ఏపీ గవర్నర్ వినూత్న నిర్ణయం

AP Governor Biswabhusan Donates 30 Lakhs To CM Relief Fund - Sakshi

విచక్షణ అధికారాల సద్వినియోగంతో ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ. 30 లక్షలు విరాళం

సాక్షి, అమరావతి: కరోనా వైరస్ నివారణ చర్యలకు సహకరించే క్రమంలో ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్ వినూత్న నిర్ణయం తీసుకున్నారు. ప్రధాని పిలుపు మేరకు తన జీతంలో సంవత్సరం పాటు ముప్పయి శాతం కోతకు ఇప్పటి కే ముందుకు రాగా తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర ప్రథమ పౌరునిగా తనకున్న విచక్షణ అధికారాలను సద్వినియోగపరుస్తూ, 30 లక్షల రూపాయలను ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళంగా సమకూర్చారు. రాజ్ భవన్ బడ్జెట్ కు  సంబంధించి నిధుల వినియోగంలో గవర్నర్ కు విశేష విచక్షణ అధికారాలు ఉంటాయి. ఈ మేరకు గవర్నర్ తరపున రాజ్ భవన్ కార్యదర్శి ముకేష్ కుమార్ మీనా శుక్రవారం ఆదేశాలు జారీచేశారు.
(కరోనాపై తప్పుడు వార్తలు, భారతీయ టెకీకి షాక్)

కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకునే క్రమంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో చర్యలను చేపడుతున్న నేపధ్యంలో ప్రభుత్వాలకు ఆర్థిక పరమైన వెసులుబాటు కోసం రాష్ట్ర రాజ్యాంగ అధినేత ఈ చర్యకు ఉపక్రమించారు. ముప్పయి లక్షల రూపాయలను ముఖ్యమంత్రి సహాయ నిధికి సమకూర్చిన తరుణంలో ఆ మేరకు రాజ్ భవన్ లో పొదుపు చర్యలు తీసుకోవాలని తన కార్యదర్శి ముకేష్ కుమార్ మీనాను గవర్నర్ ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్ గవర్నర్ తీసుకున్న ఈ నిర్ణయం ఇతర రాష్ట్రాల రాజ్ భవన్ లకు సైతం ఆదర్శంగా నిలుస్తుందని,  స్వయంగా తన ఖర్చులను తగ్గించుకుని ముఖ్యమంత్రి సహాయ నిధికి నిధులు సమకూర్చడం స్ఫూర్తి నిస్తుందని విశ్లేషకులు చెబుతున్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top