలకు కావల్సిన పదార్థాలు అందిస్తూ బాగా చూసుకుంటోంది.
– రాములమ్మ, వెంకటాపురం

మాకు ఎలాంటి ఇబ్బందీలేదు
గ్యాస్‌ లీకైన కొద్దిసేపటికే రోడ్డు మీద ఉన్న మమ్మల్ని వెంటనే గోశాలకు తరలించారు. పిల్లాపాపలతో వచ్చినా మాకు ఇక్కడ ఏ ఇబ్బందీ లేదు. అధికారులతో పాటు స్వచ్ఛంద సంస్థలు కూడా ఆహారం అందిస్తున్నాయి. 
– సింహాచలం, వెంకటాపురం

ప్రభుత్వ చేయూత మరిచిపోలేం
రాష్ట్ర ప్రభుత్వం, అధికారులు, పోలీసులు, సహాయక బృందాలు సకాలంలో స్పందించడం వల్లే బతికి బట్టకట్టామని ఎల్‌జీ పాలిమర్స్‌ గ్యాస్‌ లీక్‌ బాధితులు చెప్పారు. కేజీహెచ్‌లో మెరుగైన వైద్య సేవలు అందుతున్నాయని, వైద్యులు, ఇతర సిబ్బంది తమను కంటికి రెప్పలా కాపాడుతున్నారని వివరించారు. ప్రస్తుతం తామంతా తేరుకున్నామని, సాక్షాత్తు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వచ్చి ధైర్యం చెప్పడం మర్చిపోలేమన్నారు. బాధితుల మనోగతం వారి మాటల్లోనే..

పాప ఆరోగ్యం కుదుటపడింది
ఆస్పత్రిలో చేర్చిన వెంటనే వైద్యులు మెరుగైన చికిత్స అందించడం వల్ల ఆరోగ్యంగా ఉంది. ప్రభుత్వ యంత్రాంగం, వైద్యులు సకాలంలో స్పందించడం వల్ల అందరూ బతికారు.
– పిల్లి రామలక్ష్మి, అఖిలప్రియ తల్లి

వైద్యుల సేవలు మరువలేం
నా ఇద్దరు పిల్లలకు కేజీహెచ్‌లో అందిస్తున్న వైద్య సేవలు మరువలేనివి. ప్రభుత్వం, రెస్క్యూ టీమ్‌లు సకాలంలో స్పందించడం వల్ల మరణాలు తగ్గాయి.
–భారతి, ఇద్దరు చిన్నారుల తల్లి

బతుకుతా అనుకోలేదు
ప్రమాదం జరిగిన 8 గంటల తరువాత ఆస్పత్రిలో కళ్లు తెరిచాను. అసలు బతుకుతాననుకోలేదు. 
    – అంబటి సిద్ధేశ్వరరావు, బాధితుడు

సీఎం కృషి వల్లే..
ఆస్పత్రిలో చేర్చిన వారందరికీ మంచి వైద్యం అందిస్తున్నారు. సీఎం జగన్‌మోహన్‌రెడ్డి కృషి వల్లనే ఇదంతా సాధ్యపడుతోంది. ఆయనకు మా కృతజ్ఞతలు.    
 – దాసరి బిందు, బాధితురాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement